తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ ప్రశాంతం

తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ ప్రశాంతం
  • ఇంగ్లీష్ పరీక్షకు 72.44 శాతం హాజరు
  • 31,403 మందికి గాను పరీక్ష రాసిన 22,750 మంది

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ తొలిరోజు ప్రశాంతంగా ముగిసింది. సోమవారం జరిగిన క్వాలిఫైయింగ్ టెస్ట్ ఇంగ్లిష్ ఎగ్జామ్ కు 72.4 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారని టీజీపీఎస్సీ ప్రకటించింది. 563 పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న గ్రూప్ 1 మెయిన్స్ సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 46 పరీక్షా కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పరీక్ష నిర్వహించారు. మొత్తం 31,403 మందికి గాను 22,750 మంది హాజరయ్యారు. 

అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 87.23శాతం హాజరుకాగా, రంగారెడ్డిలో 73.07%, మేడ్చల్ లో 67.49% మంది హాజరయ్యారు. మరోవైపు హైకోర్టు అనుమతితో స్పోర్ట్స్​కోటా నుంచి 20 మంది అభ్యర్థులు పరీక్ష కు హాజరయ్యారు.  పరీక్షలను వాయిదా వేయాలనే అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో కేంద్రాల వద్ద భారీగా పోలీసు బందోబస్తు నిర్వహించారు. కాగా, పరీక్షా కేంద్రాలు దాదాపు సిటీ శివారు ప్రాంతాల్లోనే ఉండడంతో ఉదయం నుంచే అభ్యర్థులు అక్కడికి చేరుకున్నారు. మధ్యాహ్నం 12.30గంటల నుంచి ఒకటిన్నర వరకూ అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు.

 ఆలస్యంగా వచ్చిన వారిని లోపలికి అనుమతించలేదు. జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు లేకపోవడంతో.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు కొంత ఇబ్బందులు పడ్డారు. సెంటర్లన్నీ దూరంగా ఉండటంతో.. ప్రత్యేకంగా వాహనాలను మాట్లాడుకొని అక్కడికి చేరుకోవాల్సి వచ్చింది. మరోపక్క పరీక్షా కేంద్రాల్లోనే సిబ్బంది అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకున్నారు. దాదాపు అన్ని రూముల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా, టీజీపీఎస్సీ ఆఫీసు నుంచి కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి, సెక్రటరీ నవీన్ నికోలస్ పర్యవేక్షించారు. కాగా, ఓఎంఆర్ షీట్లలో అభ్యర్థులే వివరాలను నింపాల్సి ఉంటుందని ప్రకటించిన అధికారులు.. ప్రస్తుతం ప్రిటెండ్ ఓఎంఆర్ ను అందించారు.

గ్రూప్ 1 అటెండెన్స్ వివరాలు..

హైదరాబాద్​ జిల్లాలో ఏర్పాటు చేసిన ఎనిమిది సెంటర్లలో 5,613 మంది అభ్యర్థులకు గాను 4,896 (87.23శాతం ) మంది హాజరయ్యారు. అలాగే, రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన  పదకొండు సెంటర్లలో 8,011 మంది అభ్యర్థులకు గాను 5,854 (73.07శాతం ) మంది హాజరయ్యారు. మేడ్చల్​ జిల్లాలో ఏర్పాటు చేసిన  27 సెంటర్లలో 17,779 మంది అభ్యర్థులకు గాను 12 వేల (67.49శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు.