- నేడు సౌతాఫ్రికాతో టీమిండియా తొలి వన్డే
- మ. 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో
జొహన్నెస్‌బర్గ్ : సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌ను పంచుకున్న టీమిండియా ఇప్పుడు వన్డే సవాల్‌కు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగే తొలి పోరులో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. కెరీర్ చివర్లో ఉన్న సీనియర్ల ప్లేస్‌ల్లో జట్టులో తమ స్థానాలను బలోపేతం చేసుకునేందుకు కుర్రాళ్లు పోటీ పడుతున్నారు.
2025 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి బలమైన టీమ్‌ను తయారు చేసుకునేందుకు ఈ సిరీస్‌తోనే శ్రీకారం చుట్టాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. వన్డే వరల్డ్ కప్ తర్వాత రెస్ట్ తీసుకున్న కెప్టెన్ రోహిత్, కోహ్లీ ఈ సిరీస్‌కు దూరంగా ఉండి టెస్టులకు సిద్ధం అవుతున్నారు. దాంతో ఈ సిరీస్‌లో కీపర్ కేఎల్ రాహుల్ టీమ్‌ను నడిపిస్తున్నాడు. గతంలోనూ రాహుల్ కెప్టెన్సీ చేపట్టినప్పటికీ సఫారీలను వారి సొంతగడ్డపై ఓడిస్తే భవిష్యత్ కెప్టెన్‌గా అతనికి మంచి మార్కులు పడతాయి.
రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ ఈ సిరీస్‌లో సత్తా చాటాల్సిన అవసరం ఉంది. టీ20ల్లో అదరగొడుతున్న రింకూ సింగ్ ఈ మ్యాచ్‌తో వన్డే అరంగేట్రం చేయనున్నాడు. డొమెస్టిక్ క్రికెట్‌లో దంచికొడుతున్న సాయి సుదర్శన్, రజత్ పటీదార్ కూడా అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నారు. టీ20 సిరీస్‌లో ఆకట్టుకోలేకపోయిన తిలక్ వర్మకు ఈ సిరీస్ కీలకం కానుంది.
సఫారీ టీమ్‌లో స్టార్ పేసర్లు కగిసో రబాడ, అన్రిచ్ నార్జ్ లేకపోవడంతో మేనేజ్‌మెంట్ ఎక్కువ మంది కుర్రాళ్లను పరీక్షించే అవకాశం ఉంది. ఇక, బుమ్రా, సిరాజ్, షమీ గైర్షాజరీలో అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్ పేస్ విభాగాన్ని ఎలా నడిపిస్తారన్నది ఆసక్తికరం. మూడో టీ20 సెకండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ స్పిన్‌కు సహకరించిన నేపథ్యంలో ఈ మ్యాచ్‌లోనూ స్పిన్నర్లు కీలకం కానున్నారు. ఇండియా మాదిరిగా సౌతాఫ్రికా కూడా పలువురు సీనియర్లు, స్టార్లు లేకుండానే బరిలోకి దిగుతోంది. బవూమ గైర్హాజరీలో మార్‌క్రమ్ టీమ్‌ను నడిపిస్తున్నాడు.
వన్డేలకు చహర్.. టెస్టులకు షమీ దూరం
ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ దీపక్ చహర్ వన్డే టీమ్ నుంచి విత్‌డ్రా అయ్యాడు. అతని స్థానంలో యంగ్ పేసర్ ఆకాశ్ దీప్‌ను సెలక్టర్లు జట్టులోకి తీసుకున్నారు. మరోవైపు మహ్మద్ షమీ రెండు టెస్టుల సిరీస్‌కు దూరం అయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో తను సౌతాఫ్రికా టూర్ నుంచి వైదొలిగాడు.