- ఫేవరెట్‌గా బరిలోకి రోహిత్‌సేన
- ఐదేండ్ల తర్వాత హైదరాబాద్‌లో టెస్టు పోరు
- ఉ. 9.30 నుంచి స్పోర్ట్స్18, జియో సినిమాలో లైవ్
హైదరాబాద్, వెలుగు: ఒకటి కాదు రెండు కాదు. పన్నెండు ఏండ్ల నుంచి వరుసగా16 సిరీస్ విజయాలు. అందులో ఏడు క్లీన్‌స్వీప్స్. సొంతగడ్డపై టెస్టుల్లో పుష్కరకాలంగా ఇండియా ట్రాక్ రికార్డు ఇది. 2012లో అలిస్టర్ కుక్ కెప్టెన్సీలోని ఇంగ్లండ్ చేతిలో 1–2తో ఓడిన తర్వాత మరే జట్టూ మనల్ని జయించలేకపోయింది. టీమిండియా విజయయాత్రకు ఇప్పుడు మళ్లీ ఇంగ్లండ్ జట్టుతోనే సవాల్ ఎదురవనుంది.
ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా గురువారం నుంచి ఉప్పల్ స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఇండియా ఢీకొట్టనుంది. కొన్నాళ్లుగా ఇంగ్లండ్ బజ్‌బాల్ స్టయిల్‌తో టెస్టుల్లోనూ దూకుడుగా ఆడుతోంది. దీనికి తమ ప్రధాన ఆయుధమైన స్పిన్ బాల్‌తో చెక్ పెట్టాలని ఇండియా ప్లాన్ రెడీ చేసింది. 2012 నుంచి స్వదేశంలో ఆడిన 44 టెస్టుల్లో మూడే ఓడిన టీమిండియా ఎలాంటి ప్రత్యర్థినైనా వణికిస్తోంది. తమకు అనుకూలించే పిచ్‌లపై బౌలర్లు అదరగొడుతున్నారు. అదే టైమ్‌లో బ్యాటర్లు టన్నుల కొద్దీ రన్స్ రాబడుతున్నారు. ఉప్పల్‌లో ఫ్లాట్, స్పిన్ వికెట్ రెడీగా ఉండగా.. అశ్విన్, జడేజాను ఎదుర్కోవడం ఇంగ్లిష్ బ్యాటర్లకు పిచ్ మీద సాము కానుంది. ఇరు జట్లూ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్న నేపథ్యంలో పైచేయి ఎవరిదో అవుతుందో చూడాలి.
బరిలోకి భరత్.. మూడో స్పిన్నర్ గా అక్షర్!
సొంతగడ్డపై టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. తన ఆధిపత్యాన్ని కొనసాగించాలంటే బ్యాటర్లు నిలకడగా ఆడాలి. కెప్టెన్ రోహిత్... వెస్టిండీస్‌పై అరంగేట్రంలోనే సూపర్ సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. ఇద్దరూ మంచి పునాది వేస్తే జట్టుకు తిరుగుండదు. గత తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో ఒక్క ఫిఫ్టీ కూడా కొట్టని మరో యంగ్‌స్టర్ శుభమన్ గిల్‌పై అందరి దృష్టి ఉంది.
గతేడాది న్యూజిలాండ్‌పై వన్డేలో డబుల్ సెంచరీ సాధించిన వేదికపై తను సత్తా చాటుతాడేమో చూడాలి. కోహ్లీ లేకపోవడం జట్టుకు లోటే. దాంతో గిల్‌తో పాటు మిడిలార్డర్‌లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌పై ఎక్కువ బాధ్యత ఉండనుంది. కీపర్ కోసం ధ్రువ్ జురెల్ నుంచి పోటీ ఉన్నప్పటికీ కాస్త అనుభవం ఉన్న కేఎస్ భరత్ తుది జట్టులోకి రానున్నాడు. హిట్ పెయిర్ అశ్విన్, జడేజాకు తోడు మూడో స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ పోటీ పడుతున్నారు. ఆల్‌రౌండర్ కాబట్టి అక్షర్‌కు మొగ్గు ఉంది. బుమ్రా పేస్ బౌలింగ్‌ను నడిపించనుండగా.. తన హోమ్ గ్రౌండ్‌లో తన తొలి టెస్టులో అదరగొట్టాలని హైదరాబాదీ సిరాజ్ ఆశిస్తున్నాడు.
