- నేటి నుంచి రథయాత్ర
ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల దుష్టవైఖరి, కుటీల రాజకీయాలు, మోసపూరిత హామీలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ అన్నారు. 93% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీల తరఫున.. అగ్రకుల పార్టీలకు వ్యతిరేకంగా ఎన్నికల యుద్ధంలో తమ పార్టీ నిలవనుందని ఆయన పేర్కొన్నారు. సోమవారం బర్కత్ పురాలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తొలి విడత 53 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను విశారదన్ మహరాజ్ ప్రకటించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆ మూడు పార్టీలు వేల కోట్ల రూపాయలు మద్యం, శుష్క వాగ్దానాలతో బయలుదేరాయని, కానీ ధర్మసమాజ్ పార్టీ రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కు నమ్ముకొని ముందడుగు వేస్తున్నదని తెలిపారు. అగ్రకుల ఆధిపత్యంలో తెలంగాణలో వేల, వందల ఎకరాలు కలిగిన భూస్వాములు వందల సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్న ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి ఈ పార్టీలు కొనసాగుతున్నాయే తప్ప అణగారిన వర్గాల కోసం కాదని ఆయన ఆరోపించారు.
ధర్మసమాజ్ పార్టీ అడుగుతున్న ఆరు గ్యారంటీలను ఇస్తే ఎన్నికల నుంచి తప్పుకుంటామని సవాల్ చేశారు. ఆ పార్టీలు బడుగు బలహీన వర్గాలను విస్మరిస్తున్నందునే ఆ వర్గాల యువతకే ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామన్నారు. ఈ సమావేశంలో ధర్మ సమాజ్ పార్టీ ప్రతినిధులు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.