
- సోమవారం ప్రారంభించిన ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి
హైదరాబాద్, వెలుగు: అగ్నిప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నామని ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి తెలిపారు. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా 13,949 అవగాహన కార్యక్రమాలు, మాక్ డ్రిల్స్ నిర్వహించామని స్పష్టం చేశారు. ఈ నెల 20వ తేదీ వరకు జరగనున్న అగ్నిమాపక వారోత్సవాలను ఆయన సోమవారం ప్రారంభించారు. వట్టినాగులపల్లిలోని ఫైర్ సర్వీసెస్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో జరిగిన కార్యక్రమంలో వివరాలను వెల్లడించారు.
1944లో ముంబైలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన 66 మంది ఫైర్ ఫైటర్స్‌కు నివాళులు అర్పించారు. వారి స్మృతిగా వారోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. వారోత్సవాల్లో భాగంగా ఇండ్లు, ఆఫీస్, వ్యాపార సముదాయల్లో సిబ్బందికి ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ‘అగ్నినివారణ పట్ల అవగాహన పెంచుదాం.. సురక్షిత భారతాన్ని నిర్మిద్దాం’ అనే నినాదంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా 89 సీరియస్ ప్రమాదాలు, 7,185 స్వల్ప ప్రమాదాలు, 184 సాధారణ ప్రమాదాలు జరినట్లు తెలిపారు.779 రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ ఏడాది ఇప్పటికే 3,308 ఫైర్ కాల్స్‌ను తమ ఫైర్ డిపార్ట్‌మెంట్ అటెండ్ చేసినట్లు తెలిపారు.