సంచలనాల మధ్య సెంచరీ

మోడీ సర్కారు2.0.. 101వ రోజుకు చేరింది. గడచిన వంద రోజుల్లో చాలా దూకుడు నిర్ణయాలు తీసుకున్నారు. ఫస్ట్​ ఫేజ్​ (2014–19)లో కాలూనడానికి ప్రయత్నించారు. డీమానిటైజేషన్​, రెరా, జీఎస్టీ, ఎంపీసీ, క్యాష్​లెస్​ ట్రాన్సాక్షన్స్​ వంటి నిర్ణయాలతో ఎకానమీని కుదుటపరచడంపైనే దృష్టి పెట్టారు. సెకండ్​ ఫేజ్​ని తమ పార్టీ సిద్ధాంతాలకు తగ్గట్టుగా పరుగులు తీయిస్తున్నారు. 17వ పార్లమెంట్​ తొలి (బడ్జెట్)​ సమావేశాల్లోనే 30 వరకు బిల్లుల్ని పాస్​ చేయించి, రికార్డు సృష్టించారు. ఈసారి వ్యవసాయం, కనస్ట్రక్షన్​, ఉపాధి రంగాలపై ఫోకస్​ పెంచబోతున్నారు.

‘మొలకెత్తు, ఆ తర్వాత  విస్తరించు’ అన్నాడు వివేకానందుడు. అదే తీరుగా మోడీ సర్కారు ఫస్ట్​ ఫేజ్​ని నిలకడగా అయిదేళ్లు నడిపించి, సెకండ్​ ఫేజ్​లో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఫస్ట్​ ఫేజ్​లోని పాలనతో పోలిస్తే… ఈ వంద రోజుల్లో చాలా దూకుడు కనిపించింది. అడ్మినిస్ట్రేషన్​లో, కీలక నిర్ణయాలు తీసుకోవడంలో, తమ చేతుల్లో లేని రాష్ట్రాలపై పట్టు బిగించడంలో,  ఏళ్ల తరబడి నలుగుతున్న సమస్యల్ని పరిష్కరించడంలో, కిందామీదవుతున్న ఆర్థిక, వాణిజ్య పరిస్థితుల్ని చక్కబరచడంలో, చైనా–పాకిస్థాన్​ల్ని కంట్రోల్​ చేయడంలో, ఇరుగుపొరుగు దేశాలతో సంబంధాల్ని మెరుగు పరచుకోవడంలో, అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యాలతో స్నేహం గట్టిపరచుకోవడంలో… నరేంద్ర మోడీ ఎక్కడా వెనకడుగు లేకుండా దూసుకెళ్తున్నారు. 17వ పార్లమెంట్ తొలి సమావేశాల్లోనే 30 వరకు కీలక బిల్లుల్ని ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు. ​మొదటి విడత పాలనలో మోడీ సర్కారు ప్రయారిటీ అంశాల్లో  ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ డెవలప్​మెంట్, రియల్ ఎస్టేట్​ రెగ్యులరైజేషన్​, బ్యాంకు రుణాల ఎగవేతల కట్టడి, మానిటరీ పాలసీ, బ్లాక్​మనీ కంట్రోల్, డిమానిటైజేషన్​, ట్యాక్స్​ రిలాక్సేషన్​, గూడ్స్​ అండ్​ సర్వీసెస్​ ట్యాక్స్​​ వంటి ఆర్థిక సంబంధమైనవే ఎక్కువగా ఫోకస్​ అయ్యాయి. రాజకీయ, సామాజిక కోణాల్లో ఎలాంటి ప్రయోగాలకు వెళ్లలేదు. ముందుగా కాలూనడానికి తీసుకోవలసిన చర్యలపైనే దృష్టి పెట్టారు.

