కాశ్మీర్‍లో 59శాతం పోలింగ్ : 24 నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తి

కాశ్మీర్‍లో 59శాతం పోలింగ్ :  24 నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తి

శ్రీనగర్/జమ్మూ: జమ్మూకాశ్మీర్ లో అసెంబ్లీ మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 24 నియోజకవర్గాలకు బుధవారం ఎన్నికలు జరగ్గా, 59 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించగా, ఓటు వేసేందుకు ఓటర్లు బారులుతీరారు. ఒక్క పుల్వామా జిల్లా మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ 50 శాతానికి పైగానే పోలింగ్ నమోదైంది. 

జమ్మూ రీజియన్ లో అత్యధికంగా ఇందర్వాల్ సెగ్మెంట్​లో 80.6 శాతం, పాడర్ నాగ్ సేనిలో 76.80, కిష్త్వార్ లో 75.04, దోడా వెస్ట్ లో 74.14 శాతం పోలింగ్ రికార్డయింది. కాశ్మీర్ లోయలో అత్యధికంగా పహల్గాం సెగ్మెంట్​లో 67.86 శాతం, డీహెచ్ పొరాలో 65.21, కుల్గాంలో 59.58, కోకర్నాగ్ లో 58 శాతం పోలింగ్ నమోదైంది. పుల్వామా జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో పోలింగ్ 50 శాతం కూడా దాటలేదు. కాగా, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఉదయం ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు.  

219 మంది అభ్యర్థులు.. 

మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని అధికారులు తెలిపారు. అక్కడక్కడ పార్టీల కార్యకర్తల మధ్య గొడవలు మినహా, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని చెప్పారు. బిజ్బెహరా, డీహెచ్ పొరా ఏరియాల్లో కార్యకర్తల మధ్య గొడవలు జరిగాయని పేర్కొన్నారు. కాగా, 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకాశ్మీర్ లో జరుగుతున్న మొదటి ఎన్నికలివి. ఇక్కడ మొత్తం 90 అసెంబ్లీ సీట్లు ఉండగా, తొలి విడతలో 24 నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించారు. ఇందులో జమ్మూ రీజియన్ లో 8 ఉండగా, కాశ్మీర్ లోయలో 16 సెగ్మెంట్లు ఉన్నాయి. మొత్తం 219 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 90 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు.