రాష్ట్రంలో ఫస్ట్ డే 4,200 మందికి
కరోనా వ్యాక్సినేషన్‌కు రెడీ.. 3.84 లక్షల డోసులు సిద్ధం
గాంధీ, నార్సింగి రూరల్ హెల్త్ సెంటర్ వర్కర్స్‌తో మాట్లాడనున్న ప్రధాని
వారంలో నాలుగు రోజులు వ్యాక్సినేషన్
భయం వద్దు, నేనూ వ్యాక్సిన్ తీసుకుంటున్న: మంత్రి ఈటల
వ్యాక్సిన్ తీసుకున్నోళ్ల చేతి బొటన వేలికి సిరా చుక్క: హెల్త్ డైరెక్టర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌కు హెల్త్ డిపార్ట్‌మెంట్ సిద్ధమైంది. శనివారం తొలి రోజు వ్యాక్సినేషన్ కోసం 140 సెంటర్లను రెడీ చేసింది. ఇందులో హైదరాబాద్‌లో 14 సెంటర్లు ఉన్నాయి. గాంధీ హాస్పిటల్, నార్సింగి రూరల్ హెల్త్ సెంటర్‌లో ఇద్దరు శానిటేషన్ వర్కర్లకు తొలుత వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఈ ఇరువురితోపాటు, ఆ రెండు సెంటర్లలోని హెల్త్ స్టాఫ్‌తో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడనున్నారు. తొలిరోజు ఒక్కో సెంటర్‌లో 30 మంది చొప్పున, సుమారు 4,200 మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. వ్యాక్సిన్ వేసుకుంటామని ముందుకొచ్చిన ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌ను మాత్రమే తొలిరోజు వ్యాక్సినేషన్ కోసం ఎంపిక చేశారు. వీరిలో శానిటేషన్, సెక్యూరిటీ వర్కర్ల దగ్గర్నుంచి, డాక్టర్ల వరకూ అందరూ ఉన్నారు. వీరి పేర్లు, ఇతర వివరాలను ‘కొవిన్’ వెబ్సైట్, యాప్‌లో ఎక్కించారు. ఏ సెంటర్‌లో, ఏ సమయానికి వ్యాక్సిన్ వేస్తారో శుక్రవారం వీరి మొబైల్స్‌కు మెసేజ్‌లు అందాయి. మ్యానువల్‌గా ప్రతి సెంటర్‌లో ఓ రికార్డు ఏర్పాటు చేశారు. ఈ రికార్డులో లేదా ‘కొవిన్’లో పేరున్న వారికి మాత్రమే శనివారం వ్యాక్సిన్ వేయనున్నారు. వ్యాక్సినేషన్‌ను నిమ్స్‌లో గవర్నర్ తమిళిసై, గాంధీ హాస్పిటల్లో హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ ప్రారంభించనున్నారు. వ్యాక్సిన్‌పై నమ్మకం కలిగించేందుకు హెల్త్ స్టాఫ్‌తో పాటు మంత్రి ఈటల రాజేందర్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ రమేశ్‌రెడ్డి కూడా వ్యాక్సిన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ ఇద్దరూ గాంధీ హాస్పిటల్లో వ్యాక్సిన్ వేయించుకుంటామని ప్రకటించారు. చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్, హెల్త్ సెక్రటరీ రిజ్వీ కూడా ఇక్కడ వ్యాక్సినేషన్‌ను పర్యవేక్షించనున్నారు. తిలక్‌నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో వ్యాక్సినేషన్ తీరును మంత్రి కేటీఆర్ పరిశీలించనున్నారు.
