ఫస్ట్​ పనులు.. ఆ తర్వాతే ఎన్నికలు.. టీఆర్ఎస్ కొత్త వ్యూహం

ఫస్ట్​ పనులు.. అటెన్కనే ఎన్నికలు

ఇంటర్నల్‍ సర్వేల్లోనూ టీఆర్‍ఎస్‍పై పబ్లిక్​లో వ్యతిరేకత?

వరద సాయం ఇయ్యలేదనే కోపంలో ఓరుగల్లు పబ్లిక్​

జీహెచ్​ఎంసీ రిజల్ట్స్​ రిపీట్ ​అయితయేమోనని టెన్షన్‍

ఎన్నికలకు ఇంకా టైం ఉందని మంత్రి ఎర్రబెల్లి ఇండికేషన్స్

వరంగల్‍ రూరల్‍, వెలుగు: జీహెచ్​ఎంసీ ఎలక్షన్స్​రిజల్ట్స్​ అట్ల రాంగనే ఇట్ల వరంగల్​, ఖమ్మం కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన సర్కారు ఇప్పుడు వాయిస్​ మార్చింది. ఒకానొక టైంలో డిసెంబర్‍ 6న నోటిఫికేషన్‍ ఇస్తామని గ్రౌండ్​ వర్క్​ చేసుకోవాలని గులాబీ సిట్టింగ్ ​కార్పొరేటర్లకు టీఆర్​ఎస్​ హైకమాండ్​ ఇండికేషన్స్​ ఇచ్చింది.  తీరా గ్రేటర్ ​హైదరాబాద్​ ఎలక్షన్స్ లో ఎదురుదెబ్బ తగలడంతో ఈ రెండు కార్పొరేషన్లలోనూ అవే రిజల్ట్స్​ రిపీట్​ అవుతాయనే టెన్షన్‍ ఆ పార్టీ లీడర్లకు పట్టుకున్నది. దీనికి తగినట్లే ఇంటర్నల్‍ సర్వేల్లో టీఆర్‍ఎస్‍పై పబ్లిక్​లో వ్యతిరేకత ఉన్నట్లు తెలిసింది. ముఖ్యంగా ఓరుగల్లు జనం​తమకు వరద సాయం ఇయ్యలేదనే కోపంలో ఉన్నారని రూలింగ్​ పార్టీ లీడర్లు గుర్తించారు. ఈక్రమంలోనే వరంగల్​, ఖమ్మం సిటీల్లో ముందుగా పెండింగ్ పనులు కంప్లీట్​ చేసి, ఫిబ్రవరిలో ఎలక్షన్స్​కు వెళ్లాలని భావిస్తున్నారు.

వరద సాయం ఇయ్యలేదని..

టీఆర్‍ఎస్‍పై వ్యతిరేకత, సిట్టింగుల పనితీరుపై అసంతృప్తి, వరదల టైంలో, సాయం పంపిణీలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు.. ఇలాంటి కారణాల వల్లే గ్రేటర్‍ హైదరాబాద్‍ ఎలక్షన్స్​లో తమకు ఆశించిన సీట్లు రాలేదని అధికారపార్టీ భావిస్తోంది. దాదాపు అవే సమస్యలు, పరిస్థితులు వరంగల్​ సిటీలోనూ ఉన్నాయి. దీంతో ఆ పార్టీ లీడర్లు అలర్ట్​ అయ్యారు. తమదైన స్టైల్​లో  డివిజన్ల వారీగా సర్వేలు చేయించారు. ఇక్కడి సిట్టింగుల పనితీరుపై వరంగల్​ పబ్లిక్​చాలా కోపంగా ఉన్నారనే విషయం ఈ సర్వేల్లో తేలినట్లు చెబుతున్నారు. హైదరాబాద్​లో ఇచ్చినట్లు తమకు రూ.10వేల వరద సాయం ఇవ్వకపోవడం, బస్తీల్లో కేసీఆర్​ హామీ ఇచ్చిన డబుల్‍ బెడ్​రూం ఇండ్లు ఇప్పటికీ రాకపోవడంపై ఓరుగల్లు జనం ఆగ్రహంగా ఉన్నారని, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు తగ్గట్లు డెవలప్​మెంట్​చేయలేకపోయారని పలువురు చెప్పినట్లు తెలుస్తోంది.

ఫిబ్రవరిలోగా పనులు కంప్లీట్​ కావాలట..!

