ఢిల్లీ బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్.. కేజ్రీవాల్‎పై పోటీ చేసేదేవరంటే..?

ఢిల్లీ బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్.. కేజ్రీవాల్‎పై పోటీ చేసేదేవరంటే..?

న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 29 మందితో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసిన కాషాయ పార్టీ.. కీలక నేతలకు తొలి జాబితాలో టికెట్లు కన్ఫామ్ చేసింది. ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ పోటీ చేసే న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుండి సీనియర్ నేత, మాజీ ఎంపీ పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మను బీజేపీ బరిలోకి దించింది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్‌ సింగ్ వర్మ కుమారుడే ఈ పర్వేష్ వర్మ.  2014 నుంచి 2024 వరకు పర్వేష్ సాహిబ్ సింగ్ ఎంపీగా పని చేశారు. 

మరోవైపు.. న్యూఢిల్లీ అసెంబ్లీ సీటు నుంచి కాంగ్రెస్ తరుఫున ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ బరిలోకి దిగుతోన్న విషయం తెలిసిందే. దీంతో న్యూఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్ ప్రత్యర్థులు ఎవరనేది తేలిపోయింది. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల కుమారులతో కేజ్రీవాల్ అమీతుమీ తేల్చుకోనున్నారు. ఇద్దరు మాజీ సీఎంల కుమారులు కేజ్రీవాల్‎ను ఓడించేందుకు బరిలోకి దిగడంతో న్యూఢిల్లీ అసెంబ్లీ సీటుత్రిముఖ పోరు ఢిల్లీ  పాలిటిక్స్‎లో కాక రేపడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే ఢిల్లీ సీఎం అతిశీ పోటీ చేయనున్న కల్కాజీ స్థానం నుండి మాజీ ఎంపీ రమేష్ బిధూరిని కాషాయ పార్టీ పోటీలో నిలబెట్టింది.

ALSO READ | మణిపూర్లో మళ్లీ మంటలు.. అడుగడుగున పోలీసులు.. టెన్షన్ టెన్షన్

ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ్ మాలవీయ నగర్ టికెట్ దక్కించుకున్నారు. కరోల్ బాగ్ నుంచి దుష్యంత్ కుమార్ గౌతమ్, జనక్‌పురి నుంచి ఆశిష్ సూద్, గాంధీ నగర్ నుంచి అరవిందర్ సింగ్ లవ్లీ బరిలోకి దిగనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ విధానాల నచ్చక ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన మాజీ మంత్రి కైలాష్ గహ్లోట్‎కు కమలం పార్టీ ఫస్ట్ లిస్ట్‎లోనే టికెట్ ఫిక్స్ చేసింది. కైలాష్ గహ్లోట్ బిజ్వాసన్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయనున్నారు. 

అలాగే సీఎం అతిశీ పోటీ చేయనున్న కల్కాజీ స్థానానికి కూడా కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ఖరారు చేశాయి. కాంగ్రెస్ నుండి సీనియర్ లీడర్ అల్కా లంబా బరిలో నిలువగా.. బీజేపీ నుండి రమేష్ బిధూరి పోటీలో ఉన్నారు. వచ్చే ఢిల్లీ ఎన్నికల్లో రెండు హాట్ సీట్లు అయిన న్యూఢిల్లీ, కల్కాజీ స్థానాలకు మూడు పార్టీల అభ్యర్థులు ఎవరనేది తెలిపోయింది. ఇక, ఈ స్థానాల్లో ఎవరు విజయం సాధిస్తారనేది మాత్రమే మిగిలి ఉంది. 

ఈ నెల చివర లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నెల 7 లేదా 8వ తేదీన ఈసీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు తెలిసింది. దేశ రాజధానిలో అధికారం కోసం బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా.. హ్యాట్రిక్ విజయం కోసం ఆప్ ప్రణాళికలు రచిస్తోంది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల రేసులో ముందంజలో ఉండగా.. జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ గెలుపు గుర్రాల వేటలో నిమగ్నమైపోయాయి.