పెళ్లి చేస్తమన్నరు.. తర్వాత మోసం చేసిన్రు : నవీన్ రెడ్డి తల్లి

పెళ్లి చేస్తమన్నరు.. తర్వాత మోసం చేసిన్రు : నవీన్ రెడ్డి తల్లి

మన్నెగూడలో కిడ్నాప్ నకు గురైన యువతి వైశాలి, ఆమె కుటుంబసభ్యులపై ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి తల్లి నారాయణమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైశాలి కుటుంబం తన కొడుకుని పైసల కోసం వాడుకుందని ఆరోపించారు. నవీన్ వద్ద డబ్బులు తీసుకోవడంతో పాటు కారు కూడా కొనిపించుకున్నారని అన్నారు.  మీడియాతో మాట్లాడుతూ ఆమె సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో ఆమెను దగ్గరలోని హాస్పిటల్ కు తరలించారు.  

నవీన్ రెడ్డి, వైశాలి భార్యాభర్తల్లా మెలిగేవారని, వారిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు తన కొడుకు తనతో చెప్పాడని నారాయణమ్మ చెప్పారు. వైశాలి తల్లిదండ్రులు తొలుత నవీన్ తో పెళ్లి చేస్తామని చెప్పారని, ఆ తర్వాత మోసం చేశారని ఆరోపించారు. ఇద్దరి మధ్య రెండేళ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగుతోందని.. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఎందుకు మారిపోయిందో తెలయదని వాపోయారు. గతంలో వైశాలి పలుమార్లు తమ ఇంటికి వచ్చినట్లు నారాయణమ్మ చెప్పారు.

ఇక మన్నెగూడలోయువతి కిడ్నాప్ కేసులో ఆమె తండ్రి దామోదర్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. షటిల్ బ్యాడ్మింటన్ వద్ద తన కూతురుతో నవీన్ రెడ్డి పరిచయం పెంచుకున్నాడని, అప్పటి నుంచి ప్రేమ,పెళ్లి పేరుతో వేధిస్తున్నాడని అందులో పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం నవీన్ రెడ్డి, రూబెన్ అనే వ్యక్తితో పాటు మరో 50 మంది అనుచరులతో వోల్వో కార్ ts07hx 2111, బొలెరో కార్ ts 07u4141 తో పాటు మరి కొన్ని కార్లలో వచ్చి తమపై దాడికి పాల్పడి తన కూతురిని కిడ్నాప్ చేశాడని చెప్పారు. ఐరన్ రాడ్లు, రాళ్లతో ఇంటికి వచ్చిన నవీన్ రెడ్డి తలపై ఐరన్ రాడ్ తో దాడి చేశాడని దామోదర్ రెడ్డి ఫిర్యాదు చేశారు.