తిరుపతి జిల్లాలోని ఓ గ్రామాన్ని వింత సమస్య వేధిస్తోంది. ఎలాంటి కారణాలు లేకుండానే గ్రామంలో ఉన్నట్టుండీ మంటలు చెలరేగుతుండటం మిస్టరీగా మారుతోంది. ఇంతకీ.. ఏంటీ మిస్టరీ మంటలు?.. ఆ గ్రామంలో అసలేం జరుగుతోంది?..అనే విషయంపై పోలీసులు, అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు.
మిస్టరీగా అగ్ని ప్రమాదాలు
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శానంబట్లలో గ్రామంలో వరుసగా అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఓ మహిళ చీరకు నిప్పంటుంకుంది. దీంతో ఆందోళన చెందుతున్నారు. అక్కడ మంటలు చెలరేగేందుకు ఎలాంటి అవకాశం లేదని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే వారం రోజుల క్రితం ఊరిలోని ఆరు గడ్డివాములు దగ్ధం కాగా.. మూడు రోజులుగా ఇళ్లలోని బీరువాల్లో సడెన్‌గా మంటలు చెలరేగుతున్నాయి. దాంతో.. శానంబట్ల గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది.
ఊరు ఖాళీ చేస్తున్న గ్రామస్తులు
ఊరు ఖాళీ చేసి పక్క ఊరిలో తలదాచుకోవడానికి వెళ్తున్నారు కొందరు గ్రామస్తులు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు.. గ్రామానికి చేరుకుని ప్రజలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు ఉండగానే నాలుగు ఇళ్లలో మంటలు చెలరేగడంతో మిస్టరీ మరింత బలపడినట్లు అయింది. రంగంలోకి దిగిన ఫోరెన్సిక్, క్లూస్ టీమ్‌లు.. మంటలు వ్యాపించిన చోట శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపారు. దాంతోపాటు.. డీఎస్పీ ఆదేశాలతో గ్రామంలో పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది.
గ్రామానికి అరిష్టం జరిగిందంటూ పూజలు
మరోవైపు.. గ్రామానికి అరిష్టం జరిగిందంటూ పూజలు చేశారు గ్రామస్తులు. గ్రామంలో గంగమ్మ పూజలు నిర్వహించారు. అదేసమయంలో.. కొందరు గ్రామస్థులు మంత్రగాళ్లనూ ఆశ్రయించారు. అయితే.. ఓ మంత్రగాడు పూజలు చేస్తుండగానే.. సమీపంలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాంతో.. అప్పటికప్పుడు తాళం పగులగొట్టి మంటలను ఆర్పివేశారు. అగ్నిప్రమాదానికి ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. కానీ.. బీరువాలో మంటలు అంటుకొని బట్టలు, బంగారు ఆభరణాలు కాలిపోయాయని గ్రామస్తులు చెప్తున్నారు. మరి తిరుపతి జిల్లా శానంబట్లలోని మంటల మిస్టరీ ఎప్పుడు వీడుతుందో చూడాలి.