చెరువుల్లో ఫామ్​హౌస్​లు కట్టింది బీఆర్ఎస్​ నేతలే

చెరువుల్లో ఫామ్​హౌస్​లు కట్టింది బీఆర్ఎస్​ నేతలే
  • నాడు రేవంత్ ​డ్రోన్ ​తిప్పితే కేసుపెట్టి ఇప్పుడు ఫ్రెండ్​ ఫామ్​హౌస్​ అంటావా?
  • కేటీఆర్​పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఫైర్​
  • -నేను మీలా లీజుకు తీసుకున్నానని తప్పించుకోను
  • జన్వాడ ఫామ్​హౌస్​ లీజు ఎంతో చెప్పాలని డిమాండ్​
  • తన ఇల్లు బఫర్​జోన్​లో ఉంటే కూల్చేయాలని ఆర్డర్​
  • గాంధీభవన్ ​నుంచే హైడ్రా కమిషనర్​ను ఆదేశిస్తున్నట్టు వెల్లడి

హైదరాబాద్, వెలుగు: గత సర్కారు హయాంలో చెరువుల్లో అక్రమంగా ఫామ్​హౌస్​లు కట్టింది బీఆర్ఎస్​నేతలేనని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఆరోపించారు. జన్వాడ ఫామ్​ హౌస్ పై రేవంత్ రెడ్డి డ్రోన్ తిప్పినప్పుడు ఆయనపై కేసు పెట్టి, జైలుకు పంపించిన కేటీఆర్.. ఇప్పుడు మాత్రం అది తన ఫ్రెండ్​ ఫామ్​హౌస్​ అని అంటున్నారని మండిపడ్డారు. ‘‘కేటీఆర్ ఆ ఫామ్​హౌస్​ను ఎంతకు లీజుకు తీసుకున్నారో చెప్పమనండి. ఐదు వేల రూపాయలకైతే అందరం తీసుకుందాం” అని చురకలంటించారు. తన ఇల్లు బఫర్​జోన్​లో ఉంటే కూల్చేయాలని, గాంధీ భవన్​నుంచే హైడ్రా కమిషనర్​ను ఆదేశిస్తున్నానని చెప్పారు. శుక్రవారం గాంధీ భవన్​లో పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. 

“నా ఇల్లు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో ఉన్నదని గత కొన్ని రోజులుగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్​ప్రచారం చేస్తున్నారు. నేను ఇదే గాంధీ భవన్ నుంచి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఆదేశాలు ఇస్తున్నా.. రేపు వెళ్తారా? ఎల్లుండి వెళ్తారా?  కేటీఆర్, హరీశ్​రావును తీసుకొని వెళ్లండి. నా ఇంటికి సంబంధించిన ఒక్క ఇటుకైనా సరే ఇటు ఎఫ్టీఎల్ లో ఉన్నా.. అటు బఫర్ జోన్ లో ఉన్నా వెంటనే కూల్చేయండి. నేను అక్కడికి రాను, అడ్డురాను ” అని సవాల్ చేశారు. కల్వకుంట్ల కుటుంబంతో చెప్పించుకునే అవకాశం తాను ఇవ్వబోనని అన్నారు. తాను కేటీఆర్ లాగా ఫ్రెండ్ ఫామ్​హౌస్ ను లీజ్ కు తీసుకున్నానని అబద్ధాలు చెప్పడం లేదని తెలిపారు.  వాస్తవానికి ఇప్పుడు తాను ఉంటున్న ఇల్లు తన కొడుకు పేరు మీద ఉందని, అయినా అది  తన ఇల్లే అని ధైర్యంగా చెప్తున్నానని అన్నారు. తాను చేస్తున్న ఈ చాలెంజ్ ను బీఆర్ఎస్ నేతలు స్వీకరించాలని డిమాండ్​ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఖమ్మంలో చాలెంజ్ చేసి నిలబెట్టుకున్నానని గుర్తుచేశారు. మంచి ఆలోచనతో హైడ్రాను ఏర్పాటు చేశామని,  ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురికావద్దని, పేదలు మోసపోవద్దనేది దీని ఉద్దేశ్యమని చెప్పారు. తమ పార్టీకి చెందిన  కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు కుటుంబ సభ్యులకు చెందిన బిల్డింగ్ ను కూడా హైడ్రా అధికారులు కూల్చేశారని, తమకు ఎవరి విషయంలో పక్షపాతం ఉండబోదని తెలిపారు.

