- ఊరూరా మాఫీ సంబురం
- తొలి విడతలో రూ.లక్ష రుణమాఫీ..11,50,193 మంది
- రైతుల ఖాతాల్లో రూ.6,098.93 కోట్లు జమ
- ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు
- సీజన్ ప్రారంభంలోనే సొమ్ము రిలీజ్ కావడంతో రైతుల్లో ఆనందం
- కొత్త లోన్లు తీసుకునేందుకు అవకాశం
- నిధుల సమీకరణలో స్ట్రాటజిక్‌గా వ్యవహరించిన ప్రభుత్వం
- ఆర్థిక పరిస్థితి అంతంతే ఉన్నా పక్కాగా అమలు
- రఘురాం రాజన్ లాంటి నిపుణుల నుంచి సూచనలు
- ఈ నెలాఖరుకు రూ. లక్షన్నర వరకు.. పంద్రాగస్టులోపు రూ. 2 లక్షలు మాఫీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని రైతుల ఇంట రుణమాఫీ పండుగ వచ్చింది. ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం రూ. రెండు లక్షల రుణమాఫీ అమలుకు శ్రీకారం చుట్టింది. పంద్రాగస్టులోగా మాఫీని పూర్తి చేస్తామని చెప్పినట్లుగానే తొలి విడతగా.. రూ. లక్ష వరకు రుణాలున్న వాళ్లకు గురువారం అకౌంట్లలో డబ్బులు జమ చేసింది. సెక్రటేరియెట్ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా.. రైతుల సెల్ఫోన్లకు రుణమాఫీ మెసేజ్‌లు వచ్చాయి. దీంతో ఊరూరా సంబురాలు మొదలయ్యాయి. ఈ నెలాఖరుకు రూ. లక్షన్నర వరకు రుణాలు.. ఆగస్టు 15 లోపు పూర్తిగా రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.
ఇటు నాట్లు... అటు స్వీట్లు
వానాకాలం సీజన్ ప్రారంభంలోనే తమ అకౌంట్లలో రుణమాఫీ నిధులు జమ కావడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది.ఇటు పొలాల్లో వరి నాట్లు వేస్తూనే.. అటు స్వీట్లు పంచిపెట్టారు. ఇన్నాళ్లూ అప్పుల్లో ఉన్నామని, ఇప్పుడు ప్రభుత్వం మాఫీ చేయడంతో ఎంతో సంతోషంగా ఉందని పలువురు రైతులు సీఎం రేవంత్‌రెడ్డితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ ఆనందాన్ని పంచుకున్నారు. రుణమాఫీ అమలు కావడంతో అటు బ్యాంకు అప్పులు తీరి... కొత్తగా రుణాలు తీసుకునేందుకు అవకాశం దక్కింది. దీంతో పెట్టుబడికి ఇబ్బందులు లేకుండా.. ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే బాధలు కూడా తప్పాయని రైతులు అన్నారు.
వడ్డీ భారం పడకుండా..!
గత సర్కార్ మాదిరి కాకుండా, రైతులకు వడ్డీ భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీని మొదలుపెట్టింది. రైతులకు బ్యాంకుల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. మొదటి రోజు గురువారం 32 జిల్లాల్లో 10,84,050 రైతు కుటుంబాల్లోని 11,50,193 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.6,098.93 కోట్లు జమ అయ్యాయి. దీంతో వీరంతా రుణ విముక్తులయ్యారు.
పకడ్బందీగా అమలు
గత ప్రభుత్వం చేసిన అప్పులతో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ సర్కార్‌కు మొదటి నుంచీ ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. రుణమాఫీ అసాధ్యమని బీఆర్ఎస్ లీడర్లు చెప్పుకొచ్చారు. అయితే దుబారా ఖర్చులకు చెక్ పెట్టిన రాష్ట్ర సర్కార్.. రుణమాఫీ నిధుల కోసం ముందు నుంచే పకడ్బందీ ప్లాన్‌తో ముందుకు వెళ్లింది. ఆర్బీఐ నుంచి తీసుకునే అప్పులను జాగ్రత్తగా దాచింది.
అదే సమయంలో ప్రభుత్వానికి వచ్చే సొంత ఆదాయంలో కొంత సేవ్ చేసి రుణమాఫీకి పెట్టింది. అట్ల దాదాపు రూ.10 వేల కోట్లు జులై నెల మొదటి వారంలోనే సిద్ధం చేసుకుంది. ఇంకో రూ.21 వేల కోట్ల విషయంలోనూ ప్రభుత్వం టీజీఐఐసీ నుంచి కొంత, ఆర్బీఐ బాండ్ల నుంచి ఇంకొంత, ఇతర మార్గాలలో మరికొంత సమకూర్చుకుంటున్నది. ఈ నెలఖారులోనే లక్షన్నర వరకు పంట రుణాలను మాఫీ చేసేందుకు రెడీ అయింది.
ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 వరకు కాకుండా అంతకంటే ముందే మాఫీ చేయాలని ప్రభుత్వం అనుకుంటున్నది. రుణమాఫీ విషయంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ సూచనలను కూడా ప్రభుత్వం తీసుకున్నది.
ఇచ్చిన మాట ప్రకారం
రూ. 2లక్షల రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలోనే హామీ ఇచ్చింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలోనే ఆగస్టు 15లోగా రెండు లక్షల రూపాయల పంట రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. అసలు సాధ్యం కాదని.. చేయలేరని ప్రతిపక్ష పార్టీల లీడర్లు సవాళ్లు విసిరారు. అయినా జూన్ నెల నుంచే రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.
పంట రుణాలు తీసుకున్న రైతుల లెక్కలు తెప్పించుకొని.. నిధులు సమీకరించుకున్నది. కటాఫ్ తేదీ విషయంలోనూ ఎక్కువ మంది రైతులకు మేలు జరిగేలా.. గత ప్రభుత్వం ఎక్కడ ఆపేసిందో అక్కడి నుంచేఅంటే 2018 డిసెంబర్ 12 నుంచే అమలు చేస్తామని ప్రకటించింది. పాసు పుస్తకాలు ఉన్న ప్రతి చిన్న, సన్నకారు రైతులకు రుణమాఫీ లబ్ధి జరుగుతుందని ప్రభుత్వం వెల్లడించింది.
దీంతో ఆయా రైతు కుటుంబాల బ్యాంకు అప్పుల నుంచి విముక్తి కానున్నాయి. రూ. 2 లక్షల రుణమాఫీలో 40 లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుందని.. పూర్తి మాఫీ తరువాత సంఖ్య ఇంకింత పెరిగే అవకాశం ఉంది. రూ. 2లక్షల రుణమాఫీతో యావరేజ్‌గా ప్రతి రైతు కుటుంబానికి రూ.70 వేల నుంచి రూ.90 వేల వరకు లబ్ధి చేకూరనుంది. మొత్తంగా దాదాపు రూ.31 వేల కోట్ల రుణాలు మాఫీ కానున్నాయి.
రేవంత్.. సల్లగుండాలె
నా కొడుకులు బతికున్నప్పుడు బ్యాంకుల లోన్ తెచ్చిన్రు. వాళ్లు ఇప్పుడు చనిపోయిన్రు. నాకు 90 ఏండ్లు వచ్చినయ్. అప్పు కట్టాల్నంటే నాతో అయితలేదు. బ్యాంకోళ్లు వచ్చినప్పుడల్లా బుగులైతుండె. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసిండని తెలిసి సంతోషమైతున్నది. ఆయన సల్లగుండాలె.
- మహంకాలమ్మ, ఖమ్మంపల్లి, పెద్దపల్లి జిల్లా
మెసేజ్ రాగానే సంతోష పడ్డం..
కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది. నా లోన్ మాఫీ అయినట్టు బ్యాంక్ నుంచి మేసేజ్ రాగానే మా కుటుంబంలో అందరం ఎంతో సంతోష పడ్డం. పంటలు పండక పోయినా లోన్ కట్టాలని బ్యాంక్ వాళ్లు నిలదీసినప్పుడు బాధపడేవాళ్లం. ఇప్పుడు రుణమాఫీ మాకెంతో ధైర్యాన్ని ఇచ్చింది.
- ఎల్కచేను వెంకటేశ్, బీకే తిర్మలాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా
90 వేలు మాఫీ అయింది..
నాకు 1.30 ఎకరాల భూమి ఉంది. దానిమీద రూ.90 వేల క్రాప్ లోన్ తీసుకున్న. ఎవుసంతో పాటు కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించు కుంటున్న. లోన్ తీర్చుడు కష్టం అయింది. కాంగ్రెస్ ప్రభుత్వ పుణ్యమా అని నాకున్న రూ.90 వేల లోన్ మాఫీ అయింది.
- ద్యాగల రాధ, తంగళ్లపల్లి, కోహెడ మండలం, సిద్దిపేట జిల్లాకోహెడ మండలం, సిద్దిపేట జిల్లా
నాట్లు వేస్తూ..డప్పు కొడ్తూ..
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ముంజంపల్లిలో రుణమాఫీపై రైతుల సంబురాలుజనగామ జిల్లా దేవరుప్పులలో కానికి కాంగ్రెస్ జెండాలు కట్టి పొలం దున్నుతున్న రైతు కృష్ణమూర్తి