పిల్లల మొదటి స్కూల్‌‌ ఇల్లే

‘నీ మొదటి స్కూల్‌‌ ఏది?’ అంటే ఎవరైనా ఏం చెప్తారు? వాళ్లు చేరిన స్కూల్‌‌ పేరు చెప్తారు. కానీ అందరికీ మొదటి స్కూల్‌‌ అమ్మ ఒడి, నాన్న భుజాలు. తొలి అడుగులు వేసే దగ్గరనుండి ఎదుటి వాళ్లతో ఎలా మాట్లాడాలి? ఎలా ప్రవర్తించాలి? అనేది నేర్చుకునేది ఇంట్లోనే. కొందరు పిల్లలు ఎక్కువ భయపడుతూ, పిరికిగా ఉంటారు. ఇంకొందరేమో చిన్న విషయాలకు కోపం తెచ్చుకుంటారు. మరికొందరు అడిగింది కావాలని మొండికేస్తారు. ఎవ్వరితో కలవలేరు. ఎక్కువగా మాట్లాడలేరు. ఇలా ఎవరు ఎలా ఉన్నా అది పేరెంట్స్‌‌ పెంచే విధానం బట్టే ఉంటుంది. కాబట్టి, పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలు పాటించాలి.

 పిల్లలు చేసే పనులు కొన్ని సార్లు నవ్వు తెప్పిస్తే, కొన్ని సార్లు కోపాన్ని తెప్పిస్తాయి. కోపం వచ్చినపుడు గట్టిగా అరిచి, చేయి చేసుకుంటారు కొందరు.  ఇలా చేయడం వల్ల ‘నేనేం చేసినా వీళ్లకు నచ్చదు. తిడుతుంటారు’ అని ఆ పనులు ఆపేస్తారు. ఇంకొందరు తిట్టినా కొద్దిసేపు సైలెంట్‌‌గా ఉండి తరువాత మళ్లీ అల్లరిచేస్తారు. వాళ్లకు అదే అలవాటైపోతుంది. ‘తప్పుచేసినా నన్నేం అనరులే’ అనుకుంటారు. కాస్త పెద్దయ్యాక మాట వినకుండా తయారవుతారు. అలాంటప్పుడు ఎక్కువ భయ పెట్టడం, తిట్టడం లాంటివి చేయొద్దు. మెల్లిగా దగ్గరకు తీసుకొని వాళ్లకు నచ్చచెప్పాలి. ఏది చేస్తే మంచి... ఏది చేస్తే తప్పు అనే విషయాలు వివరంగా చెప్పాలి. 
  కొందరు పిల్లలు చిన్నప్పటినుండే ఎవ్వరితోనూ సరిగ్గా మాట్లాడరు. కలవరు. ఎవరైనా పలకరించినా దూరంగా వెళ్తారు. ఒంటరిగా ఉంటారు. అలాంటి వాళ్లను  అందరి మధ్యలో పెంచాలి. నలుగురితో రెగ్యులర్‌‌‌‌గా కలిసేలా చేయాలి. లేదంటే పెద్దయ్యాక ఎవ్వరితో కలవలేరు. జాబ్‌‌ చేసేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదురుకోవాల్సి వస్తుంది. 

చిన్న పిల్లల్లో  తెలియని వాటిని తెలుసుకోవాలనే ఆతృత ఉంటుంది. అందుకే ఎక్కువ ప్రశ్నలు అడుగుతుంటారు. అలాంటప్పుడు విసిగించొద్దని వాళ్లపైన అరవకూడదు.  ఓపికగా అడిగినదానికి జవాబు చెప్తుండాలి. బుక్స్‌‌ చదివించాలి.  కొందరు పిల్లలకు కోపం ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో గట్టిగా అరుస్తూ, ఏడుస్తూ, చేతిలో ఏది ఉంటే అది విసిరేయడం, పక్కనున్న వాళ్లను కొట్టడం చేస్తుంటారు. ఆకలి వేసినపుడు, కావల్సింది దొరకనపుడు, కొనివ్వనపుడు, ఇలా జరుగుతుంది. అప్పుడు వాళ్లను దగ్గరకు తీసుకొని మొదట వాళ్ల అవసరాన్ని తీర్చాలి. కొంత శాంత పడ్డాక వాళ్లు చేసిన తప్పుని వివరించి... అలా ఇంకొకసారి ప్రవర్తించకూడదు అనే విషయం వాళ్ల చిన్నారి మనసులో ముద్ర పడేలా చెప్పాలి. అయినా వాళ్లు మారకపోతే కోపం వల్ల జరిగే అనర్ధాలను నెమ్మదిగా అర్థం అయ్యేలాగ చెప్పాలి.   పిల్లల్ని దగ్గరకు తీసుకొని ఆడించాలి, మాట్లాడాలి. వాళ్లకోసం కొంత టైం కేటాయించాలి. పేరెంట్స్‌‌ లైఫ్‌‌లో జరిగిన వాటి గురించి చర్చించాలి. వాటినుండి ఏం నేర్చుకోవాలో, ఏం నేర్చుకో కూడదో చెప్పాలి.