పెరిగిన క్యాష్​లెస్​ ట్రాన్సాక్షన్స్​

ఈసారి తమ పార్టీ ప్రయారిటీల్లో అతి ముఖ్యమైన జమ్మూ కాశ్మీర్​ సమస్య, ట్రిపుల్​ తలాక్​ నిషేధం వంటి కీలక అంశాల్ని పరిష్కరించుకున్నారు. ఈ సందర్భంలో మోడీ సర్కారు మొదటి విడత పాలన గురించి ఒకటి రెండు మాటలు చెప్పుకోవాలి. 2014లో అధికారంలోకి వచ్చేనాటికి దేశంలో ఆర్థిక పరిస్థితి చాలా కంగాళీగా ఉండేది. పరోక్ష పన్నుల వ్యవస్థలో గందరగోళం ఎక్కువగా ఉంది.  అందుకే జీఎస్టీ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ప్రపంచమంతా డిజిటలైజేషన్​ జరుగుతుంటే మన దేశంలోమాత్రం నగదు చెలామణీ ఎక్కువగా జరిగేది. దానిని కంట్రోల్​ చేయడానికి క్యాష్​లెస్​ ట్రాన్సాక్షన్​ సిస్టమ్​ని అన్ని రంగాల్లోనూ ప్రవేశపెట్టారు. ఛాయ్​ డబ్బాల్లో చెల్లింపులు మొదలుకొని కోట్లాది రూపాయల లావాదేవీల వరకు ఇప్పుడు కామన్​ ఫ్లాట్​ఫారంమీదుగా ట్రాన్సాక్షన్​ జరుగుతోంది. ఇంతకుమించి దూకుడుగా వెళ్లడానికి ఫస్ట్​ ఫేజ్​ అనుకూలంగా లేదు. బొటాబొటీ మెజారిటీతో ప్రభుత్వాన్ని నడుపుకుంటూ వచ్చారు.

2019 మే 30న సంపూర్ణ మెజారిటీతో సెకండ్​ ఫేజ్​ని ఆరంభించారు. మంత్రివర్గ ప్రమాణస్వీకారానికి ముందే ప్రయారిటీలు ఖాయమై పోయాయి. ఉత్పాదక రంగానికి అనుబంధంగా ఉండాల్సిన బ్యాంకింగ్​, బీమా, వాణిజ్యం, పరిశ్రమలు, రైలు, రోడ్డు రవాణా వంటివన్నీ ఎకనామిక్ మినిస్ట్రీలుగా అప్​గ్రేడ్​ చేశారు.  వ్యవసాయ రంగంలో మందకొడితనాన్ని గుర్తించి రాధా మోహన్​ సింగ్​ స్థానంలో నరేంద్ర సింగ్​ తోమర్​ని తీసుకున్నారు. అగ్రికల్చర్​ మినిస్ట్రీకి రైతుల సంక్షేమాన్నికూడా జోడించారు. అలాగే, దేశంలో పశ్చిమ బెంగాల్​ నుంచి గుజరాత్​ వరకుగల సముద్ర తీరాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ఫిషరీస్​ మినిస్ట్రీని ఏర్పాటు చేశారు. పశు సంవర్థకశాఖ, పాల ఉత్పత్తి, మత్స్య పరిశ్రమ మూడింటినీ ఒక గూటి కిందకు చేర్చి ఇండిపెండెంట్​ చార్జితో సహాయ మంత్రిని నియమించారు. రూరల్​ ఎకానమీని పరుగులుపెట్టించడానికి ఇది ఎంతగానో సాయపడుతుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

నిర్మాణ రంగానికి ఇన్సెంటివ్​లు

ఇక, పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించే హౌసింగ్​, నిర్మాణ రంగానికి ఇన్సెంటివ్​లు కల్పించారు. దేశంలో వ్యవసాయం తర్వాత అనార్గనైజ్​డ్​ సెక్టార్​లో అత్యధికంగా కార్మికులు పనిచేసేది కనస్ట్రక్షన్​ రంగంలోనే. దీనికోసం ఫస్ట్​ ఫేజ్​లోనే రెరా, జీఎస్టీ వంటివి ప్రవేశపెట్టారు. దాదాపు 150 రకాల పరిశ్రమలు రియల్​ ఎస్టేట్,​ నిర్మాణ రంగంపై ఆధారపడి ఉంటాయి. హౌసింగ్​ రుణాలపై వడ్డీలను తగ్గించడం, కనస్ట్రక్షన్​ కంపెనీలకు క్రెడిట్​ సదుపాయం కల్పించడం వంటి చర్యలతో చాలా ప్రోత్సాహకాలు ఇస్తున్నారు.

