గువాహతి: ఆసియా కప్ సొంతం చేసుకొని, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో గెలిచి జోరు మీదున్న టీమిండియా సొంత గడ్డపై వన్డే వరల్డ్ కప్ ప్రిపరేషన్స్‌కు ఫినిషింగ్ టచ్ ఇవ్వనుంది. మెగా టోర్నీ కోసం తమ తొలి వార్మప్ మ్యాచ్‌లో భాగంగా శనివారం ఇంగ్లండ్‌తో తలపడనుంది. వరల్డ్ కప్ కోసం15 మందితో బలమైన టీమ్‌ను సిద్ధం చేసుకున్న ఇండియా.. వార్మప్స్ ద్వారా తుది జట్టు, సరైన కాంబినేషన్లపై అంచనాకు రావాలని కోరుకుంటోంది. అశ్విన్‌పై ఈ మ్యాచ్‌లో అందరి ఫోకస్ ఉండనుంది. శుక్రవారం జరిగిన ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్‌లో గిల్, ఇషాన్ కిషన్, అశ్విన్, శార్దూల్ ఠాకూర్ మాత్రమే పాల్గొన్నారు.
మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ లండన్ నుంచి గువాహతికి 38 గంటల ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటీవల న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను గెలిచిన జోష్‌లో ఉన్న ఇంగ్లండ్ వార్మప్స్ తో ఇండియాలో పరిస్థితులపై ఓ అంచనాకు రావాలని చూస్తోంది. ఈ ఐపీఎల్‌లో రెండే మ్యాచ్‌లు ఆడిన బెన్ స్టోక్స్ కూడా ఇక్కడి కండిషన్లకు అలవాటు పడాలని చూస్తున్నాడు. కాగా, తిరువనంతపురంలో ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ మధ్య మరో వార్మప్ జరగనుంది.