ఎడపల్లి, వెలుగు: మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చేపల పెంపకంపై దృష్టిసారించినట్లు బోధన్ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ అశోక్ సాగర్ చెరువులో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్స్య అభివృద్ధి పథకం కింద 2024 – 25 సంవత్సరానికి గాను వంద శాతం సబ్సిడీపై చెరువులు, రిజర్వాయర్లలో చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
చెరువులో మొత్తం 57,300 చేప పిల్లలు విడుదల చేయగా, అందులో బొచ్చ రకం 22920, రోహు రకం 28650 , బంగారు తీగలు 5730 ఉన్నాయన్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 2.27 కోట్ల చేప పిల్లలు చెరువుల్లో వదులుతామన్నారు. చెరువులు, జలాశయాలలో చేప పిల్లలను వదిలే ముందు మత్స్య కార్మిక సంఘాల సభ్యులు తప్పనిసరిగా వాటి నాణ్యతను పరిశీలించాలని సూచించారు. ఇబ్బందులుంటే జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు.
నిజామాబాద్–బోధన్ ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న అశోక్ సాగర్ చెరువు చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేయించేందుకు కృషి చేస్తానని, వివిధ చెరువులలో చేపల పెంపకానికి అవరోధంగా మారిన గుర్రపు డెక్కను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ అర్కల నర్సారెడ్డి, మత్స్యశాఖ జిల్లా అధికారి ఆంజనేయ స్వామి, మత్య్స కార్మిక సంఘాల ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.