కాగజ్ నగర్, వెలుగు: రాష్ట్రంలోనే తొలి నియోజకవర్గం సిర్పూర్ లోని కాగజ్ నగర్ మండలం మాలిని గ్రామ పంచాయతీలో 79 మంది ఓటర్ల కోసం తొలిసారి ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ రెఢీ అయ్యింది. గత ఎన్నికల వరకు మాలిని గ్రామ పంచాయితీలో ఒకే పోలింగ్ కేంద్రం ఉండేది. గ్రామ పంచాయతీ కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో పూర్తిగా గుట్టమీదున్న మానిక్ పటార్ గ్రామస్తులు ఎన్నికల సమయంలో 8 కి.మీ. నడచి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునే వారు.
ఆ గ్రామస్తుల పరిస్థితిని గుర్తించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హేమంత్ బోర్కడే, అడిషనల్ కలెక్టర్ సిర్పూర్ అసెంబ్లీ రిటర్నింగ్ ఆఫీసర్ దీపక్ తివారీ చొరవ తీసుకుని మానిక్పటార్లో పోలింగ్ బూత్ మంజూరు చేశారు. అక్కడి తడకల బడిలోనే పోలింగ్ కేంద్రం ఉండడంతో అక్కడ భవనం కట్టేందుకు చర్యలు తీసుకొని తక్కువ కాలంలో పనిపూర్తి చేశారు. మిగిలిన చిన్నచిన్న పనులు త్వరలోనే పూర్తిచేయనున్నట్లు అధికారులు తెలిపారు.