చేపలు చనిపోతున్నయ్​ .. పొల్యూషన్ వల్ల పనికిరాకుండాపోతున్న చెరువులు

చేపలు చనిపోతున్నయ్​ .. పొల్యూషన్ వల్ల పనికిరాకుండాపోతున్న చెరువులు

 

  • చిట్కుల్ పెద్దచెరువు చేపల మృతిపై హైకోర్టు సీరియస్
  • ఈ నెల16న విచారణ

సంగారెడ్డి/పటాన్ చెరు, వెలుగు: జిల్లాలో ఇండస్ట్రియల్ ఏరియా చుట్టూ ఉన్న చెరువుల్లో చేపలు చనిపోతున్నాయి. కలుషిత జలాలు చెరువుల్లో కలవడం వల్ల చేపల పెంపకం మత్స్యకారులకు కష్టంగా మారింది. పటాన్ చెరు, పాశమైలారం, జిన్నారం ఇండస్ట్రియల్ ఏరియాల్లో కాలుష్య పరిశ్రమల వల్ల ప్రతీ ఏడాది వానకాలం సీజన్ లో టన్నుల కొద్ది చేపలు మృత్యువాత పడుతున్నాయి. చేపల పెంపకానికి చెరువులు అనువుగా లేవని, కలుషిత జలాలను అరికట్టి చెరువులను శుద్ధి చేయాలని మత్స్యకారులు చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

ఇటీవల ఈ ఇష్యూపై పత్రికల్లో వచ్చిన వార్తలకు హైకోర్టు సంబంధిత శాఖలపై సీరియస్ అయింది. కేసును సుమోటోగా స్వీకరించి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతికుమారితో పాటు పశుసంవర్ధక శాఖ ప్రధానకార్యదర్శి, పర్యావరణ, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి, కాలుష్య నియంత్రణ మండలి, సంగారెడ్డి కలెక్టర్, మత్స్య శాఖ కమిషనర్, జిల్లా మత్స్యశాఖ అధికారులకు నోటీసులు జారీచేసింది. దీనిపై ఈనెల 16న విచారణ జరగనుంది. చిట్కుల్ పెద్ద చెరువులో చేపలు ఎందుకు చనిపోయాయో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు రిపోర్టులు తయారు చేయడంలో బిజీగా మారారు. 

ఉపాధి కోల్పోయిన100 కుటుంబాలు

పటాన్ చెరు మండలం చిట్కుల్ పెద్ద చెరువు 230 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ చెరువుపై ఆధారపడి వంద మత్స్యకారుల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. ఇటీవల సుమారు 10 టన్నుల చేపలు మృతి చెంది ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. ఎగువన ఉన్న పాశమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలోని కలుషిత జలాలను బహిరంగ ప్రదేశంలో వదలడంతో ఇస్నాపూర్ చెరువులో నుంచి నేరుగా చిట్కుల్ పెద్ద చెరువులోకి వచ్చినట్టు మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని మత్స్య శాఖ ఈడీకి సమాచారం ఇచ్చారు.

వారి ఫిర్యాదు మేరకు పొల్యూషన్ అధికారుల ద్వారా ప్రాథమిక రిపోర్టు సేకరించగా చెరువులో రసాయన జలాలు కలిసి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినట్టు నిర్ధారించారు. పూర్తిస్థాయి నివేదికలు వచ్చాక ప్రభుత్వానికి, న్యాయస్థానానికి రిపోర్ట్ అందజేస్తామని చెబుతున్నారు. పటాన్ చెరు, పాశమైలారం, జిన్నారం, ఖజిపల్లి, ఐడీఏ బొల్లారం, బండ్లగూడ, హత్నూర ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న దాదాపు 17 చెరువుల్లో ప్రతీ ఏడాది చేపలు చనిపోతున్నాయి. దీంతో మత్స్య కుటుంబాలు ఉపాధి కోల్పోతున్నాయి. 

నక్కవాగుకు తరలించండి

పాశమైలారం ఇండస్ట్రీ ఏరియా నుంచి వచ్చే కాలుష్య జలాలను పక్కనే ఉన్న నక్క వాగులోకి తరలించాలి. చెరువులను కాపాడితే చేపల ఉపాధి పెరిగి మత్స్యకారులు ఆర్థికంగా బాగుపడతారు. చేపల వృత్తిని నమ్ముకొని ఒక్క పెద్దచెరువు పరిధిలోనే వంద కుటుంబాలు జీవిస్తున్నాయి. చేపలు పట్టడం తెలిసిన మాకు వేరే పనులు చేయడం తెలియదు. అధికారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద చెరువును కాపాడి మాకు ఉపాధి కల్పించాలి. 

సింహాద్రి, మత్స్యకారుడు

పెద్ద చెరువును శుద్ధి చేయండి

చిట్కుల్ పరిధిలో ఉన్న పెద్ద చెరువును వెంటనే శుద్ధి చేయాలి. పరిశ్రమలు వదులుతున్న కాలుష్య జలాలు చెరువుల్లోకి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. కాలుష్య జలాలు వదిలే ఫ్యాక్టరీ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి. అవసరమైతే వాటిని మూసివేయించాలి. అప్పుడే మత్స్యకారులకు ఉపాధి లభిస్తుంది.  

నగేశ్, మత్స్యకారుడు