హైదరాబాద్, వెలుగు: కడెం ప్రాజెక్టు ఎక్కడుంటదో కూడా కేటీఆర్‌కు తెల్వదని, ఆ ప్రాజెక్టుకు రిపేర్లు చేయించకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ ప్రాజెక్టు మరమ్మతులకు రూ.5.45 కోట్లు కేటాయించిందని తెలిపారు. ఇందిరమ్మ ఇంట్లో నివసించే తనను అసెంబ్లీకి పంపిన ఖానాపూర్ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా విద్య, వైద్యం, వ్యవసాయంలో వెనకబడిందని, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని ఆయన కోరారు.
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఇవ్వండి: పర్ణికారెడ్డి
నారాయణపేటకు టెక్స్‌టైల్ పార్కు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మంజూరు చేయాలని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే పర్ణికారెడ్డి కోరారు. అలాగే, తన సెగ్మెంట్లోని జిల్లా హాస్పిటల్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు డాక్టర్లు, సిబ్బందిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
సమస్యల్లో నిజామాబాద్: సూర్యనారాయణ గుప్త
గత పాలకుల తప్పిదాల వల్ల నిజామాబాద్ జిల్లా సమస్యల వలయంగా మారిందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్త అన్నారు. స్కూళ్లలో వసతులను ప్రభుత్వం వెంటనే సమకూర్చాలని కోరారు. ప్రభుత్వ దవాఖానలో డాక్టర్లు, సిబ్బందిని నియమించాలన్నారు. బస్ స్టాండ్ అభివృద్ధికి నిధులివ్వాలని కోరారు. తెలంగాణ వర్సిటీకి వీసీని నియమించి, గర్ల్స్ హాస్టల్‌ను నిర్మించాలనికోరారు. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పేర్లను మార్చాలని విజ్ఞప్తి చేశారు.
దళితబంధు నిధులు విడుదల చేయాలె: కౌశిక్‌రెడ్డి
హుజురాబాద్ నియోజకవర్గానికి రెండో విడత దళిత బంధు నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి కోరారు. హుజురాబాద్ హాస్పిటల్‌లో ఐసీయూను ప్రారంభించాలని, అవసరమైన డాక్టర్లు, సిబ్బందిని నియమించాలన్నారు. కమలాపూర్ మండలంలో చివరి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రాజెక్టులు జల్ది కట్టాలె: లక్ష్మికాంతరావు
జుక్కల్ నియోజకవర్గంలోని నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, లెండి ప్రాజెక్ట్ పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లక్ష్మికాంతరావు కోరారు. నియోజకవర్గంలోని హాస్పిటల్స్ కు డాక్టర్లు, ఇతర సిబ్బందిని నియమించాలని కోరారు.
పాల రైతులకు డబ్బులు ఇయ్యాలె: పల్లా
రాష్ట్రంలోని ప్రభుత్వ డైయిరీలకు పాలు పోస్తున్న రైతులకు వెంటనే బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కోరారు. పెంచిన బోనస్ డబ్బులు కూడా రైతులకు అందలేదన్నారు. రైతు నుంచి పాలు తీసుకునే దగ్గరే క్వాలిటీ చెక్స్ అన్నీ చేయాలని, హైదరాబాద్‌కు తీసుకొచ్చాక పాలు బాగలేవని తిప్పి పంపడం, బిల్లులు ఇవ్వకపోవడం కరెక్ట్ కాదన్నారు.
ట్రిపుల్ ఐటీకి కొత్త వీసీని నియమించండి: రామారావు పటేల్
బాసర ట్రిపుల్ ఐటీ ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ వెంకట రమణ బీఆర్‌ఎస్ ఏజెంట్ అని ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆరోపించారు. ఆయన తన ప్రమోషన్, డిప్యుటేషన్ గురించి తప్పితే, ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ల గురించి ఆలోచించడం లేదన్నారు. వీసీ సొంత అవసరాల కోసం ట్రిపుల్ ఐటీ నిధులను వినయోగించుకున్నాడని, దీనితో పాటు పై ఎంక్వైరీ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. వెంకటరమణను వీసీగా తొలగించి పూర్తిస్థాయి వీసీని నియమించాలన్నారు.