ఇంగ్లండ్‌కు అసలు ‘టెస్ట్’
ఉపఖండ పరిస్థితులకు అలవాటు పడేందుకు ఈ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ అబుదాబీలో ప్రత్యేక క్యాంప్‌లో పాల్గొన్నది. అయినప్పటికీ బెన్ స్టోక్స్ సేనకు ఇండియా గడ్డపై అసలైన సవాల్ ఎదురవనుంది. హ్యారీ బ్రూక్ టీమ్ నుంచి వైదొలగడంతో సిరీస్‌కు ముందే కాస్త డీలా పడ్డ ఇంగ్లిష్ టీమ్ వీసా సమస్య కారణంగా ఈ మ్యాచ్‌కు ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ సేవలు కోల్పోయింది. ఒక రోజు ముందే తుది జట్టును ప్రకటించిన ఇంగ్లండ్ పిచ్ స్వభావం దృష్ట్యా ముగ్గురు స్పిన్నర్లతో ఆడాలని నిర్ణయించుకుంది.
టామ్ హార్ట్లీ, రెహాన్ అహ్మద్, జాక్ లీచ్‌తో పాటు ఏకైక పేసర్‌గా మార్క్ వుడ్ బరిలోకి దిగుతున్నాడు. ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో ఎక్కువగా జో రూట్‌పైనే ఆధారపడింది. ఓపెనర్లు జాక్ క్రాలీ, డకెట్ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. టర్నింగ్ వికెట్‌పై స్పిన్‌తోనే ఇండియాను పడగొట్టాలని చూస్తున్న బెన్ స్టోక్స్ బ్యాటర్‌గా, లీడర్‌గా టీమ్‌కు కీలకం కానున్నాడు.
ఉప్పల్‌లో అజేయంగా ఆతిథ్య జట్టు
ఐదేండ్ల గ్యాప్ తర్వాత హైదరాబాద్‌లో జరుగుతున్న టెస్టును ఆస్వాదించేందుకు ఫ్యాన్స్ రెడీ అయ్యారు. టెస్ట్ మ్యాచ్ అయినప్పటికీ టికెట్లకు మంచి డిమాండ్ నెలకొంది. కొత్త సీటింగ్, ఎల్‌ఈడీ ఫ్లడ్ లైట్స్, స్ర్కీన్స్‌తో స్టేడియం సరికొత్తగా కనిపిస్తోంది. ఈ స్టేడియంలో టెస్టుల్లో ఇండియాకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన ఐదు టెస్టుల్లో ఒక్కసారి కూడా ఓడలేదు. ఓ మ్యాచ్‌ను డ్రా చేసుకొని నాలుగింటిలో గెలిచింది. చివరగా 2018లో జరిగిన టెస్టులో వెస్టిండీస్‌పై 10 వికెట్లతో నెగ్గింది.
మరో పది వికెట్లు తీస్తే అశ్విన్ 500 వికెట్ల క్లబ్‌లో చేరుతాడు.
జో రూట్ మరో పది రన్స్ రాబడితే ఇండియా-ఇంగ్లండ్ మధ్య టెస్టుల్లో అత్యధిక రన్స్ చేసిన సచిన్ రికార్డు (2535)ను బ్రేక్ చేస్తాడు.
కోహ్లీ, పుజారా, రహానె ముగ్గురూ లేకుండా ఇండియా టెస్టు మ్యాచ్ ఆడటం 2011 నవంబర్ తర్వాత ఇదే తొలిసారి.
పిచ్/వాతావరణం
ఉప్పల్ పిచ్ చాలా పొడిగా ఉంది. మూడ్రోజుల నుంచి డే టైమ్‌లో పిచ్‌ను ఆరబెడుతూ చిన్న రోలర్లతో ఎక్కువగా రోలింగ్ చేశారు. మొదట్లో బ్యాటింగ్‌కు అనుకూలించి సమయం గడుస్తున్న కొద్దీ స్పిన్నర్లకు సపోర్ట్ లభించే అవకాశం ఉంది. సిటీలో వర్ష సూచన లేదు.
తుది జట్లు:
ఇండియా (అంచనా): రోహిత్ (కెప్టెన్), జైస్వాల్, గిల్, శ్రేయస్, రాహుల్, జడేజా, భరత్ (కీపర్), అక్షర్, అశ్విన్, బుమ్రా, సిరాజ్.
ఇంగ్లండ్: జాక్ క్రాలీ, డకెట్, ఒలీ పోప్, జో రూట్, బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (కీపర్), రెహాన్ అహ్మద్, మార్క్ వుడ్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్.