ధవళేశ్వరం ప్రాజెక్ట్ కు వరద పోటు...మొదటి ప్రమాద హెచ్చరిక

ధవళేశ్వరం ప్రాజెక్ట్ కు వరద పోటు...మొదటి ప్రమాద హెచ్చరిక

తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.  ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నదులు, చెరువులు,  కుంటలు పొంగి ప్రవహిస్తున్నాయి.  ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర గోదావరికి వరద పోటెత్తడంతో  గురువారం ( జులై 27) మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.  ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 10.02 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద నదినీటిమట్టం 12.7 అడుగుల వద్ద ఉండగా.. డెల్టా పంటకాలువలకు 4 వేల క్యూసెక్కులు, సముద్రంలోకి 11.14 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అధికారులను ఎప్పటికప్పుడు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేస్తుంది.

అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు 3 ఎన్డీఆర్ఎఫ్, 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగాఉన్నాయి. ఎమర్జెన్సీ హెల్ప్ కోసం స్టేట్ కంట్రోల్ రూమ్ నంబర్లు 1070, 112, 1800 425 0101 నంబర్లను 24 గంటలు అందుబాటులో ఉంచారు. తెలంగాణకు మరో 48 గంటలు అతిభారీ వర్షసూచన ఉన్న నేపథ్యంలో గోదావరికి మరింత వరద పోటెత్తే అవకాశం ఉండటంతో.. గోదావరి పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.మరో ఐదు  రోజులు  కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది.