గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక

గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక

భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలోకి వరద నీరు చేరటంతో ప్రవాహం పెరుగుతోంది. నీటి మట్టం 43 అడుగులకు చేడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు.

 జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు  లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. భద్రాచలం స్నానఘట్టాల దగ్గర వరద నీరు పెరుగుతుండడంతో అప్రమత్తం చేశారు. కరకట్ట స్లూయిజ్ ల దగ్గర పరిస్థితిని పరిశీలించి పట్టణ బ్యాక్ వాటర్ తో పాటు గోదావరి వరద నీరు స్లూయిజ్ ల ద్వారా లీకేజి కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆదేశించారు.

కొత్త కాలనీ లోకి సుభాష్ నగర్ కాలనీ లలోకి గోదావరి వరద నీరు ముందుగా  వచ్చే అవకాశం ఉండడంతో .. ఆయా ప్రాంతాల ప్రజలను ముందుగా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసారు. పట్టణంలో 10  పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు మరింత వరద పెరిగితే గోదావరి 48 అడుగులకు చేరితే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అపుడు   భద్రాచలం నుండి దుమ్ముగూడెం చర్ల మండలాలకు.. ఇటు ఆంధ్రా కూనవరం చింతూరు వి.అర్.పురం మండలాలకు రాకపోకలు నిలిచిపోతాయి.  పునరావాస కేంద్రాలలో తలదాచుకునే ప్రజలకు అన్ని వసతులు ఏర్పాటు చేశారు. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు జలాశయానికి ఎగువన ఛత్తీస్ ఘడ్ నుండి వస్తున్న భారీ వరదతో ఈరోజు మొత్తంగా 5 లక్షల క్యూసెక్కుల వరదనీరు దిగువకు విడుదల చేశారు అధికారులు