నాన్​–పెర్​ఫార్మెన్స్​ అసెట్స్​ (ఎన్పీయే)లతో నేలమట్టమవుతున్న బ్యాంకింగ్​ రంగాన్ని ఒక దారికి తెచ్చే ప్రయత్నంకూడా సాగుతోంది. మొండి బకాయిల్ని రైటాఫ్​ చేయడంద్వారా ముందుగా బ్యాలెన్స్​ షీట్లను స్ట్రీమ్​లైన్​ చేశారు. ఎయిర్​ ఇండియా లాంటి తెల్ల ఏనుగుల్ని వదిలించుకోవడానికి చర్యలు చేపట్టారు. సుమారు 19 వేల కోట్ల డాలర్ల (రూపాయల్లో దాదాపు 13 లక్షల 30 వేల కోట్లు)కు చేరిన మొండి పద్దుల్ని వచ్చే ఆర్థిక సంవత్సరానికి 9 లక్షల కోట్ల రూపాయలకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా నేషనలైజ్​డ్​ బ్యాంకుల సంఖ్యను 12కి కుదించాలని నిర్ణయించారు. మోడీ ప్రభుత్వానికి ఫుల్​ మెజారిటీ ఉన్నందువల్ల 2024 ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. ఈలోగానే తాము అనుకున్న లక్ష్యాల్ని పూర్తి చేయడానికి ప్రధాన మంత్రి ఆఫీసు (పీఎంవో)లో పూర్తిస్థాయి​ మానిటరింగ్​, ఫాలోఅప్​ సెటప్​ రెడీ చేస్తున్నారు. దీనిని ప్రోయాక్టివ్​ గవర్నెన్స్​ అండ్​ టైమ్​లీ ఇంప్లిమెంటేషన్​ (ప్రగతి) సిస్టమ్​గా వ్యవహరిస్తున్నారు. ఇండియా ఇప్పటికే టాప్​–10 ఆర్థికాభివృద్ధి దేశాల్లో అయిదో స్థానంలో ఉంది. సెకండ్​ టర్మ్​ పూర్తయ్యేనాటికి జపాన్​నికూడా దాటిపోయి ఆసియా పసిఫిక్​ రీజియన్​లో రెండో స్థానం చేరుకుంటుందని ఫైనాన్షియల్​ ఎక్స్​పర్ట్​లు అంచనా వేస్తున్నారు.

ఎన్నో విమర్శలు..

ఈ వంద రోజుల పాలనలో మోడీ తీసుకున్న నిర్ణయాల్లో చాలా వరకు ఒంటెత్తు పోకడలే ఉన్నాయని, నమ్మిన బంటు అమిత్ షాకి మాత్రమే ఏదైనా చెబుతారని విమర్శకులు అంటారు. దీనికి ఉదాహరణగా బ్యాంకుల విలీనాన్ని చూపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక ఐడెంటిటీగా నిలిచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్​బీహెచ్)ను ఇంతకుముందే ఎస్బీఐలో విలీనం చేయగా, మిగిలిన ఆంధ్రా బ్యాంక్​ను తీసుకెళ్లి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలిపేశారు. ఎస్బీహెచ్, ఆంధ్రా బ్యాంక్​లు రెండూ చాలా పెద్దవని, వీటికున్న క్రెడిబిలిటీ, మార్కెట్ వాల్యూ ఎక్కువని గుర్తు చేస్తున్నారు. అలాగే, ట్రిపుల్ తలాక్​ని శిక్షార్హమైన చర్యగా మార్చే బిల్లుపై ప్రతిపక్షాల అభ్యంతరాల్ని పట్టించుకోలేదు. యాంటీ టెర్రర్ చట్టం దేశంలోని నాన్–బీజేపీ వర్గాలకు శాపంలా మారుతుందన్న భయం నెలకొంది. సమాచార హక్కు (సవరణ) చట్టంలో కొత్త సవరణల వల్ల అధికారిక సమాచారం సామాన్యులకు అందదు. అధికారులకు ఇష్టమైతే ఇస్తారు లేదంటే కాన్ఫిడెన్షియల్ పేరుతో ఆపేస్తారు.  మునుపటిలా రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద టైమ్ బౌండ్ ఏదీ ఉండదు. అన్నింటికంటే మించి జమ్మూకాశ్మీర్​ విషయంలో తీసుకున్న నిర్ణయాన్నిఎవరూ తప్పుపట్టకపోయినా.. దాన్ని అమలుచేస్తున్న తీరుపై అందరూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాశ్మీర్ లోయలో ఫరూఖ్​ అబ్దుల్లా, ఒమర్​ అబ్దుల్లా, మెహబూబాముఫ్తీ తదితరులను హౌజ్​ అరెస్ట్​ చేయటాన్ని ఖండిస్తున్నారు.

