ఆప్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్.. 11 మంది పేర్లతో తొలి జాబితా

ఆప్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్.. 11 మంది పేర్లతో తొలి జాబితా

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది (2025) దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీ గడువు 2025, ఫిబ్రవరి 15తో ముగియనుంది. దీంతో ఆలోపే ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఎన్నికలకు మరో మూడు నెలల సమయం ఉండగానే అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటి నుండే ఎన్నికల కసరత్తు స్టార్ట్ చేసింది. ఢిల్లీలో హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా ఆప్ పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో బరిలోకి దింపే అభ్యర్థుల ఎంపికపై ఆప్ ఫోకస్ పెట్టింది. 

ఇందులో భాగంగా 2024, నవంబర్ 21వ తేదీన పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం అయ్యింది. ఈ భేటీలో అభ్యర్థుల ఎంపికపై సుధీర్ఘంగా చర్చించి తొలి విడతలో 11 అసెంబ్లీ స్థానాలకు పీఏసీ అభ్యర్థులను ఖరారు చేసింది. పీఏసీ సమావేశం ముగిసిన అనంతరం 11 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన తొలి జాబితాను ఆప్ విడుదల చేసింది. కిరారీ నుంచి అనిల్ ఝా, సీమాపురి నుంచి వీర్ సింగ్ ధింగన్‌లను ఆప్ బరిలోకి దింపింది. 

ఛతర్‌పూర్ నుంచి బ్రహ్మ సింగ్ తన్వర్, విశ్వాస్ నగర్ నుంచి దీపక్ సింగ్లా, రోహతాస్ నగర్ నుంచి సరితా సింగ్, లక్ష్మీ నగర్ నుంచి బీబీ త్యాగి, బదర్‌పూర్ నుంచి రామ్ సింగ్ నేతాజీ, సీలంపూర్ నుంచి జుబేర్ చౌదరి, ఘోండా నుంచి గౌరవ్ శర్మను పోటీలో నిలిపింది. ఆప్ 11 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేయగా.. అందులో ఆరుగురు కొత్త అభ్యర్థులే ఉండటం గమనార్హం. ఇతర పార్టీల నుండి ఆప్‎లో చేరిన నేతలకు ఫస్ట్ లిస్ట్‎లో ప్రియారిటీ దక్కింది. ఇటీవల బీజేపీ నుండి వచ్చిన ముగ్గురికి, కాంగ్రెస్ నుంచి ఆప్‎లో చేరిన ముగ్గురికి తొలి జాబితాలో ఎమ్మెల్యే టికెట్ దక్కింది. 

ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఢిల్లీ అసెంబ్లీకి చివరగా 2020 ఫిబ్రవరిలో ఎలక్షన్స్ జరిగాయి. ప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీ పదవి కాలం 2025 ఫిబ్రవరి 15తో ముగియనుంది. దీంతో ఆలోపే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. గత ఎన్నికల్లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో కేజ్రీవాల్ రెండో సారి ఢిల్లీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ ప్రభుత్వంపై ఆరోపణలు, సీఎం కేజ్రీవాల్ జైలుకు వెళ్లడం వంటి పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారాయి. పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ సీఎం పదవి రాజీనామా చేశారు. దీంతో ఆప్ సీనియర్ నేత అతిశీ తదుపరి ఢిల్లీ సీఎంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలో బీజేపీ వర్సెస్ ఆప్‎గా రాజకీయ పోరు నెలకొంది. ఈ క్రమంలోనే బీజేపీని మరోసారి చిత్తు చేసి ముచ్చటగా మూడోసారి రాజధానిలో జెండా ఎగరేయాలని ఆప్ ఎన్నికల కసరత్తు మొదలుపెట్టింది.