వ్యాక్సినేషన్‌కు 2 గంటల ముందు సెంటర్లకు డోసులు
రాష్ట్రానికి 3.84 లక్షల డోసుల వ్యాక్సిన్‌ను కేంద్రం పంపించింది. ఇందులో 3.64 లక్షల కొవిషీల్డ్, 20 వేల కొవాగ్జిన్ డోసులు ఉన్నాయి. ప్రస్తుతం 11 డ్రగ్ స్టోరేజ్ సెంటర్లలో వీటిని భద్రపర్చారు. శనివారం ఉదయం వ్యాక్సినేషన్ ప్రారంభానికి రెండు గంటల ముందు వ్యాక్సిన్ డోసులను సెంటర్లకు తరలిస్తారు. ప్రతి సెంటర్‌లోనూ స్టోరేజ్‌కు అవసరమైన ఏర్పాట్లు కూడా చేశారు. తొలిరోజు ప్రతి సెంటర్‌లోనూ మూడు వయల్స్‌ను మాత్రమే వాడుతారు. ఒక్కో వయల్‌లో పది డోసుల వ్యాక్సిన్ ఉంటుంది. వ్యాక్సినేషన్ జరుగుతున్న ప్రతి సెంటర్‌లో కనీసం ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు వ్యాక్సినేటర్లను అందుబాటులో ఉంచుతున్నారు. వ్యాక్సిన్ వేసుకున్నాక వచ్చే రియాక్షన్ పరిశీలించి, నార్మల్ రియాక్షన్స్‌కు అక్కడే ట్రీట్‌మెంట్ అందిస్తారు. అవసరమైతే పెద్ద హాస్పిటళ్లకు తరలించేందుకు తొలి రోజు ప్రతి సెంటర్‌లో ఒక అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచుతున్నారు.
వారం తర్వాత ప్రైవేటోళ్లకు
రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ కోసం ఇప్పటివరకూ 3.15 లక్షల మంది రిజిస్టర్ చేయించుకున్నారు. ఇందులో లక్షన్నర మంది ప్రభుత్వ దవాఖాన్లలో పనిచేసేవాళ్లు ఉన్నారు. శనివారంతో మొదలు పెట్టి తొలి పది రోజులు వీరికే వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. తొలి రోజు వ్యాక్సిన్ వేసుకున్న 4,200 మంది ఆరోగ్యంగా ఉంటే.. సోమవారం నుంచి(ఆదివారం సెలవు) వ్యాక్సినేషన్ సెంటర్లను పెంచుతామని హెల్త్ డైరెక్టర్ ప్రకటించారు. ఇలా తొలి వారం, పది రోజుల్లో గవర్నమెంట్ స్టాఫ్‌కు వ్యాక్సిన్ వేసి, ఆ తర్వాత ప్రైవేట్ హాస్పిటళ్ల స్టాఫ్‌కు వ్యాక్సిన్ ఇస్తారు. ప్రతి సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో మాత్రమే కరోనా వ్యాక్సినేషన్ జరగనుంది. వ్యాక్సిన్ తీసుకున్నాక వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌ను ట్రీట్ చేసేందుకు 57 హాస్పిటళ్లలో ఏర్పాట్లు చేశారు.
గాంధీలో ఏర్పాట్లను పరిశీలించిన ఆఫీసర్లు
పద్మారావునగర్, వెలుగు: గాంధీ హాస్పిటల్లో కరోనా వ్యాక్సినేషన్ ఏర్పాట్లను శుక్రవారం జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ కె.రమేశ్‌రెడ్డి పరిశీలించారు. గాంధీ మెయిన్బిల్డింగ్లోని 8 వ ఫ్లోర్లో వ్యాక్సినేషన్ ఉంటుంది. టీకా తీసుకున్న వారిని 30 నిమిషాలపాటు అక్కడే ఉంచేందుకు అబ్జర్వేషన్ వార్డుతోపాటు ఎమర్జెన్సీ ట్రీట్‌మెంట్ కోసం ప్రత్యేకంగా ఐసీయూ గదులను కూడ ఏర్పాటు చేశారు. మొదటి రోజు 30 మందికి మాత్రమే టీకా ఇస్తామని, తర్వాత ప్రతిరోజు 600 మందికి ఇస్తామని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.రాజారావు, ఆర్ఎంవో –1 నరేందర్‌కుమార్ స్పష్టం చేశారు.
