మామునూర్​ఎయిర్​పోర్ట్​భూసేకరణకు రూ.205కోట్లు రిలీజ్

మామునూర్​ఎయిర్​పోర్ట్​భూసేకరణకు రూ.205కోట్లు రిలీజ్
  • మామునూర్​ఎయిర్​పోర్ట్​ నిర్మాణానికి ముందడుగు
  • విస్తరణకు రూ.205 కోట్లువిడుదల చేసిన రాష్ట్ర సర్కార్
  • 253 ఎకరాల భూమిసేకరించేందుకు నిర్ణయం
  • త్వరలో నిర్మాణ పనులు మొదలు

హైదరాబాద్, వెలుగు: వరంగల్ జిల్లా మామునూర్​లో ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం ముందడుగు పడింది. ఎయిర్ పోర్ట్ పనులు ప్రారంభించేందుకు, విస్తరణకు అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు రూ. 205 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ  253 ఎకరాల భూమిలో కొంత రన్ వే విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్, ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్), నేవిగేషనల్ ఇన్ స్ట్రూమెంట్ ఇన్​స్టలేషన్ విభాగాల కోసం నిర్మాణాలు చేపట్టనున్నారు. 

ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి సంబంధించి డిజైన్లతో కూడిన డీపీఆర్ ను సిద్ధం చేయాలని ఎయిర్ పోర్ట్ అథారిటీకి ఇప్పటికే ఆర్ అండ్​ బీ శాఖ లేఖ రాసింది.  

త్వరలో పనులు 

మామునూర్ ఎయిర్ పోర్ట్​కు ఇప్పటికే 696 ఎకరాల భూమి ఉంది. విస్తరణకు మరో 280.30 ఎకరాల భూమి అవసరమవుతుండగా.. ఇందులోనూ 27.3 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది.  మరో 253 ఎకరాలు అవసరం కావడంతో ప్రభుత్వం వాస్తవ భూపరిహారాన్ని అంచనా వేసి రూ. 205 కోట్లు విడుదల చేసింది. దీంతో త్వరలోనే పనులు మొదలుపెట్టనున్నారు. 

రామప్ప, వెయ్యిస్తంభాల దేవాలయం, భద్రాకాళి ఆలయం, మేడారం సమ్మక్క– సారలమ్మ దేవాలయం ఈ పరిసరాల్లోనే ఉండటంతో ఎయిర్ పోర్ట్ విస్తరణ ఎంతైనా అవసరమని అధికారులు, నిపుణులు చెప్తున్నారు.