డయాలసిస్ మిషన్లు కావాలె: సంజయ్
కోరుట్ల ప్రభుత్వ దవాఖానలో ఉన్న డయాలసిస్ సెంటర్‌లో మిషన్లు సరిపోక, కిడ్నీ పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. కొత్తగా ఇంకొన్ని మిషన్లు ఏర్పాటు చేసి, పేషెంట్లను ఆదుకోవాలని కోరారు. నిజాం షుగర్ ఫాక్టరీపై వేసిన కమిటీకి సంబంధించిన వివరాలను అందజేయాలని విజ్ఞప్తి చేశారు.
సింగరేణితో ప్రాణాలు పోతున్నయ్: మట్టా రాగమయి
తన నియోజకవర్గంలోని ప్రజలకు సింగరేణి పెద్ద సమస్యగా తయారైందని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి అన్నారు. గురువారం రాష్ట్ర అసెంబ్లీలో జీరో అవర్ నిర్వహించారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకురావాల్సిందిగా స్పీకర్ కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన రాగమయి మాట్లాడారు. సింగరేణి గనుల వల్ల భూగర్భ జలాలు ఎండిపోయాయని, వచ్చే కొన్ని నీళ్లు కూడా కలుషితం అయ్యాయని చెప్పారు. దీని వల్ల రోగాలు వచ్చి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
దుబ్బాకకు రెవెన్యూ డివిజన్ ఇవ్వండి: కొత్త ప్రభాకర్‌రెడ్డి
దుబ్బాకలో ఒక రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేయాలని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ డెవలప్‌మెంట్ ఫండ్స్‌ను ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా ఇవ్వాలని ఆయన కోరారు.
వేములవాడ వెనుకబడింది: ఆది శ్రీనివాస్
కేసీఆర్ పదేండ్ల పాలనలో వేములవాడ చాలా వెనుకబడిందని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు స్టేజ్ 2 కోసం రూ.1,730 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. 10 శాతం పనులు పూర్తి చేస్తే 43 వేల ఎకరాలకు నీళ్లు అందుతాయన్నారు. కందికోట ప్రాజెక్టు కాలువలను పూర్తి చేయాలన్నారు. వేములవాడను టెంపుల్ సిటీగా మార్చాలన్నారు.
కాకతీయ వర్సిటీలో ప్రొఫెసర్లను నియమించాలె: కేఆర్ నాగరాజ్
కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు, సిబ్బంది లేకపోవడం వల్ల స్టూడెంట్స్‌కు సరియైన విద్య అందడం లేదని, వెంటనే ఖాళీలు అన్నింటినీ భర్తీ చేయాలని వర్దన్నపేట్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన 317 జీవోను రివ్యూ చేయాలని సర్కార్‌కు సూచించారు. పోలీసులకు ఇవ్వాల్సిన పెండింగ్ టీఏ, డీఏ నిధులను విడుదల చేయాలని, ప్రమోషన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
Also read : ఇసుక తోడుడు మళ్లా షురూ
తూట లేని తుపాకులుగా దవాఖాన్లు: సత్యనారాయణరావు
తన నియోజకవర్గంలో ఉన్న దవాఖాన్ల పరిస్థితి తూటా లేని తుపాకుల తీరుగా తయారైందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. వెంటనే మెడికల్ కాలేజీ, టీచింగ్ హాస్పిటల్, సింగరేణి ఏరియా హాస్పిటల్స్‌కు స్టాఫ్‌ను నియమించా లని కోరారు. మెడికల్ కాలేజీ సమస్యలను పరిష్కరించి సెకండియర్ పర్మిషన్ వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. సింగరేణి హాస్పిటల్‌లో యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో, ఆర్థో డాక్టర్లను నియమించాలన్నారు. జులైలో వచ్చిన వరదలతో నష్టపోయిన వారిని ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
దళితబంధులో వంద కోట్ల ఫ్రాడ్: మందుల సామేల్
తన నియోజకవర్గంలోని పాలిటెక్నిక్ కాలేజీని అప్‌గ్రేడ్ చేసి ఇంజినీరింగ్ కాలేజీగా మార్చాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్(కాంగ్రెస్) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రుద్రమ చెరువును రిజర్వాయర్‌గా అప్‌గ్రేడ్ చేయాలన్నారు. మోత్కూరులో డిగ్రీ కాలేజీ, బస్సు డిపో ఏర్పాటు చేయాలని కోరారు.తన నియోజకవర్గంలో దళితబంధులో సుమారు రూ.వంద కోట్ల ఫ్రాడ్ జరిగిందని, దీనిపై విచారణ జరిపించాలని రిక్వెస్ట్ చేశారు.