వన్ నేషన్ వన్ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్ కేంద్ర కేబినెట్ ఆమోదం

వన్ నేషన్ వన్ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్ కేంద్ర కేబినెట్ ఆమోదం

భారత  ప్రభుత్వం  వన్ నేషన్  వన్ సబ్‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్ (ఓఎన్ఓఎస్) పథకాన్ని  సోమవారం నాడు ఆమోదించింది. గత ఐదు సంవత్సరాలుగా భారత ఉన్నత విద్యలో వినపడుతున్న ఈ పథకాన్ని ఒకసారి సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.  ఈ పథకం దేశవ్యాప్తంగా  శాస్త్రీయ పరిశోధన వ్యాసాలు,  జర్నల్ ఆర్టికల్స్,  ప్రచురణలకు యాక్సెస్  అందించడానికి అనుమతిస్తుంది.  దీనివల్ల ఉన్నత విద్యావేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు, అధ్యాపకులు, శాస్త్రవేత్తలు  పూర్తి డిజిటల్ ప్రక్రియ ద్వారా సమాచారాన్ని పొందే అవకాశాన్ని కల్పిస్తారు.  

కేంద్ర  ప్రభుత్వ  ఉన్నత  విద్యా సంస్థలు, పరిశోధన,  అభివృద్ధి లేబొరేటరీల కోసం ఈ పథకం ద్వారా నాణ్యమైన సమాచారాన్ని అందించడం,  నూతన  పరిశోధనలకు, ఆవిష్కరణలకు గొప్ప అవకాశం కల్పించడమే  ప్రధాన లక్ష్యం.  ఇప్పటివరకు కొన్ని దేశాలు వేర్వేరు ప్రాంతాలు లేదా సంస్థల కోసం అంతర్జాతీయ జర్నల్స్‌‌‌‌‌‌‌‌ను అందించేందుకు కన్సార్టియంలు ఏర్పాటుచేశాయి. ఉదాహరణకు, బ్రిటన్‌‌‌‌‌‌‌‌లో ‘జేఐఎస్​సీ’,  జర్మనీలో ‘డీల్’ వంటి సంస్థలు ఉన్నాయి.  వన్ నేషన్  వన్ సబ్‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్ పథకం  దేశంలోని  ప్రభుత్వ, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ఉన్నత విద్యా సంస్థలు, పరిశోధన, అభివృద్ధి సంస్థలకు,  అంతర్జాతీయ శాస్త్రీయ జర్నల్స్‌‌‌‌‌‌‌‌కి యాక్సెస్​ను అందిస్తుంది.

ఈ పథకానికి 2025, 2026, 2027 సంవత్సరాలకు మొత్తం సుమారు రూ. 6,000 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.  వన్ నేషన్  వన్  సబ్‌‌‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్  పథకం  భారత ప్రభుత్వ మార్గదర్శకాలు,  విద్యా రంగంలో జరుగుతున్న  పలు  నూతన  విధానాలను  ప్రేరణగా  తీసుకుని  రూపొందించారు.  ఈ పథకం ఏఎన్ఆర్ఎఫ్​ ప్రారంభం ద్వారా, కేంద్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పరిశోధనా సంస్థలు, ఆర్ అండ్ డి  లేబొరేటరీలు, నాణ్యమైన  పరిశోధనలు, ఆవిష్కరణల సంస్కృతిని ప్రోత్సహించడానికి  ప్రేరణ ఇస్తాయి. ఈ  పథకం ద్వారా కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ఉన్నత విద్యాసంస్థలు,  పరిశోధన సంస్థలు లబ్ధి  పొందుతాయి.  ప్రస్తుతం దేశంలో 15కు పైగా అకడమిక్ కన్సార్టియంలు ఉన్నాయి.  ఈ పథకం ద్వారా,  ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ  నెట్‌‌‌‌‌‌‌‌వర్క్  ద్వారా సమన్వయించబడిన ఒకే జాతీయ సబ్‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్ ద్వారా 30 అంతర్జాతీయ ప్రచురణ సంస్థల సుమారు 13,000 జర్నల్స్‌‌‌‌‌‌‌‌కు సబ్‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్లు అందిస్తారు. ఈ పథకం 6,300కు  పైగా సంస్థలకు అందుబాటులో ఉంటుంది.   సుమారు 1.8 కోట్ల మంది విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు లబ్ధి పొందుతారు.

