ఎల్లమ్మ తల్లికి తొలిబోనం.. గోల్కొండ కోటలో ఘనంగా జాతర షురూ

ఎల్లమ్మ తల్లికి తొలిబోనం.. గోల్కొండ కోటలో ఘనంగా జాతర షురూ
  •  లంగర్ హౌస్ నుంచి కోట వరకు భారీగా తొట్టెల ఊరేగింపు
  • పట్టు వస్త్రాలు సమర్పించిన స్పీకర్ గడ్డం ప్రసాద్​, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్​

హైదరాబాద్, వెలుగు: శివసత్తుల సిగాలు.. పోతరాజుల చర్నాకోలా ఆటలు.. తొట్టెల ఊరేగింపుల నడుమ ఆషాఢ బోనాల జాతర షురూ అయింది. యాపకొమ్మలు చేతిలో పట్టుకొని.. బోనాలను నెత్తిమీద పెట్టుకొని ఆడబిడ్డలు ఆలయాలకు పోటెత్తారు. నెలరోజుల జాతర ఆదివారం గోల్కొండ కోటలోని ఎల్లమ్మ తల్లికి తొలి బోనంతో మొదలైంది. అమ్మవారికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు  పట్టువస్ర్తాలు సమర్పించారు. 

లంగర్ హౌస్​లో భారీ వేదికపై బోనాలకు పూజలు చేసిన అనంతరం తొట్టెల, తొలిబోనంగా పిలిచే నజర్ బోనాలకు పూజలు చేసి ఊరేగింపు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్, మంత్రులు పోతరాజులతో కలిసి చర్నాకోలాలు చేతిలో పట్టుకుని ఉత్సాహపరిచారు. అనంతరం రథం, తొట్టెల ఊరేగింపు లంగర్ హౌస్ చౌరస్తా నుంచి  ఫతేదర్వాజా, చోటా బజార్, బడా బజార్, గోల్కొండ చౌరస్తా నుంచి కోటకు చేరుకుంది. 

మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమైన ఊరేగింపు గోల్కొండ కోటకు రాత్రి 7 గంటలకు చేరుకుంది. కిక్కిరిసిన గోల్కొండ కోట గోల్కొండ కోట వద్ద సంప్రదాయ డప్పులు, ఇతర సంగీత వాద్యాలతో దరువు వేస్తూ భక్తులు నృత్యాలు చేశారు. భారీ తొట్టెలు కోట ప్రధాన ద్వారం నుంచి అమ్మవారి ఆలయం వరకు ముందుకు సాగుతూ ఉండగా భక్తులు వెన్నంటి వెళ్లారు. కోట చౌరస్తా వద్ద పోతరాజుల చేసిన విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి.

 చేతుల్లో కొరడాలు, నాలుకలపై నిమ్మకాయలతో పోతరాజుల ప్రత్యేక విన్యాసాలు ఉత్సవాలకు వన్నె తెచ్చాయి. ఓ వైపు తొట్టెల ఊరేగింపు, మరోవైపు భక్తులతో గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయం, పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఆలయ పూజారులు సాయిబాబా చారి, సర్వేశ్వర చారి  ఆధ్వర్యంలో అమ్మవారికి పూజలు నిర్వహించారు. బోనాల ఉత్సవాల సందర్భంగా గోల్కొండ కోటలో భక్తులకు  అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అన్నిచోట్ల మంచినీటి సౌకర్యం కల్పించడంతో పాటు హెల్త్​ క్యాంపులు ఏర్పాటు చేశారు. కోటవద్ద మొబైల్​ టాయిలెట్లను ఏర్పాటు చేశారు.ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గోల్కొండ, లంగర్​ హౌస్​ పరిసర ప్రాంతాల్లో 600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తొలిరోజు ఉత్సవాల్లో మాజీ ఎంపీ వీహెచ్​, డిప్యూటీ మేయర్​ మోతె శ్రీలతరెడ్డి,  ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్ , దేవాదయశాఖ కమిషనర్ హన్మంత్ రావు,  హైదరాబాద్ కలెక్టర్ అనుదిప్ దురశెట్టి, నగర పోలీసు కమిషనర్​ శ్రీనివాస్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ అరవింద్ మహేష్ కుమార్​ తదితరులు పాల్గొన్నారు. 

రాష్ట్రం ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడాలి: స్పీకర్

ఈ సంవత్సరం బోనాలు స్పెషల్ గా ఉన్నాయని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. గత పదేండ్లలో ఉన్న ప్రభుత్వ పెద్దలు, అధినేతలు ఈ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షభంలో ముంచిన విషయం తెలిసిందేనని.. కానీ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలకు అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని, మనోధైర్యాన్ని ఇచ్చి ఆర్థిక సంక్షోభం నుంచి రాష్ట్రం బయటపడే విధంగా అమ్మవారి దీవెనలు ఇవ్వాలని కోరుకున్నట్లు ఆయన చెప్పారు.  రాష్ట్రంలో మంచి వర్షాలు పడి రైతులు, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, ప్రజల కష్టాలన్నీ తీరాలన్నారు.  సీఎం రేవంత్ సారథ్యంలో రాష్ట్రం  పురోగతి సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు. 

బోనాలకు రూ.20 కోట్లు: మేయర్  

గత ప్రభుత్వం బోనాల పండుగ కోసం రూ.15 కోట్లు కేటాయిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయించిందని జీహెచ్​ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ కు ధన్యావాదాలు తెలియజేశారు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామన్నారు. 

బోనాల ఉత్సవాల్లో పాల్గొనడం అదృష్టం: మంత్రి కొండా సురేఖ

సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి బోనాల ఉత్సవాల్లో పట్టు వస్త్రాలను సమర్పించే అవకాశం మహిళగా తనకు రావడం అదృష్టంగా భావిస్తున్నానని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.  ప్రజలకు కనువిందు కలిగించేలా ఉత్సవాలను నిర్వహిస్తున్నామని.. వారు సకల సౌకర్యాలు, ప్రశాంత వాతావరణంలో బోనాలు సమర్పించుకొని ఇండ్లకు చేరుకునేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖను ఆదేశించామని తెలిపారు. గతంలో కంటే 10 శాతం నిధులు పెంచి దేవాలయాలకు అందించామని వివరించారు. నిరుడు రూ.15 కోట్లు ఇవ్వగా, ఈసారి తమ ప్రభుత్వం రూ.20 కోట్లు అందించిందని తెలిపారు. ఇంకా అవసరమైతే ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. 

ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది: పొన్నం

బోనాల జాతర కోసం గత నెల రోజులుగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అధికారులతో అనేక సమావేశాలు నిర్వహించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్​ తెలిపారు. ప్రభుత్వం పక్షాన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని సీఎం రేవంత్​ ఆదేశించారని ఆయన చెప్పారు. వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారని అన్నారు. ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసినా ప్రజల సహాయ, సహకారాలు కావాలి ఆయన కోరారు.