చంద్రుడిపై సేఫ్, సాఫ్ట్ ల్యాండింగ్ ను సాధించడం, చంద్రుడిపై రోవర్ ను నడిపించడం, ప్రయోగాలు చేపట్టడమే చంద్రయాన్–3 మిషన్ లక్ష్యాలు కాగా.. విక్రమ్ ల్యాండింగ్, ప్రజ్ఞాన్ రోవర్ మూన్ వాక్ తో మొదటి రెండు లక్ష్యాలు నెరవేరాయి. ల్యాండర్, రోవర్ ఇకపై 14 రోజుల పాటు (ఒక లూనార్ డే) వరుస ప్రయోగాలు చేపట్టనున్నాయి. రెండింటిలో ఉండే పేలోడ్ ల ద్వారా పలు ప్రయోగాలు చేపట్టి, చంద్రుడి నేలలోని మూలకాలు, ఖనిజాలు, ఇతర అంశాలను విశ్లేషించి, ఆ డేటాను పంపనున్నాయి.
చంద్రుడిపై ఒకవైపు 14 రోజులు వెలుతురు (ఒక లూనార్ డే), 14 రోజులు చీకటి (ఒక లూనార్ నైట్) ఉంటాయి. ప్రస్తుతం విక్రమ్ ల్యాండింగ్ సైట్ లో 14 రోజులు వెలుతురు ఉండనుండటంతో ఇవి 14 రోజుల పాటు నిరంతరం పని చేసేలా రూపొందించారు. అయితే, 14 రోజుల తర్వాత లూనార్ నైట్ లో అక్కడ మైనస్ 180 డిగ్రీలకుపైగా టెంపరేచర్లు పడిపోతాయి.
సూర్యరశ్మి లేకపోవడం, చాలా చల్లని పరిస్థితుల్లో ల్యాండర్, రోవర్ దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. మళ్లీ లూనార్ డే వచ్చిన తర్వాత ల్యాండర్ యాక్టివ్ అయితేనే అప్పుడు మళ్లీ భూమికి డేటా పంపే చాన్స్ ఉంటుంది. లేదంటే ఈ 14 రోజులతోనే వీటి లైఫ్ ముగిసిపోనుంది.
పేలోడ్స్: 2
లిబ్స్ (లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్): ఇది చంద్రుడి నేలపై మట్టిలో ఉండే మూలకాలను, ఖనిజాలను విశ్లేషిస్తుంది. ఆయా మూలకాలు, ఖనిజాలు ఎంతెంత శాతాల్లో ఉన్నాయో తేలుస్తుంది. దీంతో చంద్రుడి నేలకు సంబంధించి మనకు మరింత అవగాహన వస్తుంది.
ఏపీఎక్స్ఎస్ (ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్): ఇది ల్యాండింగ్ సైట్ లోని మట్టి, రాళ్లలో ఉండే మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, పొటాషియం, కాల్షియం, టిటానియం, ఐరన్ మూలకాల కాంపొజిషన్ ను నిర్ధారిస్తుంది.
విక్రమ్ ల్యాండర్ మిషన్ లైఫ్: 1 లూనార్ డే (మన భూమిపై పోలిస్తే 14 రోజులు)
బరువు: 1,749.86 కిలోలు (రోవర్ తో కలిపి)
పేలోడ్స్: 4
రాంభా (రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్ సెన్సిటివ్ అయనోస్పియర్ అండ్ అట్మాస్పియర్): ఇది చంద్రుడి ఉపరితలంపై ప్లాస్మా (అయాన్లు, ఎలక్ట్రాన్లు) సాంద్రత, కాలక్రమంలో వాటిలో జరిగిన మార్పులను స్టడీ చేస్తుంది.
ఛాస్ట్ (చంద్రాస్ సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్ పరిమెంట్): ఇది చంద్రుడి దక్షిణ ధ్రువంలో ఉపరితలానికి ఉన్న థర్మల్ ప్రాపర్టీస్ ను కొలిచి, ఆ వివరాలు తెలియజేస్తుంది.
ఇల్సా (ఇన్ స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సీస్మిక్ యాక్టివిటీ): ఇది ల్యాండింగ్ సైట్ చుట్టూ వచ్చే ప్రకంపనాలను కొలుస్తుంది. చంద్రుడి ఉపరితలం (క్రస్ట్), దాని కింది పొర (మ్యాంటిల్) నిర్మాణ తీరును వివరిస్తుంది.
ఎల్ఆర్ఏ (లేజర్ రిట్రోఫ్లెక్టర్ అర్రే): ఇది నాసాకు చెందిన పరికరం. చంద్రుడి కదలికలను అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే డేటాను ఇది అందిస్తుంది.