- లాస్‌ఏంజెలిస్‌కు తిరిగి వచ్చిన పలువురు..ఇంకా ఆరని కార్చిచ్చు
- బూడిద కుప్పల్లో వెతుకులాట
న్యూయార్క్: అమెరికాలోని లాస్‌ఏంజెలిస్‌లో చెలరేగిన మంటలు బీభత్సాన్ని సృష్టించాయి. ఇందులో చిక్కుకొని ఇప్పటివరకూ 11 మంది మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. ఇండ్లు కాలి బూడిదకావడంతో 30 వేలకు పైగా నిరాశ్రయులయ్యారు. ఎటు చూసినా పూర్తిగా కాలిపోయి బూడిదగా మారిన గృహాలు దర్శనమిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. ఇంకా కార్చిచ్చు కొనసాగుతూనే ఉన్నా కొంతమంది తమ ఇండ్ల పరిసరాల్లోకి వచ్చారు. కాలి బూడిదైన ఇండ్లను చూసి కన్నీటిపర్యంతమయ్యారు. ఆ ఇంటితో జ్ఞాపకాలను తలచుకుంటూ విలవిల్లాడారు.
తమకు ఇష్టమైన వస్తువుల కోసం శిథిలాలు, బూడిద కింద వెదికారు. ‘‘ఇటీవలే ఇక్కడ క్రిస్మస్ జరుపుకున్నాం.. వేడుకలు ఈ చోట చేసుకున్నాం.. అదిగో అక్కడే చలి మంట వేసుకున్నాం” అంటూ ఆ నల్లని బూడిద చుట్టూ తిరుగుతూ..ఆవేదన చెందారు. ఇదిలా ఉండగా.. కార్చిచ్చు సమయంలో లాస్ ఏంజెలిస్ నివాసితుల్లో చాలామంది తమ పెంపుడు జంతువులను తీసుకెళ్లారు.
ఎక్కువ సంఖ్యలో పెట్స్ ఉన్నవారు.. కొన్నింటిని తీసుకెళ్లి.. మరికొన్నింటిని అవి పారిపోయేలా ఫ్రీగా వదిలేసినట్టు చెప్పారు. గుర్రాలలాంటి భారీ జంతువులు అగ్నికి ఆహుతవగా.. వాటిని తలచుకొని యజమానులు కన్నీటి పర్యంతమయ్యారు.
కాగా, ఈ కార్చిచ్చుకు నాయకత్వ వైఫల్యమే కారణమనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఫైర్ డిపార్ట్మెంట్ కు సరిపడా నిధులు ఇవ్వకుండా నగర నాయకత్వం విఫలమైందని లాస్ ఏంజెలిస్ ఫైర్ చీఫ్ క్రిస్టిన్ క్రౌలీ ఆరోపిచారు. 440 మిలియన్ లీటర్ల రిజర్వాయర్ ఉన్నా ఎందుకూ పనికిరాకుండా పోయిందని, కొన్ని హైడ్రెంట్లు ఎండిపోవడానికి కారణం గుర్తించాలని అధికారులను గవర్నర్ ఆదేశించారు.
చాలా పొడిగా ఉండడం వల్లే మంటలు..
లాస్ ఏంజెలిస్‌లో కార్చిచ్చుకు ఇంకా అసలు కారణం తెలియరాలేదు. దీన్ని కనుగొనేందుకు పరిశోధకులు రంగంలోకి దిగారు. కాగా, దక్షిణ కాలిఫోర్నియా చాలా పొడిగా ఉంటుందని, ఇది మంటలు చెలరేగడానికి ఓ కారణమని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన రీసెర్చ్ హైడ్రాలజిస్ట్ మింగ్ పాన్ సీనియర్ వెల్లడించారు.
చార్ట్స్ అండ్ మ్యాప్స్ ద్వారా దీన్ని వివరించారు. ఈ ఏడాది ప్రారంభంలో దక్షిణ కాలిఫోర్నియాలోని నేలలో తేమ 2శాతం కంటే తక్కువగా ఉన్నదని, చరిత్రలోనే ఇది అత్యంత తక్కువ శాతమని వెల్లడించారు.
మే నుంచి సెప్టెంబర్ వరకు చాల తక్కువ వర్షపాతం నమోదైందని, దీంతో రిజర్వాయర్లన్నీ ఎండిపోయి నేలలో తేమశాతం తగ్గిపోయిందని తేల్చారు. కార్చిచ్చు వేగంగా వ్యాపించడానికి ఇదే ప్రధాన కారణమై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.