నైట్‌‌క్లబ్‌‌లో మంటలు.. 59 మంది మృతి

నైట్‌‌క్లబ్‌‌లో మంటలు.. 59 మంది మృతి
  • నార్త్‌‌ మాసిడోనియాలో ఘోరం 

స్కాపియో: యూరప్‌‌లోని నార్త్ మాసిడోనియాలో ఘోరం జరిగింది. నైట్‌‌క్లబ్‌‌లో మంటలు అంటుకుని 59 మంది చనిపోయారు. 155 మంది గాయపడ్డారు. కొకణి సిటీలోని పల్స్‌‌ నైట్‌‌క్లబ్‌‌లో శనివారం రాత్రి లైవ్ పెర్ఫామెన్స్ నిర్వహించారు. ఇందులో ఇద్దరు ప్రముఖ హిప్‌‌హప్ స్టార్లు పాల్గొనగా, 1,500 మంది ఆడియెన్స్ హాజరయ్యారు. అయితే శనివారం అర్ధరాత్రి 2 గంటల టైమ్‌‌లో క్లబ్‌‌లో అగ్నిప్రమాదం జరిగింది. వేదిక వద్ద సీలింగ్‌‌కు మంటలు అంటుకుని, అవి క్లబ్ అంతటా వ్యాపించాయి. 

పెద్ద ఎత్తున పొగ అలుముకుంది. ఫైర్ సిబ్బంది గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. స్పెషల్ ఎఫెక్ట్‌‌ కోసం వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫైర్ క్రాకర్స్ వల్లనే మంటలు అంటుకుని ఉంటాయని అధికారులు అనుమానిస్తున్నారు. ‘‘మండే స్వభావం ఉన్న మెటీరియల్‌‌తో క్లబ్‌‌లో సీలింగ్ తయారు చేశారు. 

కాన్సర్ట్ జరుగుతున్న టైమ్‌‌లో వెలుగులు విరజిమ్మే క్రాకర్స్‌‌ను పేల్చినప్పుడు, ఆ నిప్పు రవ్వలు సీలింగ్‌‌ను తాకి మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత క్లబ్ అంతటా మంటలు వ్యాపించాయి” అని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. గాయపడినోళ్లను ఆస్పత్రులకు తరలించి, ట్రీట్మెంట్ అందిస్తున్నామని పేర్కొంది.