
- హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా
- ఐమాక్స్ వద్ద ఫైర్ సర్వీసెస్ ఎగ్జిబిషన్ ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: అగ్నిప్రమాదాల నియంత్రణ అనేది కేవలం ఫైర్ డిపార్ట్‌మెంట్ పని మాత్రమే కాదని, ప్రజలందరి బాధ్యత అని రాష్ట్ర హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా చెప్పారు. అగ్ని ప్రమాదాల్లో చిక్కుకున్న ఒక్క ప్రాణాన్ని కాపాడినా.. ఓ కుటుంబాన్ని కాపాడినట్టేనన్నారు. ఫైర్ సిబ్బంది పనితీరు ఎంతో బాగుందని ప్రశంసించారు. అగ్నిమాపకశాఖ వారోత్సవాల్లో భాగంగా శనివారం ప్రసాద్ ఐమాక్స్ సమీపంలోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో ‘ఫైర్ సర్వీసెస్ ఎగ్జిబిషన్’ ఏర్పాటు చేశారు. ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో అగ్నిమాపక పరికరాలు, శకటాలతో ప్రదర్శన నిర్వహించారు. ఎగ్జిబిషన్‌ను అగ్నిమాపకశాఖ డీజీ వై.నాగిరెడ్డితో కలిసి రవిగుప్తా ప్రారంభించారు.
అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎగ్జిబిషన్ లో అగ్నిప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నట్లు తెలిపారు. వేసవిలో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నాగిరెడ్డి చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్లకు తమ వద్ద అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆదివారం సాయంత్రం వరకు ఎగ్జిబిషన్కొనసాగుతుందని తెలిపారు. అలాగే అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా శనివారం హైడ్రా ఆఫీసులో నిర్వహించిన కార్యాలయంలో కమిషనర్ ఏవీ రంగనాథ్ మాట్లాడారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. నివారణ చర్యలపై షార్ట్ ఫిలిమ్స్ రూపొందించాలన్నారు.