50 ఏండ్ల తర్వాత లోక్ సభ స్పీకర్ ఎలక్షన్​

 50 ఏండ్ల తర్వాత లోక్ సభ స్పీకర్ ఎలక్షన్​
  • ఎన్డీయే నుంచి ఓం బిర్లా నామినేషన్
  • ఇండియా కూటమి తరఫున బరిలో కేరళ ఎంపీ సురేశ్
  • ఇయ్యాల 11 గంటలకు సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్
  • డిప్యూటీ స్పీకర్ పదవి కోసం పట్టుబట్టిన ప్రతిపక్షాలు
  • ససేమిరా అన్న ఎన్డీయే కూటమి పార్టీలు

న్యూఢిల్లీ: యాభై ఏండ్ల తర్వాత లోక్​సభ స్పీకర్ పదవి కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్డీయే కూటమి తరఫున రాజస్థాన్ లోని కోటా లోక్​సభ సెగ్మెంట్ నుంచి గెలిచిన ఓం బిర్లా బరిలో ఉన్నారు. ఇండియా కూటమి తరఫున కేరళలోని మవేలికర నియోజకవర్గం నుంచి విజయం సాధించిన కొడిక్కున్నిల్ సురేశ్ పోటీ చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం ఓం బిర్లాకు మద్దతుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, టీడీపీ, జేడీయూ, జేడీఎస్​తో పాటు ఎల్జేపీ (ఆర్) ఎంపీలు కలిసి మొత్తం పది సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇక, ఇండియా కూటమి తరఫున బరిలో ఉన్న సురేశ్ తరఫున మూడు సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. బుధవారం ఉదయం 11 గంటలకు సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ నిర్వహిస్తారు. పోలైన ఓట్లలో సగానికి పైగా ఓట్లు వచ్చిన అభ్యర్థి స్పీకర్‌‌‌‌‌‌‌‌గా ఎన్నికవుతారు. కాగా, స్పీకర్ పదవిని ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నించినా.. అపోజిషన్ పార్టీలతో ఏకాభిప్రాయం కుదరలేదు. డిప్యూటీ స్పీకర్‌‌‌‌‌‌‌‌ పదవి దక్కకపోవడంతో స్పీకర్ పోస్టు కోసం ఇండియా కూటమి అభ్యర్థిని బరిలోకి దించింది. స్వాతంత్ర్యం వచ్చాక ఇప్పటి వరకు రెండు సార్లు స్పీకర్ పోస్టు కోసం ఎన్నికలు నిర్వహించారు. మొదటి సారి 1952లో.. ఆ తర్వాత చివరి సారిగా 1972లో స్పీకర్​ను బ్యాలెట్ ఓట్ల ద్వారా ఎన్నుకున్నారు.

డిప్యూటీ స్పీకర్ కోసం పట్టుబట్టిన ప్రతిపక్షం

18వ లోక్​సభ స్పీకర్​గా ఓం బిర్లాను ఎన్డీయే ప్రభుత్వం ఎన్నుకున్నది. డిప్యూటీ స్పీకర్ పదవి కోసం ఇండియా కూటమి నేతలు పట్టుబట్టారు. వాస్తవానికి స్పీకర్​ పదవి అధికార పక్షం, డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షం చేపట్టడం ఆనవాయితీగా వస్తున్నది. గత హయాంలో డిప్యూటీ స్పీకర్‌‌‌‌‌‌‌‌ లేకుండానే సభలు నడిచాయి. అయితే, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పార్లమెంట్​లో తమ బలాన్ని పెంచుకున్న ప్రతిపక్షాలు.. ఈసారి డిప్యూటీ పదవికి పట్టుబట్టాయి. ఎన్డీయే కూటమి ఒప్పుకోకపోవడంతో దశాబ్దాలుగా కొనసాగుతోన్న సంప్రదాయానికి తెరపడింది.

కూటమి నేతలతో రాజ్​నాథ్ చర్చలు విఫలం

డిప్యూటీ స్పీకర్ పదవి కోసం ఇండియా కూటమి పట్టుబడుతుండటంతో చర్చల కోసం కోసం మోదీ సర్కార్ రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజును రంగంలోకి దించింది. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని కాంగ్రెస్ చీఫ్ ఖర్గేను ఫోన్​లో కోరారు. సమాజ్​వాదీ పార్టీ నుంచి అఖిలేశ్ యాదవ్, డీఎంకే నేత ఎంకే స్టాలిన్, టీఎంసీ సుప్రీం మమతా బెనర్జీతోనూ మాట్లాడారు. ఇందుకు ప్రతిపక్షాలు అంగీకరించినప్పటికీ.. డిప్యూటీ స్పీకర్ పదవి తమకే ఇవ్వాలని తేల్చి చెప్పాయి. ఎన్డీయే కూటమి నుంచి మళ్లీ ఎవరూ వారిని సంప్రదించలేదు. మధ్యాహ్నం 12 వరకే నామినేషన్ వేసేందుకు గడువు ఉండటంతో ఇండియా కూటమి తరఫున సురేశ్​ను బరిలోకి దించారు. సాయంత్రం 6 గంటలతో నామినేషన్ల ఉప సంహరణ గడువు ముగిసింది. దీంతో ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య స్పీకర్ పోస్టు కోసం బుధవారం 11 గంటలకు ఎన్నిక జరగనున్నది.

