కొత్త తరం రెఢీ.. ఇవాళ జింబాబ్వేతో ఇండియా తొలి టీ20

కొత్త తరం రెఢీ..  ఇవాళ జింబాబ్వేతో ఇండియా తొలి టీ20
  • భారీ ఆశలు పెట్టుకున్న యంగ్‌‌‌‌స్టర్స్‌‌‌‌
  • సా. 4.30 నుంచి సోనీ లివ్‌‌‌‌లో

హరారే: టీ20 ఫార్మాట్‌‌‌‌ను ముందుకు తీసుకెళ్లేందుకు టీమిండియా కొత్త తరం రెడీ అయ్యింది. ముగ్గురు లెజెండ్స్‌‌‌‌ విరాట్‌‌‌‌ కోహ్లీ, రోహిత్‌‌‌‌ శర్మ, రవీంద్ర జడేజా నిష్క్రమణ తర్వాత వారి ప్లేస్‌‌‌‌లను భర్తీ చేసేందుకు ఐపీఎల్ స్టార్లందరూ అవకాశం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐదు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో భాగంగా శనివారం జింబాబ్వేతో జరిగే తొలి పోరులో యంగ్‌‌‌‌ టీమిండియా తొలి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నది. శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ కెప్టెన్సీలోని టీమ్‌‌‌‌లో చాలా మంది కొత్త వారే ఉన్నారు. 

ఐపీఎల్‌‌‌‌ సూపర్‌‌‌‌ స్టార్లు అభిషేక్‌‌‌‌ శర్మ, రియాన్‌‌‌‌ పరాగ్‌‌‌‌ అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఫార్మాట్‌‌‌‌లో కొద్దిగా సీనియరైనా శివందూబే, సంజూ శాంసన్‌‌‌‌, యశస్వి జైస్వాల్‌‌‌‌ మూడో మ్యాచ్‌‌‌‌ నుంచి అందుబాటులో ఉండనున్నారు. కాబట్టి తొలి రెండు మ్యాచ్‌‌‌‌ల్లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అందరూ భావిస్తున్నారు. 2026 టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ వరకు టీమిండియా 34 మ్యాచ్‌‌‌‌లు ఆడనుంది. దీంతో  హార్దిక్‌‌‌‌, సూర్య, పంత్‌‌‌‌లాంటి సీనియర్లు వచ్చే వరకు వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌‌‌‌లు ఆడేందుకు యంగ్‌‌‌‌స్టర్స్‌‌‌‌ రెడీ అవుతున్నారు. 

ఇక ఈ మ్యాచ్‌‌‌‌ విషయానికొస్తే టాప్‌‌‌‌–3లో గిల్‌‌‌‌, రుతురాజ్‌‌‌‌, అభిషేక్‌‌‌‌ ఉండే చాన్స్‌‌‌‌ ఉంది. పిచ్‌‌‌‌ను బట్టి వీళ్ల ప్లేస్‌‌‌‌లు మారొచ్చు. నాలుగో నంబర్‌‌‌‌లో రియాన్‌‌‌‌ పరాగ్‌‌‌‌ను ఆడించొచ్చు. ఐదో స్థానంలో ఫినిషర్‌‌‌‌గా రింకూ సింగ్‌‌‌‌కు ప్లేస్‌‌‌‌ ఖాయం. వికెట్‌‌‌‌ కీపర్‌‌‌‌ కమ్‌‌‌‌ బ్యాటర్‌‌‌‌గా జితేష్‌‌‌‌ శర్మ, ధ్రువ్‌‌‌‌ జురెల్‌‌‌‌ నుంచి ఒకర్ని తీసుకోవచ్చు. బౌలింగ్‌‌‌‌లో పేసర్లుగా అవేశ్‌‌‌‌ ఖాన్‌‌‌‌, ఖలీల్‌‌‌‌ అహ్మద్‌‌‌‌, ముకేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ను కొనసాగించొచ్చు. హర్షిత్‌‌‌‌ రాణా మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే. దూబే వచ్చే వరకు ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌గా వాషింగ్టన్‌‌‌‌ సుందర్‌‌‌‌ను కంటిన్యూ చేయనున్నారు. లెగ్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌గా రవి బిష్ణోయ్‌‌‌‌ అన్ని మ్యాచ్‌‌‌‌లు ఆడే చాన్స్‌‌‌‌ ఉంది. 

సికందర్‌‌‌‌పైనే ఆశలు..

రికార్డులు, ఫామ్‌‌‌‌, ప్లేయర్ల పరంగా చూస్తే ప్రస్తుతం జింబాబ్వే అంత బలమైన జట్టు కాదు. కానీ షార్ట్‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌లో ఒక్కరు ఆడినా ఫలితం ఈజీగా మారుతుంది. కాబట్టి జింబాబ్వేలోనూ వ్యక్తిగతంగా బాగా ఆడే ప్లేయర్లు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా కెప్టెన్‌‌‌‌ సికందర్‌‌‌‌ రజాకు ఈ ఫార్మాట్‌‌‌‌లో మంచి ఎక్స్‌‌‌‌పీరియెన్స్‌‌‌‌ ఉంది. క్యాంప్‌‌‌‌బెల్‌‌‌‌, మదెవెరా, మురుమణి, మసకద్జా, ముజరబాని, జోంగ్వి, చతారాతో పాటుఈ మధ్య అంటుమ్‌‌‌‌ నఖ్వీ పేరు కూడా బాగా వినిపిస్తోంది. ఏదేమైనా చిన్న జట్టు అని అలసత్వం వహిస్తే టీమిండియాకే ప్రమాదం పొంచి ఉంటుంది.

జట్లు (అంచనా)


ఇండియా: శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), అభిషేక్‌‌‌‌ శర్మ, రుతురాజ్‌‌‌‌ గైక్వాడ్‌‌‌‌, రియాన్‌‌‌‌ పరాగ్‌‌‌‌, రింకూ సింగ్‌‌‌‌, ధ్రువ్‌‌‌‌ జురెల్‌‌‌‌ / జితేష్‌‌‌‌ శర్మ, సుందర్‌‌‌‌, రవి బిష్ణోయ్‌‌‌‌, అవేశ్‌‌‌‌ ఖాన్‌‌‌‌, తుషార్‌‌‌‌ దేశ్‌‌‌‌పాండే, ఖలీల్‌‌‌‌ అహ్మద్‌‌‌‌. 


జింబాబ్వే: సికందర్‌‌‌‌ రజా (కెప్టెన్‌‌‌‌), బ్రియాన్‌‌‌‌ బెనెట్‌‌‌‌, మురుమణి, జొనాథన్‌‌‌‌ క్యాంప్‌‌‌‌బెల్‌‌‌‌, అంటుమ్‌‌‌‌ నఖ్వీ, క్లైవ్‌‌‌‌ మదాండె, వెస్లీ మదెవెరా, ల్యూక్‌‌‌‌ జోంగ్వి, ఫరాజ్‌‌‌‌ అక్రమ్‌‌‌‌, మసకద్జా, ముజురుబాని.