- రామగుండం బల్దియాలో డెడ్‌బాడీలు కాల్చేందుకు కట్టెలు ఇస్తలేరు
- ఉచిత కట్టెల పంపిణీని నిలిపివేసిన కార్పొరేషన్ అధికారులు
గోదావరిఖని, వెలుగు: రామగుండం కార్పొరేషన్ ఆధ్వర్యంలో గోదావరి ఒడ్డున శవాల అంత్యక్రియలకు కష్టాలు తప్పడం లేదు. ఇక్కడ శవాలను కాల్చేందుకు కొన్నాళ్లు ఉచితంగా అవసరమైన కట్టెలు ఇచ్చిన బల్దియా.. ప్రస్తుతం ఆ సౌకర్యాన్ని నిలిపేశారు. దీంతో అవసరమైన కట్టెలు కొంటూ పేద కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. కార్పొరేషన్ పరిధిలోఎవరైనా చనిపోతే ఆధార్, రేషన్ కార్డు వివరాలు కార్పొరేషన్ ఆఫీస్‌లో నమోదు చేసుకుని డెడ్‌బాడీ అంత్యక్రియలకు ఉచితంగా కట్టెలు, ఖననం చేస్తే బొంద తవ్వడం వంటి స్కీమ్‌ను 2021 సెప్టెంబర్‌లో ప్రారంభించారు.
కార్పొరేషన్ తరుఫున డెడ్‌బాడీని ఇంటి నుంచి గోదావరి వరకు తీసుకెళ్లేందుకు ఉచితంగానే వైకుంఠ రథాన్ని కూడా పంపించేవారు. ఇదంతా డప్పు కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహించేవారు. కాల్చేందుకు అవసరమైన కట్టెలకు రూ.3500, బొంద తవ్వితే రూ.2500 చొప్పున కార్పొరేషన్ నుంచి చెల్లించేవారు. దీంతో డప్పు కళాకారులకు ఉపాధి దొరికేది. ఈ ప్రక్రియ కొన్నాళ్లు కొనసాగగా, 2024 మార్చి నుంచి నిలిపేశారు.
పేద కుటుంబాలకు ఇబ్బందులు
ఆర్థికంగా ఉన్నవారికి ఇబ్బంది లేకపోయినా, నిరుపేద కుటుంబాల వారు చనిపోతే అంత్యక్రియలకు కట్టెలు, ఇతర సామాగ్రిని సమకూర్చడం ఆర్థికంగా భారంగా మారింది. ఇటీవల గోదావరిఖనిలో ఓ నిరుపేద వృద్ధురాలు చనిపోతే ఆమెను వారి కుటుంబ సభ్యులు, స్థానికులు గోదావరి ఒడ్డున దహనం చేసేందుకు తీసుకెళ్లినప్పటికీ కట్టెలకు డబ్బులు లేక చందాలు వేసుకొని అంత్యక్రియలు చేశారు. ఇలాంటి పరిస్థితి చాలా మంది పేదలకు ఎదురవుతోంది. బల్దియా అధికారులు తిరిగి ఉచితంగా కట్టెలు సమకూర్చే సౌకర్యాన్ని కల్పించాలని పేదలు కోరుతున్నారు.