- జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో తొలిసారిగా నారాయణపేటలో ఏర్పాటు
- రూ.1.20 కోట్లతో బంక్ నిర్మాణం
- నెలకు రూ.10 వేల చొప్పున లీజ్ రెంట్
- సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఆఫీసర్ల ఏర్పాట్లు
హైదరాబాద్, వెలుగు : మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని లక్ష్యం పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు పోతున్నది. వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు బ్యాంకు ద్వారా రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నది. ఇందులో భాగంగా రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్ జీ) ఆధ్వర్యంలో మహిళలు పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసేందుకు చేయూత అందిస్తున్నది. రాష్ట్రంలో తొలిసారి నారాయణపేట జిల్లాలో జిల్లా సమాఖ్య నేతృత్వంలో పెట్రల్ బంకు నిర్మించింది.
ఈనెల 26లోగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆ పెట్రోల్ బంక్ ను ప్రారంభించేందు సెర్ప్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే బంకుకు సంబంధించి అన్ని పనులు పూర్తయ్యాయి. బంకులోని స్టోరేజీ ట్యాంకుల్లో పెట్రోల్, డీజిల్ కూడా లోడ్ చేశారు. కాగా, ఎస్హెచ్ జీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లాలో మరో పెట్రోల్ బంకు నిర్మాణానికి మంత్రి దామోదర రాజనర్సింహ ఇటీవల శంకుస్థాపన చేశారు. త్వరలో ఈ బంకు నిర్మాణ పనులు కూడా ప్రారంభం కానున్నాయి.
24 గంటలు సర్వీస్
రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్ జీ) ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా మహిళా పెట్రోల్ బంకును నారాయణపేట జిల్లాలో ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని కొత్త కలెక్టరేట్ ఎదురుగా మొయిన్ రోడ్ పక్కన బంకును నిర్మించారు. పెట్రోల్ బంకు ఏర్పాటు కోసం డీఆర్డీఏ, నారాయణపేట జిల్లా సమాఖ్య.. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ తో ఎంవోయూ కుదుర్చుకుంది. బంకు నిర్మాణానికి సంబంధించిన పనులన్నీ బీపీసీఎల్ చేపట్టింది. ఇందుకోసం రూ.1.20 కోట్లు కేటాయించింది. ల్యాండ్ లీజ్, లెవలింగ్ పనులు, బంకులో ఫర్నిచర్, ఇతర పనులను జిల్లా సమాఖ్య నిధులతో చేపట్టారు. ప్రభుత్వ స్థలం ఆరున్నర గుంటలను జిల్లా సమాఖ్యకు 20 ఏండ్లకు లీజుకు ఇచ్చారు.
ఈ భూమి లీజు రూపంలో ప్రతినెలా రూ.10 వేలు చెల్లించనున్నారు. ఇప్పటికే మూడు నెలల లీజ్ రూ.30 వేలు చెల్లించారు. కాగా, బంకులో 35 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన స్టోరేజీ ట్యాంకులు రెండు నిర్మించారు. వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ పోసేందుకు మూడు పాయింట్లు ఏర్పాటు చేశారు. అలాగే, బంకు నిర్వహించినందుకు మహిళలకు కంపెనీ సర్వీస్ చార్జీ చెల్లిస్తుంది. బంకులో మేనేజర్ తో పాటు ఆరుగురు మహిళలు (పంపు ఆపరేటర్లు) పనిచేస్తారు. 24 గంటలు పనిచేయనుండటంతో సాయంత్రం 6 నుంచి ఉదయం 9 గంటల వరకు పనిచేసేందుకు ముగ్గురు పురుషులను నియమించారు. బంకు నిర్వహణ బాధ్యతలు మహిళలే చూసుకుంటారని, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు మేనేజర్ గా వ్యవహరిస్తారని నారాయణపేట అదనపు డీఆర్డీఏ అంజయ్య తెలిపారు.
కలెక్టర్ ఆధ్వర్యంలో 15 రోజులకోసారి రివ్యూ
బంకు నిర్వహణలో పారదర్శకత కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ కమిటీ 15 రోజులకు ఒకసారి సమావేశం అవుతుంది. అడిషనల్ కలెక్టర్, డీఆర్డీవో పీడీ, అడిషనల్ పీడీ, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. బంకు నిర్వహణ, రాబడి, పెట్టుబడి, లాభనష్టాలు, ఇబ్బందులు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ తదితర అంశాలపై సమావేశంలో చర్చిస్తారు. నిర్వహణలో లోటుపాట్లపై జిల్లా సమాఖ్యకు అవగాహన కల్పిస్తారు.
అంతేకాకుండా బంకు నిర్వహణకు సంబంధించి కంపెనీ ప్రతినిధులు మహిళలకు వారం రోజులపాటు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. పెట్రోల్ ఎలా పోయాలి, నిర్వహణ తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు. బంకులో పనిచేసే ఆపరేటర్లకు నెలకు రూ.10 వేల నుంచి రూ.12 వేలు జీతం చెల్లిస్తారు. కాగా, మహిళా సంఘం ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు నిర్వహిస్తుండడంతో ప్రభుత్వ రంగ సంస్థలకు నడుపుతున్న వాహనాలు, పోలీస్ వెహికల్స్ కు పెట్రోల్, డీజిల్ ఇదే బంకులో పోయించుకునేలా నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిసింది.