- నామినేషన్ల తర్వాత మిగతా నియోజకవర్గాల్లో పర్యటన
- రెబల్స్, పార్టీ ఫిరాయింపులకు చెక్ పెట్టేలా వ్యూహం
- ఉమ్మడి పాలమూరుపై పట్టు సాధించే ప్రయత్నాల్లో అపోజిషన్ పార్టీలు
మహబూబ్‌నగర్, వెలుగు: అసెంబ్లీ ఎలక్షన్ల నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాపై సీఎం కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. 14 అసెంబ్లీ స్థానాలు ఉన్న జిల్లాలో ప్రస్తుతం రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలే అన్ని చోట్ల ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇటీవల కొన్ని నియోజకవర్గాల్లో టికెట్ల కోసం సిట్టింగులు, సెకండ్ క్యాడర్ లీడర్ల మధ్య పంచాయితీలు నడుస్తున్నాయి. కొన్ని చోట్ల ఆశలు వదులుకున్న వారు పక్క పార్టీల్లో చేరారు. ఈ నేపథ్యంలో క్యాడర్గ్రూపులుగా వీడిపోతోంది. ఈ పరిస్థితిని చక్కబెట్టేందుకు సీఎం నియోజకవర్గాల పర్యటనకు వస్తున్నారు. ఫస్ట్ ఫేజ్‌లో ఆరు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. సెకండ్ ఫేజ్‌లో మిగతా నియోజకవర్గాలను చుట్టేసేలా ప్లాన్ చేస్తున్నారు.
అసమ్మతికి చెక్ పెట్టేందుకే..
సీఎం పర్యటన ఉమ్మడి జిల్లాలో ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఫస్ట్ ఫేజ్‌లో ఆరు నియోజకవర్గాలు ఉండగా, ఇందులో ఐదు చోట్ల పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఈ నియోజకవర్గాల్లో రానున్న ఎన్నికల్లో ఫైట్ టఫ్‌గా ఉంటుందని సర్వేలు, ఇంటెలిజెన్స్ రిపోర్టులు చెబుతున్నాయి. దీంతో కేసీఆరే స్వయంగా రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి గద్వాల సీటు కోసం జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడంతో పార్టీ మారారు.
ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కించుకునే పనిలో ఉన్నారు. కొల్లాపూర్ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు టికెట్ రాదనే ఉద్దేశంతో కాంగ్రెస్‌లో చేరారు. కల్వకుర్తి టికెట్ కోసం కసిరెడ్డి నారాయణరెడ్డి ఆశలు పెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో కాంగ్రెస్‌లో చేరారు. ఆయనతో పాటు జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్వెళ్లారు. మక్తల్‌లోనూ సిట్టింగుకు టికెట్ ఇవ్వొద్దని కొందరు డిమాండ్ చేశారు. హైకమాండ్ స్పందించకపోవడంతో బీకేఆర్ ఫౌండేషన్ అధినేత బాలకిష్టారెడ్డి, మక్తల్, మాగనూర్ మాజీ జడ్పీటీసీలు లక్ష్మారెడ్డి, విఠల్, మాజీ ఎంపీపీ గడ్డంపల్లి హన్మంతు, మాజీ వైస్ ఎంపీపీ సునీత గోపాల్‌రెడ్డి, మక్తల్ మాజీ సర్పంచ్ సూర్యనారాయణ గుప్తా, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్రవికుమార్, సంగంబండ సర్పంచ్ రాజు కాంగ్రెస్‌లో చేరారు.
ఇటీవల అచ్చంపేట, ఉప్పునుంతల మండలాలకు చెందిన జడ్పీటీసీలు, ఎంపీపీలు పార్టీ మారారు. నాగర్‌కర్నూల్, జడ్చర్ల నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పర్యటనల సందర్భంగా ప్రజలు తిరగబడుతున్నారు. ఇటీవల ఓ ఎమ్మెల్యే పర్యటనకు వెళ్లగా ప్రజలు ఆయనపై కోడిగుడ్లు విసిరినట్లు తెలిసింది. మరో నియోజకవర్గంలో ఇంకో ఎమ్మెల్యే పర్యటనకు వెళ్లగా.. మా గ్రామానికి ఏం చేశారు? ఇప్పుడు ఎందుకు వస్తున్నారు?
అని మూడు గ్రామాల్లో నిలదీయడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలంపూర్ నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన కొందరు లీడర్లు సిట్టింగ్‌కు సహకరించమని కొద్ది రోజుల కింద ప్రెస్మీట్లు పెట్టి ప్రకటించారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకున్న సీఎం సమస్యాత్మకంగా ఉన్న నియోజకవర్గాలపై తిరిగి పట్టు సాధించేందుకు సభలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ సభల ద్వారా క్యాండిడేట్లు, సెకండ్ కేడర్ లీడర్ల మధ్య ఉన్న విబేధాలను రూపుమాపి క్యాడర్లో కొత్త జోష్ నింపేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది.
పాలమూరుపైనే ప్రధాన పార్టీల ఫోకస్..
ఉమ్మడి పాలమూరుపై పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. ఇప్పటికే కాంగ్రెస్ లీడర్ రాహుల్‌గాంధీ ‘భారత్ జోడోయాత్ర’ పేరుతో ఉమ్మడి జిల్లాలో పర్యటించారు. ఆ పార్టీ సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క ‘పీపుల్స్‌మార్చ్’ యాత్ర ఇదే జిల్లా మీదుగా సాగింది. ఇటీవల ప్రధాని మోదీ పాలమూరులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని తెలంగాణకు పసుపు బోర్డు, సెంట్రల్ ట్రైబల్ యూనిర్సిటీని ప్రకటించారు.
ఈ తరుణంలో ప్రతిపక్షాలు పుంజుకోకుండా సీఎం కేసీఆర్ పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు. గత నెలలోనే పాలమూరు స్కీంను ప్రారంభించిన ఆయన తిరిగి ఇదే జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించేందుకు తేదీలను ఫిక్స్ చేశారు. ఈ నెల 18న జడ్చర్లలో, 26న అచ్చంపేట, నాగర్‌కర్నూల్, నవంబర్ 6న ఒకే రోజు గద్వాల, మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో సీఎం పాల్గొననున్నారు.
కొత్త హామీలు ఇస్తారనే చర్చ..
సీఎం పాలమూరులోని నియోజకవర్గాల పర్యటన సందర్భంగా ఎలాంటి హామీలు ఇస్తారనే దానిపై క్యాండిడేట్లు, ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల పాలమూరులో పర్యటించిన ప్రధాని మోదీ కీలక ప్రకటనలు చేశారు. కొడంగల్,- నారాయణపేట స్కీం, జీవో 69పై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.