ఇన్ఫోసిస్లో ఇంత ఘోరమా.. ఎంత జాబ్ నుంచి తీసేస్తే మాత్రం.. మరీ ఇలానా..?

ఇన్ఫోసిస్లో ఇంత ఘోరమా.. ఎంత జాబ్ నుంచి తీసేస్తే మాత్రం.. మరీ ఇలానా..?

మైసూర్: ఐటీ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన ఇన్ఫోసిస్ మైసూర్ క్యాంపస్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ, ఉద్యోగులను తొలగించిన తీరు అత్యంత వివాదాస్పదంగా మారింది. 450 మంది ట్రైనీ ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించిన రోజే ఉన్నపళంగా క్యాంపస్ వదిలేసి వెళ్లాలని ఇన్ఫోసిస్ హుకుం జారీ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలా ఉద్యోగం కోల్పోయిన వారిలో మధ్యప్రదేశ్కు చెందిన ఒక ఫిమేల్ ట్రైనీ కూడా ఉంది. ఫిబ్రవరి 7న ఇన్ఫోసిస్ ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది.

అదే రోజు ఆమెను మైసూర్ క్యాంపస్ వదిలి వెళ్లిపోవాల్సిందేనని ఇన్ఫోసిస్ స్పష్టం చేసింది. సాయంత్రం 6 గంటల లోపు క్యాంపస్ బయట ఉండాలని తేల్చి చెప్పింది. అయితే.. సుదూరం వెళ్లాల్సి ఉండటం, ఒంటరిగా వెళ్లాల్సి రావడంతో ఫిబ్రవరి 7న ఒక్క రాత్రి క్యాంపస్లో ఉండేందుకు అనుమతించాలని, ఉదయాన్నే వెళ్లిపోతానని కన్నీళ్లు పెట్టుకుని మరీ ఈ యువతి బతిమాలింది. అయినా.. సరే ఇన్ఫోసిస్ యాజమాన్యం కనికరించలేదు. ఆమె మొర ఆలకించలేదు.

ALSO READ | Infosys Layoffs: మైసూరు క్యాంపస్‌లో 700 మంది ఫ్రెషర్స్ ఔట్.. బౌన్సర్లు, భద్రతా సిబ్బందితో వెళ్లగొట్టించారు

ఉద్యోగం నుంచి తొలగించాక ఆమెకూ, సంస్థకు ఎలాంటి సంబంధం లేదని, మైసూర్ ఇన్ఫోసిస్ క్యాంపస్లో ఉండటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని ఇన్ఫోసిస్ అఫిషియల్స్ ఆమెకు నిర్ధాక్షిణ్యంగా చెప్పారు. ఈ యువతి పరిస్థితి మాత్రమే కాదు దాదాపు ఇన్ఫోసిస్ మైసూర్ క్యాంపస్లో ఉద్యోగాలు కోల్పోయిన మిగిలిన ఫ్రెషర్స్.. అదేనండీ  ట్రైనీ ఉద్యోగుల పరిస్థితి కూడా పాపం దాదాపు ఇలాంటిదే. ఉద్యోగాల నుంచి తొలగించిన రోజే ఉన్నపళంగా వెళ్లిపోవాల్సిందేనని చెప్పడంతో సొంతూళ్లకు చేరుకునేందుకు వీళ్లంతా నానా తిప్పలు పడ్డారు. 

మైసూర్ ఇన్ఫోసిస్ క్యాంపస్లో దాదాపు 450 మంది రెండున్నరేళ్లుగా ట్రైనీ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. తాజాగా వ్యక్తిగత పనితీరును అంచనా వేసేందుకు ఇన్ఫోసిస్ ఈ ట్రైనీ ఉద్యోగులకు ఇంటర్నల్ అసెసెమెంట్ టెస్ట్ నిర్వహించింది. మూడు దశల్లో ఈ అసెసెమెంట్ టెస్ట్ జరిగింది. ఈ టెస్ట్లో ఫెయిల్ అయిన ఉద్యోగులను తొలగించే ప్రక్రియ ప్రస్తుతం మైసూర్ ఇన్ఫోసిస్ క్యాంపస్లో జరుగుతోంది. ఈ ట్రైనీ ఉద్యోగులను ఉద్యోగాల్లోకి తీసుకున్న సమయంలోనే కాంట్రాక్ట్లో ఈ విషయాన్ని ముందే స్పష్టం చేశామనేది ఇన్ఫోసిస్ కంపెనీ వాదన.

ఇంత పెద్ద స్థాయిలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియకు ఇన్ఫోసిస్ పూనుకోవడంపై ఐటీ ఉద్యోగుల సంఘం(NITES) ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ విషయంలో జోక్యం చేసుకుని ఇన్ఫోసిస్ సంస్థపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. బ్యాచ్ల వైజ్గా ఇన్ఫోసిస్ ఈ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను నిర్వహిస్తుంది. ఫిబ్రవరి 7న ఒక దఫా ప్రక్రియ ముగిసింది. ఫిబ్రవరి 14న కూడా ఇంకొంత మంది ట్రైనీలకు మైసూర్ ఇన్ఫోసిస్ క్యాంపస్లో అసెస్మెంట్ టెస్ట్ జరగనుంది.