ఛాన్స్ ఉన్నా చేజేతులా ఓడిన ఆఫ్ఘనిస్తాన్.. క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి

ఛాన్స్ ఉన్నా చేజేతులా ఓడిన ఆఫ్ఘనిస్తాన్.. క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి

 

ఆసియా కప్ లో భాగంగా నిన్న జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ పై శ్రీలంక 2 పరుగులు తేడాతో విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్ లో అద్భుతంగా ఆడినా ఆఫ్ఘనిస్తాన్ కి పరాజయం తప్పలేదు. అయితే గెలుపోటములు ఆటలో సహజం. కానీ ఆఫ్ఘనిస్తాన్ మాత్రం చేజేతులా ఓడిపోయింది. సూపర్-4 కి అర్హత సాధించాలంటే 37.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించాల్సిన పరిస్థితుల్లో విజయానికి 3 పరుగుల దూరంలో ఆగిపోయింది. నిజానికి 37.1 ఓవర్లు అయిపోయిన తర్వాత కూడా ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ గెలిచి సూపర్-4 కి అర్హత సాధించే ఛాన్స్ మిస్ చేసుకుంది. అయితే ఈ లెక్క తెలియక శ్రీలంకకు విజయాన్ని అప్పగించారు.

ఆ మూడు బంతుల్లో సిక్సర్ కొట్టి ఉంటే అవకాశం
 
సాధారణంగా 292 పరుగుల భారీ లక్ష్యం అంటే ఏ జట్టుకైనా సవాలే. అది కూడా ఆఫ్ఘనిస్థాన్ లాంటి పసికూన ఈ టార్గెట్ ని 37.1ఓవర్లలో ఛేజ్ చేయాలంటే అది శక్తికి మించిన పని. నిన్న శ్రీలంకపై జరిగిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఇది. 50 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న అఫ్గాన్ జట్టుకి ఆల్ రౌండర్ నబీ 32 బంతుల్లో 67 పరుగులు చేసి శ్రీలంక కి చెమటలు పట్టించాడు.  . జట్టు విజయంపై ఆశలు రేకెత్తిస్తూ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. నబీకి తోడు కెప్టెన్ షాహిదీ అర్ధ సెంచరీతో రాణించాడు . కరీం జనత్, నజీబుల్లా జద్రాన్ కూడా వేగం పెంచడంతో ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం సాధించి సూపర్ ఫోర్ దశకి అర్హత సాధించేలా కనపడింది.
 
రషీద్ పోరాడినా..ఆ లెక్క తెలుసుకోలేకపోయారు
 
 37 ఓవర్లు ముగిసేసరికి ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ 8 వికెట్లకు 289 పరుగులు చేసింది. అనుకున్న లక్ష్యం ప్రకారం సూపర్-4 కి అర్హత సాధించాలంటే చివరి బంతికి 3 పరుగులు అవసరమయ్యాయి. అంతకు ముందు ఓవర్లో రషీద్ మూడు ఫోర్లు కొట్టి మ్యాచ్ ఆశలు ఇంకా అలాగే ఉంచాడు. అయితే 38 ఓవర్ తొలి బంతికి ముజీబ్ భారీ షాట్ కి ప్రయత్నించి అవుట్ కావడంతో ఆఫ్ఘనిస్తాన్ ఆశలు ఆవిరయ్యాయి. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే చోటు చేసుకుంది. ఆఫ్గాన్ కనుక 37.5 ఓవర్లలో 295 పరుగులు చేసి ఉంటే.. సూపర్-4కు చేరుకునేది.

అప్పటికే 289 పరుగులు చేసిన ఆఫ్ఘనిస్తాన్ ఆ తర్వాత నాలుగు బంతుల్లో ఒక సిక్స్ కొడితే ఛాన్స్ ఉండేది. కానీ చివరి బ్యాటర్ ఫరూకీకి ఈ విషయం తెలియదనుకుంటా. అతడు తర్వాత రెండు బాల్స్ ని డిఫెన్సె ఆడి మూడో బంతికి ఔటయ్యాడు. ఆఫ్గాన్ టీం అనలిస్ట్ ఈ విషయాన్ని ఫరూఖీకి చెప్పి ఉండడని, అందుకే అతని అలా ఆడాడని అంతా అనుకుంటున్నారు. మొత్తానికి ఆఫ్గాన్ టీం అనలిస్ట్ చేసిన పనికి గెలిచి సూపర్-4 కి చేరుకునే అవకాశాన్ని ఆఫ్ఘనిస్తాన్ జట్టు చేజేతులా పోగొట్టుకుంది.