షాకింగ్ ఇన్సిడెంట్: మాజీ ఎమ్మెల్యేపై 70 రౌండ్ల ఫైరింగ్.. చివరికి ఏం జరిగిందంటే..?

షాకింగ్ ఇన్సిడెంట్: మాజీ ఎమ్మెల్యేపై 70 రౌండ్ల ఫైరింగ్.. చివరికి ఏం జరిగిందంటే..?

పాట్నా: బీహార్‎లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ మాజీ ఎమ్మెల్యేపై ఆయన ప్రత్యర్థి ముఠా సభ్యులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. మొత్తం 70 రౌండ్ల కాల్పులు జరిపినప్పటికీ ఆ మాజీ ఎమ్మెల్యే తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.. బీహార్‌ రాజకీయాల్లో చోటే సర్కార్, బహుబలిగా పేరు గాంచిన మొకామా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అనంత్ సింగ్ బుధవారం (జనవరి 22) నౌరంగ-జలాల్‌పూర్ గ్రామంలో పర్యటించారు. 

ఈ క్రమంలో అనంత్ సింగ్ ప్రత్యర్థి సోను-మోను ముఠా సభ్యులు అతనిపై కాల్పులు జరిపారు. సోను-మోను గ్యాంగ్ సభ్యులు మొత్తం 70 రౌండ్లు ఫైరింగ్ చేయగా.. ప్రత్యర్థుల కాల్పుల నుండి ఎమ్మెల్యే అనంత్ సింగ్ ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో నౌరంగ-జలాల్‌పూర్ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను అదుపు చేశారు. 

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నౌరంగ గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. బార్హ్ డీఎస్పీ రాకేష్ కుమార్ గ్రామంలోనే మకాం వేసి పరిస్థితి పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నౌరంగా గ్రామంలో పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. ఘటనా స్థలం నుంచి బుల్లెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్నట్లు తెలిపారు.