మదనపల్లిలో కాల్పుల ఘటన స్థానికంగా కలకలం రేపింది. సొంత బామ్మర్ది పై ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపడంతో ఉద్రిక్తత నెలకొంది. మదనపల్లె రూరల్ మండలం వలసపల్లి పంచాయతీ నవోదయ కాలనీలో అర్ధ రాత్రి మద్యం సేవించి ఓ బ్యాచ్ వీరంగం సృష్టించింది. కొందరు యువకులు గొడవ పడుతుంటే స్థానికుడు రెడ్డి ప్రవీణ్ వెళ్లి సముదాయించే యత్నం చేశారు. గొడవను అడ్డుకునే క్రమం లో రెడ్డి ప్రవీణ్ తన మామ దివాకర్ ను ప్రక్కకు నెట్టాడు. దీంతో అగ్రహించిన దివాకర్ లైసెన్స్ లేని తుపాకీ తీసుకొచ్చి రవ్వలను లోడు చేసి బామ్మర్ది రెడ్డి ప్రవీణ్ ను కాల్చాడు.
ఈ కాల్పుల్లో ప్రవీణ్ కు తీవ్ర గాయాలయ్యాయి. తుపాకీ శబ్దంతో ఉలిక్కిపడిన కాలనీ వాసులు పోలీసులకు సమాచారం అందించారు.స్థానికుల సమాచారంతో ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రవీణ్ ను మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఘర్షణకు కారకులు దివాకర్, ఆనంద్, సురేశ్, అన్సర్ అనే యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.