మోడీ తనను తాను సామాన్యుడినని పదే పదే అంటుంటారు గానీ, వాస్తవానికి చాలా ఖరీదైన దుస్తులు వేసుకుంటారనే వాదన  వినిపిస్తోంది.  మోడీలో డాషింగ్ నేచర్ ఎంత ఉందో… డామినేషన్ బిహేవియర్ కూడా అదే మోతాదులో ఉందంటారు. మోడీ మనస్తత్వం రీత్యా ఎవరినీ లెక్క చేయరని, ‘అంతా తానే’ అన్నట్లుగా ఫీలవుతారని సీనియర్లు తప్పు పడుతున్నారు. మోడీ చేతికి పగ్గాలు పూర్తిగా అప్పగిస్తే నియంత(డిక్టేటర్)లా వ్యవహరిస్తారనే ప్రచారం కూడా ఉంది. గుజరాత్ సీఎంగా ఉన్న 12 ఏళ్లలోనూ..  అన్ని మేజర్ పోర్ట్​ఫోలియోలను, మినిస్ట్రీలను తన వద్దే ఉంచుకునేవారని, తప్పనిసరైతే సన్నిహితులకు ఇచ్చేవారని ఉదాహరణగా చూపుతున్నారు. ముఖ్య నిర్ణయాలన్నీ మోడీ ఒక్కరే తీసుకుంటారని పరిశీలకుల టాక్‌. తనకన్నా సీనియర్లయిన లాల్​కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను మోడీ పక్కకు తప్పించారు. ఈ పద్ధతి నచ్చక యశ్వంత్‌ సిన్హా, శత్రుఘ్న సిన్హా, జశ్వంత్‌ సింగ్‌ లాంటి కొంత మంది లీడర్లు వాళ్లంతటవాళ్లే పార్టీని వీడారని చెబుతారు. కీలక బిల్లుల విషయంలో పార్టీల అభిప్రాయాలనూ తీసుకునే అలవాటు లేదంటారు ఎనలిస్టులు.

వంద రోజుల్లో 167 ఐడియాలు

కేంద్రంలో మోడీ సర్కార్​–2 కొలువుదీరాక మొదటి 100 రోజుల్లో అమలుచేయాల్సిన 167 ట్రాన్స్​ఫార్మాటివ్​ ఐడియాలను షార్ట్​లిస్ట్​ చేశారు. ఈ ఆలోచనలను 2019 జూలై 5 నుంచి అక్టోబర్​ 15 వరకు ఆచరణలోకి తేవాలని డిసైడ్​ అయ్యారు. వివిధ మంత్రిత్వ శాఖల, టాప్​ లెవెల్​ ఆఫీసర్ల సమావేశాల్లో ఈ ఐడియాలను ఫైనల్​ చేశారు.  హయ్యర్​ ఎడ్యుకేషన్​ ఇన్​స్టిట్యూట్స్​లోని 3 లక్షల ఫ్యాకల్టీ వేకెన్సీల రిక్రూట్​మెంట్​కి మెగా​ డ్రైవ్​ చేపట్టాలనే టాస్క్​ని హ్యూమన్​ రీసోర్స్​ డెవలప్​మెంట్​ మినిస్ట్రీకి అప్పగించటం ఇందులో ఒకటి.  ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్​ మ్యూజియం అండ్​ లైబ్రరీ క్యాంపస్​లో ప్రధానమంత్రుల మ్యూజియం పూర్తి చేయాల్సిన బాధ్యతను మినిస్ట్రీ ఆఫ్​ కల్చర్​కి కేటాయించారు. జాతిపిత మహాత్మాగాంధీ 150వ బర్త్​ యానివర్సరీ సందర్భంగా రెడ్​ ఫోర్ట్​ వద్ద మూడు కొత్త బారక్​ మ్యూజియాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి సంబంధించి పలు ఇతర కార్యక్రమాలు కూడా నిర్వహించాల్సి ఉంది. ఈ ఐడియాల అమలు బాధ్యతను ఆయా శాఖల సెక్రెటరీలకు ఇచ్చారు. ఈ ప్లాన్​ ప్రోగ్రెస్​ను కేబినెట్​ సెక్రెటరీ ప్రదీప్​ కే సిన్హా స్వయంగా చెక్​ చేశారు. ఆ బాధ్యతను కొత్త కేబినెట్​ సెక్రటరీ రాజీవ్​ గౌబ స్వీకరించారు.

