అమెరికాలో కార్చిచ్చుకు.. 3.5 లక్షల ఎకరాలు బూడిద

అమెరికాలో కార్చిచ్చుకు.. 3.5 లక్షల ఎకరాలు బూడిద

కాలిఫోర్నియా: ఓ వ్యక్తి చేసిన పనితో అమెరికాలోని కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చు రెండింతలు పెరిగింది. 24 గంటల్లోనే ‘పార్క్​ఫైర్​’ అతివేగంగా వ్యాపిస్తున్నది. గంటకు 20 చ.కి.మీ. చొప్పున అడవిని కాల్చి బూడిద చేస్తున్నది. మంటలను ఆర్పేందుకు వేలాది మంది అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ఆగ్నేయ ఒరెగాన్​లోని ఫాల్స్​ఫైర్​ సమీపంలో సింగిల్​ ఇంజిన్​ ట్యాంకర్​ కూలిపోవడంతో ఓ అగ్నిమాపక సిబ్బంది మృతి చెందినట్టు  యూఎస్​ ఫారెస్ట్ సర్వీస్  తెలిపింది.

శనివారం సాయంత్రం నాటికి రాష్ట్ర రాజధాని నగరమైన శాక్రమెంటోకు ఉత్తరాన 144 కిలోమీటర్ల దూరంలో 3 లక్షల 50 వేల ఎకరాల విస్తీర్ణంలో అడవి కాలిపోయిందని కాలిఫోర్నియా డిపార్ట్​మెంట్​ ఆఫ్​ ఫారెస్ట్రీ అండ్​ ఫైర్​ ప్రొటెక్షన్​ (కాల్​) వెల్లడించింది.  శనివారం ఒక్క రోజే 1.5 లక్షల ఎకరాలు కాలిపోయినట్లు తెలిపారు. అగ్నిప్రమాదంలో 134 నిర్మాణాలు ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు.

కాగా, అడవికి ఓ వ్యక్తి నిప్పు పెట్టడం వల్లే ఈ కార్చిచ్చు ప్రారంభమైందని అధికారులు గుర్తించారు. లక్షల ఎకరాల అడవి బూడిదయ్యేందుకు కారణమైన ఆ వ్యక్తిని ఇదివరకే అరెస్ట్ చేశారు.