- ఫిబ్రవరి 9 నుంచి మహాపూజ ప్రారంభం
ఆదిలాబాద్, వెలుగు: తెలంగాణలో రెండో అతిపెద్ద గిరిజన జాతరగా చెప్పుకునే నాగోబా మహా జాతరకు తొలి అడుగు పడింది. ఫిబ్రవరి 9న నిర్వహించనున్న జాతర కోసం అత్యంత పవిత్రంగా నిర్వహించే గంగ నీళ్ల పాదయాత్రకు ఆదివారం మెస్రం వంశీయులు బయలుదేరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 22 కితల మెస్రం వంశీయులు కేస్లాపూర్లో ఆలయ పెద్ద మెస్రం వెంకట్ రావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి గంగాజలాల సేకరణ, మహాపూజపై ప్రణాళిక రూపొందించారు. తర్వాత ఝరి ( కలశం)కి పూజలు చేశారు. పాదయత్రగా బయల్దేరిన వారికి మెస్రం వంశం అల్లుళ్లు, ఆడపడుచులు బుందో పట్టగా కానుకలు వేసి ముందుకు సాగారు. మొదటి రోజు కేస్లాగూడలో బస చేశారు. 28న మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలంలోని గోదావరి నది హస్తినమడుగుకు చేరి ప్రత్యేక పూజలు నిర్వహించి గంగాజలాన్ని సేకరిస్తారు. ఫిబ్రవరి 5న ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఇంద్రాదేవి ఆలయానికి చేరుకొని పూజలు చేస్తారు. సాయంత్రం కేస్లాపూర్ లోని మర్రిచెట్టు వద్ద బస చేస్తారు. 6,7,8 తేదీల్లో సాంప్రదాయ పూజలు, తూమ్ ( కర్మకాండ) జరుపుతారు. ఫిబ్రవరి 9న రాత్రి 10.30 గంటలకు ఆలయంలోకి ప్రవేశిస్తారు. గంగాజలాలతో అభిషేకం చేసిన అనంతరం మహాపూజ ప్రారంభమవుతుంది. జాతర మొత్తం పూర్తయ్యేంత వరకు 22 కితల వారీకి ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు.
రూ. 50 లక్షలు నిధులు ఇవ్వాలని వినతి..
ఈసారి జాతరపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతరకు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. చివరి రోజున ఇప్పటికే ఆలయ కమిటీ తరపు నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి సీతక్కలను కలిసిన సభ్యులు జాతర నిర్వహణ, ఏర్పాట్ల కోసం రూ. 50 లక్షలు విడుదల చేయాలని కోరారు. ఉట్నూర్ ఐటీడీఏ పీవో చాహత్ బాజ్‌పాయ్ పర్యవేక్షణలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రధానంగా భక్తుల కోసం తాగునీరు, శాశ్వత మరుగుదొడ్లు, స్నానపు గదులు నిర్మించాలని మెస్రం వంశీయులు అధికారులను కోరారు.