పరిశోధనలు, ఆవిష్కరణలకు ప్రోత్సాహం

ప్రస్తుతం ఈ పథకంలో ఎల్సివియర్,  స్ప్రింగర్,  నేచర్, వైలీ,  టేలర్ & ఫ్రాన్సిస్,  సేజ్,  ఆక్స్​ఫర్డ్​,కేంబ్రిడ్జ్  యూనివర్సిటీ  ప్రెస్,  బీఎంజే  జర్నల్స్ వంటి  ప్రముఖ ప్రచురణ సంస్థలు ఉన్నాయి. ఈ పథకం కింద 6,300 సంస్థలు 13,000 జర్నల్స్ ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తుంది.  30 అంతర్జాతీయ  ప్రచురణ సంస్థలకు కేంద్రం ద్వారా చెల్లింపులు చేస్తుంది. ఈ పథకంలో  భాగంగా కవర్ చేయని ప్రచురణ సంస్థలకు  సొంత బడ్జెట్‌‌‌‌‌‌‌‌లను ఉపయోగించి  సబ్‌‌‌‌‌‌‌‌స్క్రైబ్ చేయవచ్చు. ఈ పథకం భారతదేశంలోని అన్ని వర్గాల విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు,  శాస్త్రవేత్తలకు శాస్త్రీయ జర్నల్స్‌‌‌‌‌‌‌‌కు సమానంగా ప్రవేశాన్ని కల్పించి,  రెండు,  మూడు తరగతి నగరాలలో కూడా పరిశోధనలు, ఆవిష్కరణలకు  ప్రోత్సాహకాన్ని పెంచుతుంది.  ఉన్నత విద్య శాఖ  వన్ నేషన్  వన్ సబ్‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్  అనే  ఏకీకృత  పోర్టల్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేస్తుంది. ఈ  పోర్టల్  ద్వారా  ప్రామాణికమైన  జర్నల్స్,  జర్నల్ ఆర్టికల్స్, పరిశోధన వ్యాసాలను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.  వన్ నేషన్ వన్ సబ్‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్ పథకం విద్యా నాణ్యతపై  ప్రభావం చూపుతుంది.

పరిశోధన అభివృద్ధి:  వన్ నేషన్ వన్ సబ్‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్ పథకం నూతన పరిశోధనలకు,  ఆవిష్కరణలకు గట్టి పునాది వేసి,  సైన్స్​,  టెక్నాలజీ,  వైద్యం,  పర్యావరణం, ఇతర రంగాల్లో నూతన విజ్ఞానం పెరిగేలా ప్రోత్సహిస్తుంది. ఈ పథకం పరిశోధనను అభివృద్ధి చేసే దిశలో కీలకమైన పరిణామాలను తీసుకురానుంది.

సమాచారాన్ని అందిపుచ్చుకునే అవకాశం: ఈ పథకం.. రెండు తరగతి, మూడు తరగతి నగరాల్లో ఉన్న విద్యార్థులు, అధ్యాపకులకు కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత విద్యా సమాచారాన్ని సులభంగా అందించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది.  ఇది ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల నుంచి విద్య పొందే  విద్యార్థులకు  అధిక నాణ్యత  కలిగిన  సమాచారాన్ని తమ సొంత ప్రాంతంలోనే అందించే అవకాశం కల్పిస్తుంది. తద్వారా దిగువ తరగతుల మధ్య విద్యా వ్యత్యాసం తగ్గుతుంది.