నేనూ వ్యాక్సిన్ వేసుకుంటున్నా
భయపడాల్సిన పని లేదు: ఈటల
కరోనా వ్యాక్సిన్‌ను తాను కూడా వేసుకుంటున్నానని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. శనివారం గాంధీ దవాఖానలో వ్యాక్సినేషన్ ప్రారంభోత్సవంలో పాల్గొంటానని, అక్కడే వ్యాక్సిన్ వేయించుకుంటానని చెప్పారు. ప్రజల్లో భయాలు, అనుమానాలను తొలగించేందుకే తానూ టీకా తీసుకుంటున్నట్టు వివరించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని రకాలుగా పరీక్షించాకే వ్యాక్సిన్ వాడకానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతిచ్చిందన్నారు. వ్యాక్సిన్ వేసుకోవడానికి భయపడాల్సిన అవసరమే లేదన్నారు. లక్షల్లో ఒకరికి రియాక్షన్ రావడం సహజమేనని, రియాక్షన్లొచ్చినా ట్రీట్ మెంట్‌కు ఏర్పాట్లు చేశామని అన్నారు. ప్రస్తుతానికి ప్రభుత్వ దవాఖాన్ల సిబ్బందికి వ్యాక్సిన్ వేస్తున్నామని, ఆ తర్వాత ప్రైవేట్ వాళ్లకు వేస్తామని ఆయన చెప్పారు. రాష్ర్టవ్యాప్తంగా అన్ని సెంటర్లలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, స్థానిక ప్రజాప్రతినిధులంతా వ్యాక్సినేషన్లో భాగస్వాము లవుతారన్నారు.
గర్వంగా ఉంది
రాష్ట్రంలో వ్యాక్సిన్ తీసుకునే తొలి వ్యక్తి నేనే కావడం సంతోషంగా ఉంది. హెల్త్ డిపార్ట్‌మెంట్‌కు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినందుకు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు. వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని నమ్ముతున్నా. అందరూ తీసుకోవాలని కోరుతున్నా.
– కె. జయమ్మ, సెకండ్ ఏఎన్‌ఎం, నార్సింగి పీహెచ్సీ, రంగారెడ్డి జిల్లా
నా కెరీర్‌లో ఇదే బెస్ట్ డే
కరోనా పీక్ టైమ్‌లో చాలా కష్టపడ్డాం. మా ఆఫీసర్లకు, మాకందరికీ కరోనా వచ్చి ఇబ్బంది పడ్డాం. ఇంత త్వరగా వ్యాక్సిన్ రావడం చాలా హ్యాపీగా ఉంది. ప్రధాని మోడీతో మాట్లాడే అవకాశం రావడం ఇంకా హ్యాపీ. నా 24 ఏండ్ల కెరీర్‌లో ఇదే బెస్ట్ డే అనుకుంటున్న. వ్యాక్సిన్ వేసేందుకు ఫుల్ ప్రిపేర్డ్‌గా ఉన్నాం.
– జి.తేజ, వ్యాక్సినేటర్, నార్సింగి రూరల్ హెల్త్ సెంటర్
నాకు దక్కిన అదృష్టం
తొలి రోజు కరోనా వ్యాక్సిన్ వేయించుకునే వాళ్లలో నేనూ ఉన్నా. ఫస్ట్ ఫేజ్‌లోనే టీకా వేసుకుంటున్నందుకు ఓ వైపు ఆనం దంగా కొంచెం భయంగా ఉంది. ఫస్ట్ డే వ్యాక్సిన్ తీసుకునేవాళ్లంతా ఇతరు లకు ఆదర్శంగా నిలుస్తారు. అందులో నేనూ ఉండటం నా అదృష్టం.
– కే.జ్యోతి, స్టాఫ్ నర్స్, ఇల్లందు గవర్నమెంట్ హాస్పిటల్
అనుమానాలు వద్దు
ఫస్ట్ వ్యాక్సిన్ వేసుకోబోతున్నాం అని ఉత్సాహంగా, ఉత్కంఠగా ఉంది. వ్యాక్సిన్ మీద అనుమానాలు, అపోహలు ఏమీ పెట్టుకోవద్దు.
– కె.రాధిక, స్టాఫ్ నర్స్, రాజీవ్‌నగర్ యూపీహెచ్‌సీ, సూర్యాపేట
For More News..