ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తరలించేందుకు చేపట్టిన ‘ఆపరేషన్ గంగ’ కార్యక్రమంగా వేగంగా కొనసాగుతోంది. అత్యధిక సామర్ధ్యం కలిగిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ క్యారియర్ సీ-17 ద్వారా కేంద్ర ప్రభుత్వం మన పౌరులను స్వదేశానికి తరలిస్తోంది. ఇప్పటి వరకు నాలుగు సీ-17 వైమానిక విమానాల్లో 798 మంది ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీ సమీపంలోని హిండన్ ఎయిర్ బేస్ కు చేరుకున్నారు. పోలాండ్ లోని రెస్జో నుంచి ఎయిర్ బేస్ కి ఉదయం సీ-21 విమానం వచ్చింది. రోమేనియాలోని బుకారెస్టు నుంచి వచ్చిన ఫ్లైట్ లోని వారికి కేంద్రమంత్రి అజయ్ భట్ స్వాగతం పలికారు. స్వదేశానికి వచ్చిన భారతీయులతో కేంద్రమంత్రి అజయ్ భట్ మాట్లాడారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న ప్రతి ఒక్కరినీ సేఫ్ గా ఇండియాకు తీసుకొస్తామని చెప్పారు. కాగా, రొమేనియా పోలాండ్, హంగేరిల నుంచి మరో మూడు సీ17 ఎయిర్ క్రాఫ్ట్ లు ఇండియన్స్ ను తీసుకొచ్చేందుకు వెళ్లినట్లు ఎయిర్ ఫోర్స్ తెలిపింది.
First four IAF C-17 aircraft under #OperationGanga evacuated 798 Indian nationals using airfields in Romania, Hungary & Poland. They also supplied 9.7 tons relief material: Indian Air Force#RussiaUkraineConflict pic.twitter.com/IdkhirF9Ek
— ANI (@ANI) March 3, 2022
ఇండియాకు చేరుకున్న 6 వేల మంది
అలాగే ఉక్రెయిన్ లో చిక్కుకున్న వారితో ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ ఫ్లైట్ ముంబైకి చేరుకుంది. రోమేనియా లోని బుకారెస్ట్ నుంచి ఫ్లైట్ లో భారతీయులు స్వదేశానికి వచ్చారు. ముంబై ఎయిర్ పోర్టులో వారికి స్వాగతం చెప్పిన కేంద్రమంత్రి రావు సాహెబ్ దాన్వే.. ఎవరూ భయపడక్కర్లేదని, ఉక్రెయిన్ లో చిక్కుకున్న ఇండియన్స్ అందరినీ సేఫ్ గా ఇంటికి చేరుస్తామని చెప్పారు. ఎయిర్ పోర్టుల్లో భారతీయ రైల్వేలు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాయన్నారు. స్వస్థలానికి వెళ్లాలనుకున్న.. ఏ విద్యార్థైనా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు. బుడాపెస్ట్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానం వచ్చింది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో స్వదేశానికి వచ్చిన వారికి కేంద్రమంత్రులు ముక్తర్ అబ్బాస్ అలీ, వీరేంద్ర కుమార్ స్వాగతం పలికారు. ఇప్పటికే ఉక్రెయిన్ సరిహద్దులు దాటి 17 వేల మంది ఇండియన్స్ సురక్షిత ప్రాంతాలకు వచ్చారని, అందులో 6 వేల మందిని స్వదేశానికి తరలించామని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.