- రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల మైదానంలోనే షాపులు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లా కేంద్రంలో పటాకుల వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అనుమతులు రాకుండానే పటాకుల షాపులు పెట్టేశారు. ఆఫీసర్లు కూడా చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. కొత్తగూడెం పట్టణంలోని ప్రకాశం స్టేడియంలో పటాకుల వ్యాపారం మొదలైంది. ఇదే స్టేడియంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా మూడు రోజుల పాటు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి.
నిబంధనలకు తిలోదకాలు..
కొత్తగూడెం పట్టణంలోని ప్రకాశం స్టేడియంలో వ్యాపారులు పదుల సంఖ్యలో షాపులు ఏర్పాటు చేశారు. పలువురు ఏర్పాటు చేసుకునేందుకు పలవురు వ్యాపారులు దరఖాస్తు చేసుకున్నారు. స్టేడియంలో షాపుల ఏర్పాటుకు పర్మిషన్స్ రాక ముందే వ్యాపారులు సోమవారం షాపులు ఏర్పాటు చేసి అమ్మకాలు షురూ చేశారు. అవసరమైన విధంగా ఫైర్‌సేఫ్టీ పరికరాలను అందుబాటులో ఉంచలేదు.
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు..
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 28,29,20 తేదీల్లో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను ప్రకాశం స్టేడియంలో పీఎస్ఆర్ ట్రస్ట్ తరుపున నిర్వహిస్తున్నారు. కబడ్డీ పోటీల కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ పోటీలకు జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు అటెండ్ కానున్నారు.
చివరి రోజైన 30న మంత్రి వస్తున్నారు. ఓ వైపు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు జరుగుతున్న ప్రాంతంలోనే పటాకుల దుకాణాలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. మంత్రితో పాటు ఎమ్మెల్యేలు పోటీల వద్దకు వస్తుండడంతో కార్యకర్తల రద్దీ ఉండే అవకాశం ఉంది. మరో వైపు పటాకులు కొనుగోలు చేసే వారు, కార్యకర్తలతో స్టేడియం జన సమర్థంగా ఉండే అవకాశాలున్నాయి. ఈ టైంలో ఏదేని ప్రమాదం జరిగితే భారీ నష్టానికి అవకాశాలున్నాయి.
కమీషన్ ఇస్తేనే పర్మిషన్
పటాకుల షాపులు ఏర్పాటు విషయంలో కమీషన్ ఇస్తేనే పర్మిషన్ అంటూ పలు శాఖల ఆఫీసర్లు బెట్టు చేస్తున్నారు. షాపులకు పర్మిషన్ రావాలంటే పోలీస్, రెవెన్యూ, మున్సిపాలిటీ,ఫైర్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ల నుంచి పర్మిషన్లు తీసుకోవాలి. ఇందుకు గానూ ఒక్కో షాపు యజమాని రూ. 50 వేల నుంచి రూ. 75వేల వరకు ఇచ్చు కోవాల్సి వస్తుందనే ప్రచారం జరుగుతోంది.