- కొత్తగా పార్టీలో చేరిన వినయ్‌రెడ్డి, సునీల్రెడ్డిలకి గ్రీన్‌సిగ్నల్
- కామారెడ్డి నుంచి షబ్బీర్‌అలీ పేరు లేకుండా జాబితా
- అర్బన్, రూరల్, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడపై ఇంకా కసరత్తు
- లీడర్ల మధ్య సయోధ్య కుదుర్చేందుకు ప్రయత్నాలు
నిజామాబాద్, కామారెడ్డి, వెలుగు: కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితాలో ఉమ్మడి జిల్లాలో ముగ్గురికి చోటు లభించింది. బోధన్నుంచి సీనియర్ నేత సుదర్శన్‌రెడ్డి పేరును ఖరారు చేసిన అధిష్టానం, కొత్తగా పార్టీలో చేరిన పొద్దుటూరి వినయ్‌రెడ్డికి ఆర్మూర్, ముత్యాల సునీల్‌రెడ్డికి బాల్కొండ టికెట్లు ఇచ్చింది. ఫస్ట్ లిస్ట్‌లో కామారెడ్డి నుంచి షబ్బీర్‌అలీ పేరు తప్పక ఉంటుందని అందరూ అంచనా వేశారు. కానీ కామారెడ్డి తో పాటు ఈ జిల్లాలోని ఇతర మూడు సెగ్మెంట్ల అభ్యర్థులను అధిష్టానం వెల్లడించలేదు.
ఆచీతూచీ నిర్ణయాలు..
అసెంబ్లీ ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకున్న కాంగ్రెస్గెలుపు గుర్రాలను బరిలోకి దింపడానికి ప్రయార్టీ ఇస్తోంది. బాల్కొండ సెగ్మెంట్‌నుంచి పోటీ చేయడానికి ఆరెంజ్ట్రావెల్స్అధినేత ముత్యాల సునీల్‌రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్‌రెడ్డి, కిసాన్కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ అన్వేశ్‌రెడ్డి, క్యాతం గంగారెడ్డి, బాస వేణుగోపాల్ యాదవ్, మహిళా నేత ప్రేమ్‌లత అగర్వాల్ తో కలిపి మొత్తం ఆరుగురు టికెట్‌కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు.
వీరిలో ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ముత్యాల సునీల్‌రెడ్డిని పార్టీ డిసైడ్ చేసింది. 2018 ఎన్నికల్లో మంత్రి ప్రశాంత్‌రెడ్డితో తలపడి సెకెండ్ ప్లేస్‌లో నిలిచిన ఆయనే సరైన క్యాండిడేట్‌గా పార్టీ నిర్ణయించింది. ఆర్మూర్ నుంచి మంత్రి ప్రశాంత్‌రెడ్డి సోదరి వేముల రాధికారెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏబీ శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మార చంద్రమోహన్, గోర్త రాజేందర్, యాల్ల సాయిరెడ్డి, కోట వెంకటేశ్, అశోక్‌గౌడ్, మహిపాల్‌రెడ్డి, తలారి పోచన్న, పొద్దుటూరి వినయ్‌రెడ్డి సహా పది మంది రేసులో ఉండగా అందరూ ఊహించినట్లుగానే వినయ్‌రెడ్డి అభ్యర్థిత్వానికి హైకమాండ్ మొగ్గు చూపింది. ఈయన కూడా ఈ మధ్యనే కాంగ్రెస్‌లో చేరారు. జిల్లాలో సీనియర్‌నేత సుదర్శన్‌రెడ్డికి బోధన్ టికెట్కన్ఫర్మ్ కాగా, పోటీ ఆశతో ఉన్న కెప్టెన్ కరుణాకర్‌రెడ్డికి ఛాన్స్ దక్కలేదు.
షబ్బీర్ పేరు లేని లిస్ట్..
కాంగ్రెస్ ప్రకటించే ఫస్ట్‌లిస్ట్‌లో బోధన్‌కు చెందిన సుదర్శన్‌రెడ్డితో పాటు కామారెడ్డి నుంచి షబ్బీర్‌అలీ పేరు తప్పక ఉంటుందని అంతా భావించారు. అయితే షబ్బీర్‌అలీ లేని జాబితా విడుదల కావడం చర్చనీయాంశమైంది. కామారెడ్డి జిల్లాలోని ఇతర మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై ఇంకా కసరత్తు నడుస్తోంది. బాన్సువాడ నుంచి అత్యధికంగా16 మంది టికెట్ డిమాండ్ చేస్తుండగా ఉత్కంఠ కొససాగుతోంది. పార్టీ స్ర్కీనింగ్కమిటీ సామాజికవర్గాల సమీకరణ ఇతర అంశాల ప్రతిపాదికన ముగ్గురి పేర్లను అధిష్టానవర్గానికి పంపింది. ఎల్లారెడ్డిలో సుభాష్‌రెడ్డి, మదన్మోహన్రావు, జుక్కల్ నుంచి సౌదాగర్ గంగారాం, గడుగు గంగాధర్, లక్ష్మీకాంత్‌రావు మధ్య పోటీ నడుస్తోంది. సయోధ్య ప్రయత్నాలు కొలిక్కిరాలేదు.
మరో రెండు సెగ్మెంట్లపై కూడా..
అర్బన్ నియోజకవర్గంలో బీసీ వర్గానికి చెందిన మాజీ మేయర్ సంజయ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్మహేశ్గౌడ్ పేర్లను పార్టీ పరిశీలిస్తున్న క్రమంలో మైనార్టీ లీడర్ తాహెర్ పేరు తెరపైకి వచ్చింది. ఈ ముగ్గురిలో సమర్థుల ఎంపిక కొలిక్కి రాకపోవడంతో పెండింగ్‌లో పెట్టారు. రూరల్ నుంచి మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ భూపతిరెడ్డి, మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్ నగేశ్రెడ్డిలో ఒకరిని ఫైనల్ చేసే ఆలోచన చేస్తుండగా, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ కీలక నేత పేరు కొత్తగా పరిశీలనలోకి వచ్చింది. ఖమ్మం జిల్లా నుంచి ఇందుకు సంబంధించిన వ్యవహారాలు నడుస్తున్నాయి.