పార్లమెంట్​ తొలి సెషన్ లోనే రికార్డు

17వ లోక్​సభ తొలి (బడ్జెట్​) సెషన్  అరుదైన రికార్డు సృష్టించింది.  ఉభయ సభల్లోనూ కలిపి 37 బిల్లులు ప్రవేశపెడితే 30 బిల్లు పాసయ్యాయి. 1952 తర్వాత బడ్జెట్ సమావేశాల్లో ఇంత పెద్ద సంఖ్యలో బిల్లులు పాస్ కావడం ఇదే తొలిసారి. పార్లమెంటు  సమావేశాలను పొడిగించుకుని మరీ బిల్లులు పాసయ్యేలా శ్రద్ధ తీసుకున్నారు.

లోక్​సభలో ఫుల్​ మెజారిటీ ఉన్నప్పటికీ రాజ్యసభలో సంఖ్యా బలం లేదు. అయినప్పటికీ కీలక బిల్లులను ఆమోదింపచేసుకోవడంలో చాలా తెలివి ప్రదర్శించింది. సక్సెస్ అయింది. ట్రిపుల్ తలాక్ సహా రాజ్యసభలో ఆగిపోయిన అనేక బిల్లులను ఈసారి తన మార్క్  చతురతతో మోడీ సర్కారు పాస్​ చేయించుకుంది. వీటిలో సెక్యూరిటీకి సంబంధించి యాంటీ టెర్రర్​ చట్టాలు, కార్మిక రంగంలో సంస్కరణలు, మోసగాళ్లను అదుపు చేసే చట్టాలు, ట్రిపుల్​ తలాక్​ కంట్రోల్​ బిల్లు, జమ్మూ కాశ్మీర్​కి ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికల్​–370 రద్దు బిల్లు, చిన్నారులను రేప్​ చేస్తే మరణ శిక్ష విధించేలా సవరణ బిల్లు వంటివి ఉన్నాయి.

పాస్ అయిన ముఖ్య బిల్లులు

  • జమ్మూ కాశ్మీర్​కి ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికల్​–370 రద్దు
  • నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (సవరణ) బిల్లు
  • మోటార్ వెహికిల్ (సవరణ) బిల్లు
  • నేషనల్ మెడికల్ కౌన్సిల్ (సవరణ) బిల్లు
  • ట్రిపుల్ తలాక్ బిల్లు సమాచార హక్కు (సవరణ) బిల్లు
  • చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక సవరణ (ఉపా) బిల్లు
  • కేంద్ర విశ్వవిద్యాలయాల (సవరణ) బిల్లు
  • చైల్డ్​ సెక్సువల్​ అసాల్ట్​ (సవరణ) బిల్లు
  • కార్మిక చట్టాలలో సంస్కరణల బిల్లు

కేంద్రం కీలక నిర్ణయాలు

1 జమ్మూకాశ్మీర్​ స్పెషల్​ స్టేటస్​ కట్: జమ్మూ కాశ్మీర్​కి స్పెషల్​ స్టేటస్​ ఇస్తున్న ఆర్టికల్​–370ని రద్దు చేయాలని బీజేపీ ఎప్పటినుంచో కోరుకుంటోంది. సమయం కోసం ఆగింది. మరోసారి పవర్​లోకి వస్తే ఇది తప్పదని ముందే చెప్పింది. ఫుల్​ మెజారిటీ రాగానే జమ్మూ కాశ్మీర్​ని చక్కదిద్దే పని మొదలుపెట్టింది.  పక్కా ప్లానింగ్​తో జమ్మూకాశ్మీర్​ ప్రత్యేక జెండాను, స్పెషల్​ ఆర్టికల్​–370ని రద్దు చేశారు. దీంతోపాటు ఆ రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్​, లఢఖ్​గా విడదీశారు. జమ్మూ కాశ్మీర్​ని అసెంబ్లీతో కూడిన యూనియన్​ టెర్రటరీగా, లఢఖ్​ను కేవలం యూటీగా మార్చారు. ఆర్టికల్​–370 రద్దు సరికాదన్న పొరుగు దేశం పాకిస్థాన్​ను ఇండియా అంతర్జాతీయంగా ఏకాకిని చేయగలిగింది. ఈ విషయంలో అమెరికా, రష్యా వంటి అగ్ర దేశాలు మనకే సపోర్ట్​ ఇచ్చాయి. సమితి కూడా పాక్​ వాదనను తోసిపుచ్చింది.

