ఇంటర్ బోర్డు వివాదాస్పద నిర్ణయం.. సెకండియర్ స్టూడెంట్లకు ఫైర్ సేఫ్టీ అవసరం లేదట !

ఇంటర్ బోర్డు వివాదాస్పద నిర్ణయం.. సెకండియర్ స్టూడెంట్లకు ఫైర్ సేఫ్టీ అవసరం లేదట !
  • ఫస్టియర్ వారికి మాత్రమే కావాలంట.. ఇంటర్ బోర్డు వివాదాస్పద నిర్ణయం
  • ఫైర్ ఎన్ఓసీ లేని కాలేజీల స్టూడెంట్ల నుంచి ఎగ్జామ్స్ ఫీజు వసూల్ 
  • ఎలాంటి షరతులు, ఫైన్ లేకుండానే ఇంటర్ బోర్డు ఏకపక్ష నిర్ణయం 
  • ఇంకా 300 ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలకు గుర్తింపు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ ఇంటర్ కాలేజీల అఫిలియేషన్లపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్నది. ఇంకా సుమారు 300 కాలేజీల వరకూ గుర్తింపు లేకుండానే దర్జాగా నడుస్తున్నాయి. దీంట్లో పెద్దపెద్ద కార్పొరేట్ కాలేజీలు ఉండటంతో, వాటిని మూసేసేందుకు ఇంటర్ బోర్డు అధికారులూ సాహసం చేయడం లేదు. ఈ క్రమంలోనే, సెకండియర్ స్టూడెంట్లకు మాత్రం ఎగ్జామ్ ఫీజులు వసూలు చేయడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. అయితే, ఇంటర్ బోర్డు అధికారులు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమా.. లేక సర్కారు నుంచి ఏమైనా ఆదేశాలున్నాయా అనే దానిపై చర్చ మొదలైంది.

కొనసాగుతున్న అఫిలియేషన్ల ప్రక్రియ

రాష్ట్రంలో 2024–25 అకడమిక్ ఇయర్ కు సంబంధించిన ఇంటర్ కాలేజీల అఫిలియేషన్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో అఫిలియేషన్ల ప్రారంభం కాగా, ఇంకా కొనసాగుతూనే ఉంది. స్టేట్ లో 1500 ప్రైవేటు కాలేజీలుండగా, వాటిలో 1200 కాలేజీలకు మాత్రమే ఇంటర్ బోర్డు ఇప్పటివరకూ అధికారికంగా గుర్తింపు ఇచ్చింది. మిక్స్ డ్ ఆక్యుపెన్సీ బిల్డింగుల్లో కొనసాగుతున్న సుమారు 300 కాలేజీలకు ఇంకా అఫిలియేషన్ ఇవ్వలేదు. 

దీంతో ఆయా కాలేజీల్లోని స్టూడెంట్ల అడ్మిషన్ల కోసం లాగిన్ ఓపెన్ చేయలేదు. దీంతో సుమారు లక్ష స్టూడెంట్లు ప్రవేశాలు గాలిలో ఉన్నట్టుగా మారిపోయింది. అయితే, గుర్తింపు లేని కాలేజీలు అత్యధికం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. అఫిలియేషన్లు పొందని కాలేజీల లిస్టులో పేరుమోసిన కార్పొరేట్ కాలేజీలు కూడా ఉన్నాయి. వారు చదివే కాలేజీలకు గుర్తింపు లేదనే విషయం ఇప్పటికీ స్టూడెంట్లకు తెలియకుండా కాలేజీల మేనేజ్మెంట్లు దాస్తున్నాయి. ఇంటర్ బోర్డు అధికారులు ఇందుకు సహకారం అందిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఒకే బిల్డింగ్​లోని స్టూడెంట్లకు రెండు రూల్సా

మిక్స్ డ్ ఆక్యుపెన్సీ భవనాల్లోని ఇంటర్ కాలేజీలకు అఫిలియేషన్లపై సర్కారు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం మూడేండ్ల కింద 2022–23, 2023–24 విద్యా సంవత్సరాలకు ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. నిరుడుతో ఆ గడువు ముగిసింది. ఈ సంవత్సరం ఫైర్ సేఫ్టీ ఉన్న వాటికి మాత్రమే ఇంటర్ బోర్డు అనుమతి ఇవ్వాలి. అనుమతి ఉన్న కాలేజీల్లోని స్టూడెంట్లకు అక్కడి నుంచి పరీక్షలు రాసేందుకు చాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, ఇంటర్ బోర్డు ఈ నిబంధనను గాలికి వదిలేసింది. గుర్తింపు లేని ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో చదివే సెకండియర్ సూడెంట్ల నుంచి ఎగ్జామ్ ఫీజును కలెక్ట్ చేసింది. కానీ, ఫస్టియర్ స్టూడెంట్లకు మాత్రం ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. 

ఒకే బిల్డింగ్ లో చదివే స్టూడెంట్లలో ఒక సెకండియర్ స్టూడెంట్లకు మాత్రం ఫైర్ ఎన్​ఓసీ అవసరం లేదని, ఫస్టియర్ వారికే అవసరం అన్నట్టుగా ఇంటర్ బోర్డు వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి గత విద్యా సంవత్సరంలో గుర్తింపు లేని కాలేజీల్లో చేరిన ఫస్టియర్ స్టూడెంట్ల నుంచి ఇంటర్ బోర్డు అధికారులు నో ఆబ్జెక్షన్ లెటర్ తీసుకున్నారు. అలాంటి సమయంలో సెకండియర్ స్టూడెంట్ల నుంచి ఎగ్జామ్ ఫీజులు ఎలా తీసుకున్నారనే దానిపై చర్చ మొదలైంది. కనీసం మేనేజ్మెంట్ల నుంచి ఫైన్ కూడా సేకరించకుండా ఫీజు తీసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. 

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మిక్స్ డ్ ఆక్యుపెన్సీ భవనాల్లోని కాలేజీలపై అధికారికంగా నిర్ణయం తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సర్కారు వద్ద పెండింగ్: కృష్ణ ఆదిత్య, ఇంటర్ బోర్డు సెక్రటరీమిక్స్ డ్ ఆక్యుపెన్సీ భవనాల్లోని కాలేజీలపై ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గుర్తింపు లేని కాలేజీల్లో చదివే స్టూడెంట్లకు ఎలాంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే సెకండియర్ స్టూడెంట్లకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఇచ్చాం. ఫస్టియర్ స్టూడెంట్లకు ఇవ్వలేదు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు ముందుకు పోతాం.

సర్కారు వద్ద పెండింగ్

మిక్స్ డ్ ఆక్యుపెన్సీ భవనాల్లోని కాలేజీలపై ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గుర్తింపు లేని కాలేజీల్లో చదివే స్టూడెంట్లకు ఎలాంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే సెకండియర్ స్టూడెంట్లకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఇచ్చాం. ఫస్టియర్ స్టూడెంట్లకు ఇవ్వలేదు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు ముందుకు పోతాం.

కృష్ణ ఆదిత్య, ఇంటర్ బోర్డు సెక్రటరీ