పరిశోధన సంస్కృతిని ప్రోత్సహించడం:  వన్ నేషన్  వన్ సబ్‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్ పథకం భారతదేశంలో పరిశోధన సంస్కృతిని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పథకం వల్ల అనేక శాస్త్రీయ,  పరిశోధనలను ప్రోత్సహించి, భారతదేశంలో మౌలిక,  పలు రంగాల పరిశోధనలకు పెద్ద వేదికను అందిస్తుంది.  దీంతో  కొత్త ఆవిష్కరణలకు,  పరిశోధనా అవగాహనకు  బలమైన పునాది ఏర్పడుతుంది. 

సాధనల సమీకరణ: ఈ పథకంలో భాగంగా అన్ని ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థలు ఒకే వేదిక ద్వారా సమాచారాన్ని పుచ్చుకోవచ్చు. గతంలో వేర్వేరు సంస్థలు, మంత్రిత్వ శాఖలు వేర్వేరు సబ్‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్లు పొందినప్పుడు ఉన్న విభిన్న పరిస్థితుల కంటే,  ఓఎన్ఓఎస్​ పథకం సమన్వయాన్ని పెంచుతుంది. ఇది అన్ని సంస్థలకు ఒకే వేదికపై సమాచారాన్ని అందించేందుకు అనుకూలంగా ఉంటుంది. తద్వారా  నిర్వహణను సులభం చేస్తుంది. 

అంతర్జాతీయ స్థాయిలో పోటీ వృద్ధి:  వన్ నేషన్ వన్ సబ్‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్  పథకం భారతదేశంలో ఉన్నత విద్యను ప్రపంచస్థాయిలో మరింత గుర్తింపును పొందేందుకు సహాయపడుతుంది.  భారతదేశంలోని  విద్యార్థులు, పరిశోధకులు,  శాస్త్రవేత్తలు  అంతర్జాతీయ  పరిశోధనా కమ్యూనిటీలో  మరింతగా  అనుసంధానం అవుతారు.  ఈ పథకం దేశంలో పరిశోధన,  శాస్త్రవేత్తల స్థాయి పెరిగినప్పుడు, అంతర్జాతీయ స్థాయిలో పోటీని పెంచుతుంది.

విద్యా నాణ్యతలో అభివృద్ధి

ఓఎన్ఓఎస్​ పథకం  భారతదేశంలో  ఉన్నత  విద్యారంగంలో మరింత నాణ్యతను,  పురోగతిని,  సమగ్రతను  తీసుకురావడంలో కీలకమైన పాత్రను  పోషిస్తుంది.  ఈ పథకం ద్వారా,  ప్రభుత్వ విద్యా సంస్థలు,  పరిశోధనా సంస్థలు, శాస్త్రీయ సంఘాలు అందుబాటులో ఉన్న అత్యుత్తమమైన శాస్త్రీయ సమాచారంతో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు చేపడతారు.  దీనివల్ల  దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తుంది. భారత ప్రభుత్వ ‘ఆత్మ నిర్భర భారత్’  ‘వికసిత్​ భారత్@2047’ లక్ష్యాలను  సాధించడంలో  ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుంది.  కొత్త జాతీయ  విద్యా విధానం  2020,  ఎఎన్ఆర్ఎఫ్​ లక్ష్యాలతో ఈ పథకం అనుసంధానంగా పనిచేస్తుంది.  2025 జనవరి 1న  ఈ పథకం ప్రారంభం అవుతుంది.  వన్ నేషన్  వన్ సబ్‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్  పథకం భారతదేశంలోని విద్యా నాణ్యతను పెంచి, పరిశోధన అభివృద్ధికి ఎంతగానో  దోహదపడుతుంది.

- డా. రవి కుమార్ చేగొనీ,
ప్రధాన కార్యదర్శి, 
తెలంగాణ 
గ్రంథాలయ సంఘం