అతి చిన్న వయస్కుడిగా రికార్డు
ప్యారిస్ : ఫ్రాన్స్ నూతన ప్రధానిగా 34 ఏండ్ల గాబ్రియేల్ అట్టల్ను ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ నియమించారు. ‘‘గాబ్రియేల్ అట్టల్ను ప్రధాన మంత్రిగా నియమించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను అధ్యక్షుడు ఆయనకు అప్పగించారు”అని మెక్రాన్ కార్యాలయం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. కాగా, గే (స్వలింగ సంపర్కుడు) అయిన గాబ్రియేల్ అతి పిన్న వయస్కుడైన ప్రధానిగా రికార్డుకెక్కారు.
త్వరలోనే ఆయన అధికారికంగా ప్రధాని పదవిని చేపట్టనుండటంతో వీవీఐపీల నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల తెచ్చిన ఇమ్మిగ్రేషన్ చట్టంపై ఫ్రాన్స్ లో దుమారం రేగింది. ఈ చట్టం ప్రకారం ఫ్రాన్స్ లో ఉంటున్న విదేశీయులను వాపస్ పంపేందుకు ప్రభుత్వానికి మరిన్ని అధికారాలు లభిస్తాయి. దీనిపై రాజకీయంగా ఉద్రిక్తతలు నెలకొన్నందున ఇప్పటివరకు ప్రధానిగా ఉన్న ఎలిజబెత్ బోర్న్ సోమవారం రాజీనామా చేశారు.
ఆ రాజీనామాను ఆమోదించిన వెంటనే మెక్రాన్.. కొత్త ప్రధానిగా అట్టల్ పేరును ప్రకటించారు. అట్టల్ ఇప్పటివరకు మెక్రాన్ హయాంలో ప్రభుత్వ ప్రతినిధిగా, బడ్జెట్ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన అత్యంత జనాదరణ పొందిన లీడర్.. దీంతోపాటు అత్యంత పవర్ ఫుల్ పదవి చేపట్టనున్న తొలి గే కావడం విశేషం.