వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ వచ్చేస్తున్నాయ్.. ప్రత్యేకతలు ఇవే

వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ వచ్చేస్తున్నాయ్.. ప్రత్యేకతలు ఇవే

'వందే భారత్..' పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్లను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేసే దిశగా అడుగులు వేస్తోంది. 02 డిసెంబర్ 2024 నాటికి దేశవ్యాప్తంగా చైర్ కార్ కోచ్‌లతో కూడిన 136 వందే భారత్ రైళ్లు పట్టాలెక్కగా.. వేర్వేరు రాష్ట్రాల్లోని కీలక నగరాల మధ్య ఇవి పరుగులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రైల్వే శాఖ వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది. 

ALSO READ | టూల్స్​ & గాడ్జెట్స్ : జర్నీలో ఉపయోగపడే.. యూనివర్సల్​ మౌంట్​

త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లు పట్టాలు ఎక్కనున్నట్లు ప్రకటించిన రైల్వే శాఖ.. ఆ దిశగా వేగంగా చర్యలు చేపడుతోంది. వందే భారత్ స్లీపర్ ట్రైన్‌సెట్ మొదటి నమూనా విడుదల చేశారు. ఆధునిక ఫీచర్లు,  సౌకర్యాలతో కోచ్‌లు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. మొదట ఈ స్లీపర్ రైళ్లను సుదూర, మధ్య దూర ప్రయాణాలకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఫీల్డ్ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. ట్రయల్స్ విజయవంతంగా పూర్తయితే ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

వందే భారత్ స్లీపర్ ప్రత్యేకతలు, సౌకర్యాలు

వందే భారత్ స్లీపర్ రైలు బోగీల్లో ముఖ్యంగా చెప్పుకోవలసింది.. ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు. భద్రత కోణాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని స్లీపర్ బోగీల్లో యూరోపియన్ రైల్వే ప్రమాణాలను అందుబాటులోకి తెచ్చారు. రైలు బోగీలను EN-45545 HL3 అగ్నిమాపక భద్రత ప్రమాణాల ప్రకారం నిర్మించారు.

  • వందే భారత్ స్లీపర్ ట్రైన్‌సెట్ కవచ్ సిస్టమ్‌ అమర్చబడింది. 
  • అన్ని కోచ్‌లలో సీసీటీవీ నిఘా కెమెరాలు.
  • కుదుపులు లేకుండా ప్రయాణం సాఫీగా సాగేలా క్రాష్‌వర్తీ, జెర్క్-ఫ్రీ సెమీ పర్మనెంట్ కప్లర్లు, యాంటీ క్లైంబర్లు అమర్చారు.
  • EN ప్రమాణాలకు అనుగుణంగా కార్ బాడీని రూపొందించారు.
  • శక్తి సామర్థ్యం కోసం రీ జెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్. 
  • లేటెస్ట్ బ్రేకింగ్ సిస్టమ్ ద్వారా సడెన్ బ్రేకులు వేసే అవకాశం ఉంటుంది.
  • ఈ రైలు సెకెన్ల వ్యవధిలో అత్యధిక వేగాన్ని అందుకోవడంతో పాటు అంతే వేగంగా నిలపగలిగే వ్యవస్థ.
  • అత్యవసర పరిస్థితుల్లో ప్యాసింజర్ మరియు రైలు మేనేజర్/లోకో పైలట్ మధ్య కమ్యూనికేషన్ కోసం ఎమర్జెన్సీ టాక్-బ్యాక్ యూనిట్.
  • ప్రతి కోచ్ లో ప్రయాణీకులకు అందుబాటులో టాయిలెట్లు .
  • ఈ రైల్లో ఆటోమేటిక్ ప్లగ్ డోర్లు, పూర్తిగా సీల్ చేయబడిన గ్యాంగ్‌ వేలు.
  • ఎర్గోనామిక్‌ గా రూపొందించిన ల్యాడర్ సాయంతో పై బెర్త్‌ లకు సులభంగా ఎక్కే అవకాశం.
  • ఎయిర్ కండిషనింగ్, సెలూన్ లైటింగ్ మొదలైన ప్రయాణీకుల సౌకర్యాల పర్యవేక్షణ కోసం కేంద్రీకృత కోచ్ మానిటరింగ్ సిస్టమ్.