ప్రజలపై బీఆర్ఎస్​నేతలు కక్షగట్టారు

తమకు ఓట్లు వేయలేదని గ్రామీణప్రాంతాల్లోని రైతులు, నిరుద్యోగులపై బీఆర్ఎస్​ నేతలు కక్ష గట్టారని, అందుకే  తప్పుడు ఆరోపణలతో వాళ్లను రెచ్చగొడుతున్నారని మంత్రి పొంగులేటి మండిపడ్డారు. రుణమాఫీ విషయంలో రూ. 2 లక్షలకు పైన ఎంత బకాయి ఉన్నారో  ఆ మొత్తాన్ని బ్యాంకులకు చెల్లిస్తే, ఈ 2 లక్షలు మాఫీ అవుతాయని స్పష్టం చేశారు.  దీనికోసం త్వరలో కటాఫ్ తేదీని ప్రకటిస్తామని చెప్పారు. ప్రతిపక్షాల రెచ్చగొట్టే మాటలను రైతులు నమ్మవద్దని సూచించారు. అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు.  రాష్ట్రం అప్పులు రూ. 7 లక్షల కోట్లు ఉన్నా.. ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని, కేవలం 26 రోజుల్లోనే 22 లక్షల  మంది రైతులకు రూ. 12 ,300 కోట్లు రుణమాఫీ కింద ఖర్చు చేశామని వెల్లడించారు.   

త్వరలోనే రెండు సెక్టార్లుగా రేషన్, హెల్త్​కార్డులు

త్వరలోనే రెండు సెక్టార్లుగా రేషన్, హెల్త్​కార్డులు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి తెలిపారు.  ఇది ప్రజల ఆలోచన అని, దీన్నే ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు.  దేశానికే రోల్​మోడల్​గా నిలిచేలా తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ చట్టంపై సీఎం రేవంత్ ప్రకటన చేశారని చెప్పారు. దీన్ని ఇప్పటికే పబ్లిక్ డొమైన్ లో పెట్టి, అన్ని వర్గాల సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని, చివరకు  ప్రతిపక్షాల సలహాలను కూడా తీసుకొని అమలు చేస్తామని ప్రకటించారు.  జిల్లాస్థాయిలో ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు అన్ని కలెక్టరేట్లలో సెమినార్స్​ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సలహాలను నివేదిక రూపంలో తెప్పించుకొని, ఆర్వోఆర్ 2020 ని రద్దు చేస్తామన్నారు. 

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు..

జవహర్ సొసైటీలోని వెయ్యికి పైగా ఉన్న జర్నలిస్టులకు 72 ఎకరాల స్థలాన్ని త్వరలోనే అప్పగిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి తెలిపారు. కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టులపై  జరిగిన దాడి దురదృష్టకరమని చెప్పారు. ఆ శాఖ మంత్రిగా విచారం వ్యక్తం చేస్తున్నానని, దీనిపై విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని తెలిపారు. నివేదిక రాగానే బాధ్యులైన వారిపై చర్యలు ఉంటాయని చెప్పారు. తమ ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను కాపాడుతుందని స్పష్టం చేశారు. రాబోయే ఐదేండ్లలో ఇండ్లులేని వారు ఎవరూ ఉండొద్దనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్​మొదటి విడతలో భాగంగా 4 లక్షల 50 వేల ఇండ్లను రూ. 22 వేల కోట్లతో నిర్మించనున్నట్టు చెప్పారు.  ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3 ,500 చొప్పున ఇండ్లు నిర్మిస్తామని తెలిపారు. 

బీఆర్ఎస్ ఇవ్వకుండా మధ్యలోనే నిర్మాణాలు నిలిపివేసిన ఇండ్లను కూడా పూర్తిచేసి, అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని చెప్పారు. త్వరలోనే లబ్ధిదారుల జాబితా రిలీజ్​ చేస్తామని తెలిపారు. పదేండ్లు అధికారం అను భవించిన బీఆర్ఎస్ నేతలు.. కేవలం 8 నెలలకే అధికారంలో లేకుండా ఉండలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి కూర్చున్న కుర్చీలో తొందరగా కూర్చోవాలనే తపన వారిలో కనిపిస్తున్నద న్నారు. లేదంటే ఆ కుర్చీలో తానో, భట్టినో, ఉత్తమో కూర్చుంటారంటూ ప్రచారం చేస్తున్నారని, అదంతా అవాస్తవమని అన్నారు.  రేవంత్ రెడ్డి మా సీఎంగా కొనసాగుతారని స్పష్టం చేశారు.