2 యాంటీ టెర్రర్​ లా : టెర్రరిజం పట్ల మోడీ గవర్నమెంట్​ మొదటి నుంచీ స్ట్రిక్ట్​గానే ఉంది. ఆ సమస్యను అస్సలు సహించలేదు. భవిష్యత్​లో టెర్రరిస్టులకు తావు లేకుండా చేయాలన్న లక్ష్యంతో ‘అన్​లాఫుల్​ యాక్టివిటీస్​ (ప్రివెన్షన్​) అమెండ్​మెంట్​ బిల్లు’ను పార్లమెంట్​లో ప్రవేశపెట్టి ఆమోదం పొందింది. ఎవరైనా టెర్రర్​​ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు డౌటొస్తే వాళ్లపై టెర్రరిస్ట్​ ముద్ర వేసి, ఆస్తులు స్వాధీనం చేసుకునే అధికారాన్ని ఈ చట్టం కేంద్రానికి కట్టబెట్టింది.

3 ట్రిపుల్​ తలాక్​ బిల్లు : ఈ బిల్లు పాసవటం ఎన్​డీఏ గవర్నమెంట్​కి బిగ్​ విక్టరీ అని చెప్పొచ్చు. ముస్లిం వ్యక్తి తన భార్యకు మూడు సార్లు తలాక్​ చెప్పడం ద్వారా తెగతెంపులు చేసుకునే సంప్రదాయాన్ని కట్టడి చేసింది. దీనికి ముగింపు పలకాలని నిర్ణయించుకొని ఎట్టకేలకు అనుకున్నది సాధించింది. రాజ్యసభలో సరైన మెజారిటీ లేకపోవటంతో మోడీ సర్కార్​–1 ఈ బిల్లును చట్టం చేయలేకపోయింది. ఫలితంగా పలుమార్లు ఆర్డినెన్స్​లు జారీచేయాల్సి వచ్చింది. ఈ కొత్త చట్టం ద్వారా ట్రిపుల్​ తలాక్​ని శిక్షార్హమైనదిగా మార్చారు.

4 సెవెన్​ ఫారిన్​ టూర్స్ ​: విదేశాలతో సంబంధాలు పెంచుకోవటానికి, ఫారిన్​ లీడర్లతో రెగ్యులర్​గా టచ్​లో ఉండటానికి మోడీ ఎప్పుడూ ప్రాధాన్యమిస్తారు. అదే తీరుగా రెండో టర్మ్​లోని తొలి వంద రోజుల్లో అనేక దేశాలు పర్యటించారు. కొద్ది సమయంలోనే ఏడు దేశాల్లో పర్యటించి ఇండియా వాయిస్​ని బలంగా వినిపించారు. టెర్రరిజం విషయంలో ముఖ్యంగా పాకిస్థాన్​పై పైచేయి సాధించారు. నైబర్​హుడ్​ ఫస్ట్​ పాలసీలో భాగంగా… ఆసియా దేశాలైన మాల్దీవులు, శ్రీలంక, భూటాన్​, అరబ్​ ఎమిరేట్స్​, బహ్రెయిన్​ చుట్టొచ్చారు. ప్రపంచంలో పలుకుబడిగల ఫ్రాన్స్​, రష్యాలలో పర్యటించి, వారితో సంబంధాలు మెరుగుపరిచారు.

5 బ్యాంకుల విలీనం : ఫస్ట్​ టర్మ్​లో పెద్ద నోట్ల రద్దు వంటి కీలక నిర్ణయం తీసుకున్న మోడీ సర్కారు… రెండో టర్మ్​లో నేషనలైజ్​డ్​ బ్యాంకుల పనితీరుపై దృష్టి సారించింది. పది జాతీయ బ్యాంకులను కలిపి నాలుగు పెద్ద బ్యాంకులు ఏర్పాటు చేయనున్నట్లు రీసెంట్​గా ప్రకటించింది. మొండి బాకీల భారంతో ముందడుగు వేయలేకపోతున్న ఆ పది బ్యాంకులకు రుణభారం నుంచి రిలీఫ్​ కలిగించటానికే ఈ నిర్ణయం తీసుకుంది. కస్టమర్లకు బెటర్​ సర్వీస్​లు అందించటానికి కూడా ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

first 100 days of Modi 2.0