- జనగామలో కానరాని భద్రత
- ఇష్టారాజ్యంగా దుకాణాలు
- ప్రమాదకరంగా పటాకుల దుకాణాల నిర్వాహణ
- పట్టించుకోని ఆఫీసర్లు
జనగామ, వెలుగు: జనగామ దుకాణ సముదాయాల్లో ఫైర్ సేఫ్టీ కరువైంది. జిల్లా కేంద్రంగా ఏర్పాటైన తర్వాత వ్యాపారాలు పెరిగాయి. పలు షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు, హాస్పిటల్స్ వెలిశాయి. వీటిలో ఎక్కడా ఫైర్ సేఫ్టీ పరికరాలు కానరావడం లేదు. ప్రమాదకరమైన పటాకుల దుకాణాలు పట్టణ నడిబొడ్డున యథేచ్ఛగా నడుస్తున్నా, పట్టించుకున్నవారు లేరు.
సేఫ్టీ పై పట్టింపేదీ..
జనగామ నెహ్రూ పార్క్ రోడ్ లో ఆదివారం విజయ, శ్రీ లక్ష్మీ షాపింగ్ మాల్, ఎస్ఆర్ బ్రదర్స్ బట్టల దుకాణాలు కాలి బూడిదైన విషయం తెలిసిందే. ఈ మూడింటికి ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం భారీ ప్రమాదం జరిగిందనే ఆరోపణలున్నాయి. సిద్దిపేట మెయిన్ రోడ్ పై ఈ షాపులు ఉండగా, ఫైర్ ఇంజన్లు సులువుగా తిరిగే అవకాశం లేకపోయింది. ఈ నేపథ్యంలో తొలుత కేవలం విజయ షాపింగ్ మాల్ లో మాత్రమే మంటలు చెలరేగగా, సమీపంలోని షాపులకు విస్తరించకుండా ఆపలేకపోయారు. జనగామ ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ల పని తీరుపై జనం అసహనం వ్యక్తం చేస్తున్నారు. సమీపంలోని స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి, వరంగల్, హనుమకొండ, ఆలేరు, భువనగిరి ఫైర్ ఇంజన్లు రప్పించినా అవి ఇక్కడకు చేరుకునే లోపు మంటల తీవ్రత పెరిగి భారీగా నష్టం జరిగింది. మరిన్ని షాపులకు విస్తరించకుండా మాత్రం ఆపగలిగారు.
నగరం నడిబొడ్డున పటాకుల దుకాణాలు..
జన సంచారం మధ్య ప్రమాదకరమైన పటాకుల అమ్మకాలు జరుపొద్దనే రూల్స్ ఉన్నప్పటికీ జనగామలో అవి అమలు కావడం లేదు. నెహ్రూపార్క్ రోడ్లో ఫైర్క్రాకర్స్షాప్ నడుపుతున్నారు. దీని చుట్టూ ఇప్పుడు ఇండ్లు, జనం రద్దీ ఉన్నా కనీసం పట్టించుకున్న అధికారులు లేరు. రైల్వే స్టేషన్ రోడ్, హైదరాబాద్ రోడ్ కళ్లెం కమాన్ సమీపంలో దర్జాగా పటాకుల అమ్మకాలు సాగుతున్నాయి. వీటికి సరైన ఫైర్ సేఫ్టీ విధానాలు లేవన్న ఆరోపణలున్నాయి. ప్రమాదం జరిగితే తీవ్ర ప్రాణ నష్టం తప్పదని జనాలు భయపడుతున్నా ఆఫీసర్లు లైట్ తీసుకుంటున్నారు.
పట్టణ శివారులోని రెండు హోల్ సేల్ దుకాణాల్లో స్టాక్ ఉన్నదానికి, అమ్మకాలకు పొంతన ఉండదనే ఆరోపణలున్నాయి. ఇటీవల ఓబుల్ కేశవాపూర్ సమీపంలోని హోల్ సేల్ పటాకుల దందాపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. అవకతవకలను గుర్తించి రూ.లక్షల విలువైన పటాకులను సీజ్ చేసి అక్కడే భద్ర పరిచారు. అయినా తీరు మారకుండా దందా జరుగుతున్నట్లు వ్యాపార వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి.
రద్దీ ప్రాంతాల్లో ఆగమే..
జనగామలో మెయిన్ రోడ్డు తర్వాత బస్టాండ్ చిన్నగేటు గల్లీలో బిజినెస్ ఎక్కువగా జరుగుతుంది. ఇక్కడ ఏ ఒక్క దుకాణానికి పార్కింగ్ ఫెసిలిటీ లేదు. బండ్లన్నీ రోడ్లపైనే ఉంటాయి. జనం రద్దీ తీవ్రంగా ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో దుకాణాలు, హాస్పిటళ్లు, సెకండ్, థర్డ్ ఫ్లోర్ల్లో నివాసాలు ఉంటున్నారు. అత్యంత ఇరుకుగా ఉండే ఈ రోడ్డులో పెద్ద వాహనాల రాకపోకలు సాగించడం వీలు కాకుండా ఉంటుంది.
కనీసం ఫైర్ ఇంజన్ కూడా సాఫీగా వెళ్లలేదు. ఈ క్రమంలో దుకాణాలకు సరైన సేఫ్టీ మెజర్మెంట్స్ లేకుంటే ఏదైనా ప్రమాదం జరిగితే తీవ్ర ప్రాణ నష్టం తప్పేలా లేదు. రైల్వేస్టేషన్, పాత బీటు బజార్ సైతం రద్దీగా ఉంటోంది. ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.