వరంగల్‍ కార్పొరేషన్​ ఎలక్షన్స్​కు ఇంకా టైం తీసుకోవాలని నిర్ణయించిన గులాబీ లీడర్లు, ఈలోగా పెండింగ్​ పనులను కంప్లీట్​చేసి సిటీ జనాల్లో తమ పట్ల ఉన్న వ్యతిరేకతను పోగొట్టుకోవాలని ప్లాన్ వేశారు. ఇందులో భాగంగా కొంతమందికైనా డబుల్‍ బెడ్​రూం ఇండ్లను పంపిణీ చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు ఇటీవల జిల్లా కలెక్టర్‍, గ్రేటర్‍ కమిషనర్‍తో రివ్యూ నిర్వహించారు. సిటీలోని డబుల్‍ బెడ్​రూం ఇండ్ల పనులను స్పీడప్​ చేయడంతోపాటు  ఇంటింటికీ మిషన్​భగీరథ నీటిని సాధ్యమైనంత త్వరగా అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.  ఇందుకు ఫిబ్రవరి నెల డెడ్‍లైన్‍ గా పెట్టారు. స్మార్ట్​ సిటీ పనులను కూడా  స్పీడప్‍ చేయాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా కొన్ని పనులైనా కంప్లీట్​ చేసి కేటీఆర్‍తో ప్రారంభించేలా ప్లాన్‍ చేస్తున్నారు. ఆ తర్వాతే మరో సర్వే చేపట్టి దాని రిపోర్ట్​ ప్రకారం ఎన్నికలకు వెళ్లేలా అడుగులు వేస్తున్నారు.

ఖమ్మం కార్పొరేషన్​లో పనులు స్పీడప్​..

జీహెచ్​ఎంసీ రిజల్ట్స్​ ఖమ్మంలో రిపీట్​ కావద్దని భావిస్తున్న రూలింగ్​పార్టీ పక్కా ప్లాన్​ ప్రకారం ముందుకువెళ్తోంది. మంత్రి పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో కొన్ని నెలల ముందు నుంచే కార్పొరేషన్​లో డెవలప్​మెంట్​ వర్క్స్​ను టీఆర్​ఎస్​ స్పీడప్​ చేసింది. సుమారు రూ.215 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ఇటీవల  మంత్రులు కేటీఆర్​, మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ అట్టహాసంగా ప్రారంభించారు. డిసెంబర్​లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని భావించే ఐటీ హబ్​ను యుద్ధప్రాతిపదికన కంప్లీట్​ చేశారు. సిటీలో1200 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మాత్రం ఇంకా పూర్తికాలేదు. వీటిని సంక్రాంతిలోగా  పూర్తి చేసి, కొందరికైనా కేటాయించాలని అనుకుంటున్నారు. కొత్త బస్​స్టేషన్​ నిర్మాణాన్ని కూడా పూర్తిచేసి ఫిబ్రవరి లో ఎన్నికలకు వెళ్లాలని, ఈలోగా మరోసారి మంత్రి కేటీఆర్​ను రప్పించి ప్రారంభోత్సవాలు చేయించాలని భావిస్తున్నారు.

అదే మిస్టేక్‍ ఇక్కడ చేయవద్దనే..

బీజేపీ దుబ్బాక గెలుపు జోష్‍లో ఉండగానే.. టీఆర్‍ఎస్‍ హైదరాబాద్‍ ఎన్నికలకు వెళ్లి బోల్తా పడింది. కమలం పార్టీ లీడర్లు అదే స్పీడుతో పనిచేయడంతో ఫలితాల్లో మరోసారి కారు పార్టీకి పెద్ద షాక్‍ తాకింది. ఈ క్రమంలో ఇక్కడి పరిస్థితులను తెలుసుకున్న టీఆర్​ఎస్​హైకమాండ్‍ గతంలో చేసిన మిస్టేక్‍ చేయవద్దని భావించే గ్రేటర్‍ వరంగల్‍, ఖమ్మం కార్పొరేషన్​ ఎలక్షన్లను పోస్ట్​పోన్‍ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత గవర్నింగ్​బాడీస్​ గడువు మార్చి 15 వరకు ఉండడంతో అప్పటివరకు జనాల మైండ్‍సెట్‍ మారుతుందనే ఆలోచనతో గులాబీ లీడర్లు  ఒక ప్లాన్​ ప్రకారం ముందుకువెళుతున్నారు. ఈక్రమంలోనే ఇటీవల హన్మకొండలో జరిగిన ప్రెస్‍మీట్‍ లోనూ మంత్రి ఎర్రబెల్లి గ్రేటర్‍ ఎలక్షన్లకు ఇంకా  టైం పడుతుందని చెప్పారు.

For More News..

రాష్ట్రంలో 766 కిలోమీటర్ల కొత్త రోడ్లు

రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవడమే లక్ష్యం

ప్రతి నెలా వెయ్యెకరాల్లో టమాట వెయ్యాలె