చండీగఢ్ : పంజాబ్‌లోని ఓ సైనిక శిబిరంలో కాల్పులు తీవ్ర కలకలం రేపాయి. బుధవారం (ఏప్రిల్ 12వ తేదీన) తెల్లవారుజామున 4 గంటల 35 నిమిషాల సమయంలో బఠిండాలోని మిలిటరీ స్టేషన్‌లో ఆగంతకులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది.
కాల్పులు వినిపించగానే స్టేషన్‌లోని క్విక్ రియాక్షన్ బృందాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. ఘటనా స్థలాన్ని ఆధీనంలోకి తీసుకొని గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. నిందితులు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారి కోసం వేట కొనసాగుతోంది. మిలిటరీ స్టేషన్‌ను మూసివేశారు. కార్డన్ సెర్చ్ చేపట్టినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
సైనిక స్థావరంలోని శతఘ్ని యూనిట్‌లో ఘటన జరిగిందని తెలుస్తోంది. అక్కడ ఉన్న ఓ ఆఫీసర్స్ మెస్‌లో ఇది జరిగినట్లు భావిస్తున్నారు. మృతులను గుర్తించారు. ఘటన జరిగిన ప్రదేశంలోనే సైనికుల కుటుంబాలు కూడా నివసిస్తున్నాయి. రెండు రోజుల క్రితమే ఈ సైనిక స్థావరంలో ఒక ఇన్సాస్ రైఫిల్, 28 తూటాలు కనిపించకుండాపోయాయి. ఈ ఘటనలో వీటిని వాడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
బఠిండా వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సైనిక స్థావరం. ఇక్కడ కీలకమైన 10వ కోర్ కమాండ్‌కు చెందిన దళాలు ఉన్నాయి. జైపుర్ కేంద్రంగా పనిచేసే సౌత్-వెస్ట్రన్ కమాండ్ ఆధీనంలో ఈ స్థావరం పని చేస్తుంది. బఠిండాలో పెద్ద సంఖ్యలో ఆపరేషనల్ ఆర్మీ యూనిట్లు, ఇతర కీలక పరికరాలు ఉన్నాయి.