- రెడ్‍జోన్లలో.. డ్యూటీలు
- నో మూమెంట్ ఏరియాల్లో కెమికల్ స్ప్రే
- రిస్క్ టాస్క్ లో సేఫ్టీ కరువు
- కష్టపడుతున్నా.. గుర్తింపు లేదని ఆవేదన
- ఇన్సూరెన్స్, ఇన్సెంటివ్ కోసం వేడుకోలు
ఇన్నాళ్లు డ్యూటీలో భాగంగా అగ్గితో పోరాడిన ఫైర్ డిపార్ట్మెంట్ ఇప్పుడు కరోనా వైరస్ నియంత్రణకు అంతకంటే బిగ్ ఫైట్ చేస్తోంది. కొవిడ్ పేరు చెబితేనే జనం వణికిపోతున్న సమయంలో.. ఫైర్ సిబ్బంది తమ ప్రాణాలను లెక్కచేయకుండా కరోనాపై యుద్ధం చేస్తున్నారు వరంగల్ ఉమ్మడి జిల్లా ఫైర్ సిబ్బంది. మర్కజ్ యాత్రకు వెళ్లొచ్చినవారి ప్రాంతాల్లో.. డ్యూటీలో భాగంగా సరికొత్త టాస్క్ నిర్వహిస్తున్నారు. కరోనా పాజిటివ్ బాధితులు ఎక్కువగా ఉండే రెడ్‍జోన్లలో గంటల తరబడి అందుబాటులో ఉంటున్నారు. అయినా వారికి అంతేస్థాయి గుర్తింపు దక్కడం లేదు.
6 జిల్లాలు.. 12 ఫైర్ స్టేషన్లు
ఉమ్మడి జిల్లాలో 12 ఫైర్ స్టేషన్లు ఉన్నాయి. ఇందులో డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, లీడింగ్ ఫైర్‍మన్, డ్రైవర్ అండ్ ఆపరేటర్, ఫైర్‍మన్ హోదాల్లో.. లీడింగ్ స్టేషన్లో 25 మంది ఉండగా.. మిగతా ఒక్కో స్టేషన్‍లో 15 మంది చొప్పున సేవలు అందిస్తున్నారు. ఇన్నాళ్లు కేవలం అగ్నిప్రమాదాలు, వరదల సమయంలో సేవలకే ఎక్కువగా కనబడే డిపార్ట్మెంట్ ఇప్పుడు సరికొత్తగా కరోనాపై పోరాటాన్ని చాలెంజ్‍గా తీసుకుంది. న్యూ టాస్క్లో భాగంగా మొదటిసారి సోడియం హైడ్రో క్లోరైడ్ కెమికల్ స్ప్రే చేస్తున్నారు. షిఫ్ట్ ప్రకారం డ్యూటీలు చేయాల్సి ఉన్నా.. విపత్కర సమయంలో అందరూ డ్యూటీలోనే ఉంటున్నారు.
డెయిలీ ‘రెడ్ జోన్ల’ డ్యూటీలే..
కరోనా మహహ్మరి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న నేపథ్యంలో ఆఫీసర్లు ఒక్క అర్బన్ జిల్లాలోనే 15 ప్రాంతాలను ‘నో మూమెంట్ జోన్లు’గా గుర్తించారు. మర్కజ్ యాత్రకు వెళ్లొచ్చినవారి కుటుంబాలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతాల్లో.. పూర్తిస్థాయి సెక్యూరిటీ లేకుండా విధులు చేయడం అంటే సాహసమే. అయినా ఉన్నతాధికారుల సూచన మేరకు కరోనా పాజిటివ్ వచ్చినవారి కాలనీలు, ఇండ్ల పరిసరాలు, బాధిత గడపల వరకు వెళ్లి నిత్యం గంటల తరబడి కెమికల్ స్ప్రే చేస్తున్నారు. అలాగే మా ఏరియాలో కొట్టాలంటే.. కాదుకాదు మా గల్లీలో స్ప్రే చేయాలనే.. స్థానికులు, లీడర్ల గొడవలు తలనొప్పిగా మారాయి.
డేంజరస్ కెమికల్..
జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరగడంతో ఆఫీసర్లు.. ట్రైసిటీలో కట్టుదిట్టమైన చర్యలు చేప్టట్టారు. నో మూమెంట్ జోన్లలో పలుమార్లు కెమికల్ స్ప్రే చేయాలని ఆదేశించారు. కాగా, అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సాయంతో సోడియం హైడ్రో క్లోరైడ్ కెమికల్‍ను చల్లుతున్నారు. వైరస్ పాజిటివ్ వచ్చినవారు, వారి ఫ్యామిలీ మెంబర్స్ను ఐసోలేషన్, క్వారంటైన్ తరలించే వాహనాలను సైతం ఆపై వీరే క్లీన్ చేస్తున్నారు. డాక్టర్ల మాదిరి పూర్తిస్థాయి సెక్యూరిటీ లేకుండా కెమికల్ స్ప్రే విధులు నిర్వహించడం ద్వారా భవిష్యత్తులో ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కండ్ల మంటలు, స్కిన్ ఎలర్జీ సమస్యలు వస్తుండగా.. ఫ్యూచర్‍లో కేన్సర్, ఆస్తమా, జుట్టు ఊడటం వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయనే టెన్షన్ వారిలో నెలకొంది.
ఒక్క స్టేషన్.. లక్ష లీటర్ల స్ప్రే
కొవిడ్ వైరస్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో డివిజన్ల వారీగా డెయిలీ కెమికల్ స్ప్రే చేస్తున్నారు. ఒక్కో ఫైర్ స్టేషన్‍లో రెండు చిన్న, పెద్ద వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి 100 లీటర్ల నీటిలో ఒక లీటర్ కెమికల్‍ను కలిపి ఈ స్ప్రే తయారు చేస్తున్నారు. చిన్న ఫైరింజన్ 300 లీటర్ల కెపాసిటీ ఉండగా.. పెద్దదాంట్లో ఏం తక్కువ..4,500 లీటర్ల సోడియం హైడ్రోక్లోరైడ్ కెమికల్ పడుతుంది. కాగా, ఒక్క హన్మకొండ ఫైర్ స్టేషన్ పరిధిలోనే రెండు వాహనాల సాయంతో సిబ్బంది ఇప్పటి వరకు దాదాపు లక్ష లీటర్ల కెమికల్ నో మూమెంట్ జోన్లు, జనాలు రద్దీగా ఉండే జంక్షన్లలో పిచికారి చేశారు.
నో ఇన్యూరెన్స్.. నో ఐడెంటిటీ
అగ్నిమాపక సిబ్బంది వారి లైఫ్ అడ్డుగా పెట్టి కరోనా వైరస్‍పై యుద్ధం చేస్తుంటే.. ప్రభుత్వం ఓ విధంగా వీరిని చిన్నచూపు చూస్తోందని వాపోతున్నారు. డాక్టర్లు, స్పెషలిస్టులు, నర్సులు, వార్డుబాయ్స్, పారామెడికల్, శానిటేషన్ సిబ్బంది, ఆశా వర్కర్లకు..ప్రభుత్వమే ఉచితంగా రూ.50 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించింది. కాగా, ఫైర్ సిబ్బందికి ఇప్పటి వరకు దీని విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. రాష్ట్ర సర్కారు సైతం డాక్టర్లు, పోలీసులు, శానిటేషన్ సిబ్బందికి 10 శాతం ఇన్సెంటివ్ ఇచ్చినా ఫైర్ సిబ్బందికి ఆ తరహా వేతనం అందించలేదని విధుల్లో ఉన్న ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా డ్యూటీలు చేసేటోళ్ల ఆరోగ్యం కోసం ఇతర శాఖలవారికి విటమిన్సీ, జింకోవిట్ వంటి మల్టీవిటమిన్ టాబ్లెట్లు అందిస్తుండగా వీరికి ఇవ్వడం లేదు. కాగా, ఏప్రిల్ 14 నుంచి దేశవ్యాప్తంగా అగ్నిమాపకశాఖ వారోత్సవాలు నిర్వహించుకునే క్రమంలో.. కరోనా మహమ్మారిపై అలుపెరగని యుద్ధం చేస్తున్న ఫైర్ సిబ్బందికి గుర్తింపు, అంతేస్థాయి గౌరవం దక్కాలని ఆశిద్దాం.