ఇప్పటి వరకు రెండు సార్లు ఎన్నిక

1952లో తొలి సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్‌‌‌‌‌‌‌‌సభ, రాజ్యసభలు ఏర్పాటయ్యాయి. అదే ఏడాది స్పీకర్‌‌‌‌‌‌‌‌ పోస్టుకు ఎన్నిక జరిగింది. అందులో శంకర్‌‌‌‌‌‌‌‌ శాంతారామ్‌‌‌‌‌‌‌‌పై నెహ్రూ బలపర్చిన జీవీ మౌలాంకర్‌‌‌‌‌‌‌‌ విజయం సాధించారు. మౌలాంకర్‌‌‌‌‌‌‌‌కు 394 ఓట్లు రాగా.. శాంతారామ్‌‌‌‌‌‌‌‌కు 55 ఓట్లు దక్కాయి. 1976లో బలిరామ్‌‌‌‌‌‌‌‌ భగత్, జగన్నాథ్‌‌‌‌‌‌‌‌ రావు జోషి (జన్​సంఘ్) పోటీ పడగా.. 344 ఓట్లతో భగత్‌‌‌‌‌‌‌‌ (కాంగ్రెస్) విజయం సాధించారు. ఆ తర్వాత నుంచి లోక్‌‌‌‌‌‌‌‌సభ స్పీకర్‌‌‌‌‌‌‌‌ను ఏకగ్రీవంగానే ఎన్నుకుంటున్నారు. ఎంఎ.అయ్యంగార్, జీఎస్ ధిల్లాన్, బలరాం జాఖడ్, జీఎంసీ బాలయోగి వరసగా రెండుమార్లు స్పీకర్​గా సేవలు అందించారు.

నేడు సీక్రెట్ బ్యాలెట్​తో ఓటింగ్

బుధవారం ఉదయం 11 గంటలకు సీక్రెట్ బ్యాలెట్​తో ఓటింగ్ నిర్వహిస్తారు. సాధారణ మెజార్టీతోనే స్పీకర్‌‌‌‌‌‌‌‌ను ఎన్నుకుంటారు. పోలైన మొత్తం ఓట్లలో ఏ అభ్యర్థి సగానికి పైగా ఓట్లు పొందుతారో ఆయనే స్పీకర్‌‌‌‌‌‌‌‌గా ఎన్నికవుతారు. లోక్‌‌‌‌‌‌‌‌సభ సభ్యుడిగా ఎన్నికైన ఎవరైనా స్పీకర్ పోస్టుకు పోటీ చేయొచ్చు. ప్రత్యేక అర్హతలు కూడా అవసరం లేదు. కాగా, 2014, 2019 లోక్​సభ ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వాన్ని బీజేపీ కొనసాగించింది. కానీ.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం మ్యాజిక్ ఫిగర్​కు 32 సీట్లు తక్కువ వచ్చాయి. అటు ప్రతిపక్షాలు భారీగా పుంజుకున్నాయి. ప్రాంతీయ పార్టీల సహకారంతో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రస్తుతం ఎన్డీయేకు 293 మంది సభ్యులు, ఇండియా కూటమికి 234 మంది ఎంపీలున్నారు.

ఎన్డీయే నుంచి ఓం బిర్లా

ఓం బిర్లా 1962లో శ్రీకృష్ణ బిర్లా, శకుంతలాదేవి దంపతులకు జన్మించారు. రాజస్థాన్​లోని కోటా, అజ్మీర్ విద్యనభ్యసించారు. రామ మందిర నిర్మాణ ఉద్యమ సమయంలో జైలు శిక్ష అనుభవించారు. ఆ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 1991 నుంచి 2003 వరకు బీజేవైఎం నేతగా ఉన్నారు. తర్వాత 2003లో కోటా సౌత్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2013లో మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో ఫస్ట్​ టైమ్ కోటా నుంచి ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల్లో అక్కడి నుంచే మరోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. స్పీకర్​గా సేవలందిం చారు. 2024 లోక్​సభ ఎన్నికల్లోనూ కోటా నుంచి 41 వేల ఓట్లతో విజయం సాధించారు.

ప్రతిపక్షం నుంచి సురేశ్

కేరళ తిరువనంతపురం జిల్లా కోడికున్నిల్‌‌‌‌‌‌‌‌లో కుంజన్, థంకమ్మ దంపతులకు 1962లో సురేశ్ జన్మించారు. ఎల్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌బీ పూర్తి చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1989లో మొదటిసారి అదూర్‌‌‌‌‌‌‌‌ లోక్‌‌‌‌‌‌‌‌సభ స్థానం నుంచి గెలిచారు. ఆ తర్వాత మూడు పర్యాయాలు ఇక్కడి నుంచి, తర్వాత మవేలికర సెగ్మెంట్ నుంచి 2009, 2014, 2019 ఎన్నికల్లో గెలిచారు. ఇటీవలి ఎన్నికల్లో సైతం మావేలికర నుంచే గెలుపొందారు. ఎంపీ సురేశ్.. కేరళ పీసీసీ సభ్యుడిగా, ఏఐసీసీ మెంబర్​గా, పీసీపీ వర్కింగ్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌గా పదవులు చేపట్టారు. మొత్తం 8 సార్లు ఎంపీగా గెలిచారు.